CLEANUP IN CMO
సీఎంవోలో ప్రక్షాళన
కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ.. పాలనా ప్రక్షాళన ముమ్మరమైంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
వారికి పోస్టింగ్ ఇవ్వని కొత్త సీఎస్ నీరబ్
జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు
27వరకు జవహర్ సెలవుకు ఆమోదం
తప్పుకోవాలని నామినేటెడ్
పదవుల్లోని వారికీ సంకేతాలు
వారికి వారుగానే వెళ్లిపోయేలా చర్యలు
అమరావతి, జూన్ 7: కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ.. పాలనా ప్రక్షాళన ముమ్మరమైంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ప్రక్రియ వేగవంతమైంది. జగన్ హయాంలో సీఎంవోలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. కొత్త సీఎ్‌సగా బాధ్యతలు తీసుకున్న తొలిరోజే ఆయన ఈ ఆదేశాలు జారీచేశారు. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య పనిచేశారు. అప్పట్లో సీఎం సెక్రటరీగా రేవు ముత్యాలరాజు, సీఎం అడిషనల్ సెక్రటరీగా నారాయణ భరత్ గుప్తా ఉన్నారు. మరోవైపు, జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో నియమించిన వారిని సాగపంపే ప్రక్రియ మొదలైంది. చైర్మన్లు, డైరెక్టర్లు, బోర్డు మెంబర్ల నుంచి రాజీనామాలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు ఆదేశాలందాయి. కాగా, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సెలవును కొత్త సీఎస్ నీరబ్‌కుమార్ ఆమోదించారు. ఈ నెల 27వరకు ఆయన లీవులో ఉంటారు. ఆ తర్వాత తిరిగి వచ్చి జీఏడీలో రిపోర్టు చేస్తారు.