పుస్తకపఠనం అంటేనే వెఱ్ఱివాడిని చూసినట్టు చూస్తున్నారు. సినిమాలు చూస్తూ కాలం గడిపే జనం ఇంటర్నెట్ వచ్చాక యూట్యూబ్ వీడియోస్ రీల్స్ తో కాలం గడిపేస్తున్నారు. లైక్స్ , వ్యూస్ ని కీర్తి గా భావించి అనవసర సాహసాలతో పురుషులు, అంగాంగ ప్రదర్శనలతో స్త్రీలు వీడియోలు పెట్టేసి సెలిబ్రిటీలుగా మారినట్టు ఊహించుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఇలాటి వీడియోలని తప్పు పడుతూ తిడుతూ అనేకమంది తమ అభిప్రాయాలనుపెడతారు. ఆ వీడియోలు చేసేవారు అదే గొప్పగా భవిస్తుంటారు. ఇది ఎలాఉంటుందంటే రోడ్డు మీద చెత్త వేసి వచ్చే పోయే వాళ్ళు తిడుతూఉంటే , వారి సంఖ్యని లెక్కపెట్టుకుని మురిసిపోవడం లాంటిది. ఎదో ఒక పని చేసి నలుగురు దృష్టిలో పడిపోవాలని తాపత్రయం నేటి తరానికి ఎక్కువైపోయింది.
మంచి పని చేసి గుర్తిపు పొందాలని, మంచి సాహిత్యాన్ని ఆదరించాలని ఎంతమంది అనుకుంటున్నారు. మన రాష్ట్రంలో సాహిత్యాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు ?
సాహిత్యాన్ని మనం పట్టించుకోపోయినా సాహిత్యం మనని పట్టించుకుంటుంది. సాహిత్యాన్ని మనం వదిలేసినా సాహిత్యం మనని వదలదు. అదే మనకి దారి దిక్కు అవుతుంది. అది వేరేరూపంలో జాతిని నడిపిస్తుంది. నేటి తరం చెత్త సినిమాలు చూసి అవే ఫేషన్లను , మాటలను అనుకరిస్తూ అదే ప్రవర్తనలోకి తెచ్చుకుని అలమటిస్తున్నది.
ఒక చిన్న పుస్తకం ఇస్తే చదవలేని నేటి తరం పుస్తకానికి బదులుగా సినిమాని ఎంచుకుంది. అందుకే ఈ రోజుల్లో ఎం చెప్పాలన్నా కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయాల్సి వస్తోంది. పుస్తకాలకి సాహిత్యానికి కారు మబ్బులు కమ్మేసిన నేటి కాలంలో కారుమబ్బులలో కాంతి కిరణంలా శ్రీమతి అడపాతులసీ గారు తెలుగు సాహిత్యాన్ని ప్రేమించి భారతవర్ష లాటి అతిపెద్ద గ్రంధాన్ని ప్రతినిత్యం చదివి , ధనసహాయం కూడా చేసి ఆదరించారు. అందరూ ధనసహాయం చాలా గొప్పదిగా భావించవచ్చుగానీ అంతకంటే కంటే గొప్పదైనది మాట సహాయం. బ్లాగ్ లో పోస్ట్ చేసిన ప్రతి భాగం చదివి నిత్యం ఫీడ్బేక్ లు రాసి నన్ను ప్రోత్సహించి భారతవర్ష ని ముందుకు తీసుకువెళ్లిన అడపా తులసీగారు
తెలుగులో వెంకట్ పూలబాల రచించిన 1265 పేజీల భారతవర్ష సరళగ్రాంధిక ప్రబంధ రచన 8 నెలలు సాగింది. సరళ గ్రాంథికంలో, వృత్త పద్యాలతో , సంస్కృత గీతాలతో 142 అధ్యాయాలుగా వ్రాసి ప్రతిరోజు తన బ్లాగ్ లో పొందుపరుస్తుండగా, అడపాతులసీగారు నిత్యం ఆఫీసులో పనిచేసి అలసిపోయి 8.00 గంటలకు ఇంటికి చేరినా భారతవర్ష చదవకుండా పడుకునేవారు కాదు ఇంటిపని అంతా చేసుకుని అర్థరాత్రి దాకా కూర్చుని ఎనిమిది నెలలపాటు ఇలా చేయడంలో ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ఊహించుకోగలరు.
కానీ మీ ఊహకు అందని ఒక విషయం.
మన సమాజంలో పాఠకురాలు ఓకే రచయిత్రిని అభిమానించవచ్చు కానీ రచయితను అభిమానిస్తే ఏంజరుగుతుంది? అందరూ ఆమెని అనుమానించే అవకాశం ఉంది. అవకాశం ఉండడం కాదు అదే జరిగింది. అందుకే ఆమె తన పేరుని సాహిత్య ప్రియగా మార్చుకుని ఆపేరుతోనే ఫీడ్బ్యాక్ లు వ్రాసి బ్లాగ్ లో పోస్ట్ చేసేవారు . ఆమె ఇచ్చిన సాహిత్య స్ఫూర్తి అనితరసాధ్యం. అజరామరం. బారతవర్ష గ్రంధం నిస్సందేహంగా ఆమెకు ఇచ్చిన సాహిత్య నీరాజనం.