పేరులో ఏముంది ? ప్రజాస్వామ్యంలోనే అంతా ఉంది…
జీ 20 సమ్మిట్ డిన్నర్ కి (ఈనెల 9,10 ల్లో జరిగే) సంబంధించిన ఇన్విటేషన్ లో ‘ప్రసిడెంట్ ఆఫ్ భారత్’ అనే పేరుతో ఉండటంపై బుధవారం (సెప్టెంబర్ 5న ) దేశవ్యాప్తంగా దూమారం రేగింది. ప్రపంచానికి తెలిసిన పేరు ‘ఇండియా’ ను హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తుండగా, ఇండియా అనేది బ్రిటీష్ వారు పెట్టిందని దానిని వదిలివేయాల్సిందే అని మరికొంతమంది అంటున్నారు. నిజానికి దేశంలో అత్యవసరంగా చేయాల్సిన పనులు చాలా ఉండగా, అనవసరంగా, అప్రస్తుత అంశాలకు ప్రాధాన్యత వచ్చేలా రచ్చ చేయడం దేశంలోని మూడొంతుల సామాన్య జనానికి నచ్చని విషయం. అయినా ఊర్లు, ప్రాంతాల, దేశం పేర్లు మార్చినంత మాత్రాన దేశం ప్రగతిపథంలో దూసుకు పోతుందా ? పేరు ఏదైనా ప్రజలకు అవసరమైన పనులు చేయడం, ప్రజాస్వామ్య విలువలను పెంచడం వల్లే కదా … ప్రపంచ దేశాలు మన దేశానికి గుర్తింపు, గౌరవం వచ్చేది ?
కామెడీ కాకపోతే ఏంటి ?
టీం ఇండియా క్రికెట్ మాజీ కెఫ్టన్ సెహ్వాగ్ ఇండియా పేరు బ్రిటీషు వారి నుంచి వచ్చిందని, మన పేరులో మనలో గర్వాన్ని నింపేలా మన ఆటగాళ్ల ఛాతీపై ‘భారత్’ ఉండేలా చూడాలని భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జైషాకు ట్వీట్ చేశారు.
అసలు క్రికెట్ ఆటే బ్రిటీషర్లది.. సెహ్వాగ్ కు పేరు తెచ్చింది, తన కుటుంబం బ్రతుకుతున్నది దానిమీదే.. రేపు ఎవరైనా క్రికెట్ మన దేశపు ఆటకాదు.. దానిని బ్యాన్ చేయాలంటే … సెహ్వాగ్ అప్పుడేమంటారు ? క్రికెటర్లు ఏమవుతారు ? కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న క్రికెట్ బోర్డు (నిత్యం లాభాల్లో ఉండే) సంగతేంటి ? స్టార్ క్రికెటర్లను దేవుడిగా చూస్తున్న అభిమానులు ఏమైపోతారు ? ఈ ’భారత్‘ ప్రేమికులంతా క్రికెట్ ను బ్యాన్ చేయగలరా ? ఆ లెక్కకొస్తే రాష్ట్రపతి భవన్ కూడా బ్రిటీషువారే కట్టించారు .. మరి దాని సంగతేంటి ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
భారత్ పేరు మార్పుపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ..మనమందరం రాజ్యాంగాన్ని ఇంగ్లీషులో ఇండియన్ కాన్ స్టిట్యూషన్ అని హిందీలో భారత్ కా సంవిధాన్ అని పిలుస్తున్నాం. దీనిలో కొత్తదనం ఏముంది ? ఇండియా పేరు ప్రపంచానికి తెలుసు. హఠాత్తుగా దేశం పేరు మార్చాల్సినఅవసరం ఏమొచ్చింది.? అని ఆమె ప్రశ్నించారు..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అంటే భారత్ అని సూచిస్తున్నప్పుడు మళ్లీ ‘భారత్’ అని ప్రత్యేకంగా పిలవ వలసిన అవసరం ఏముంది ? యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా లేదా భారత్. ఇప్పటికే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో India that is Bharath గా ఉండటంతో సవరణ లేదా చట్టం చేయనక్కర్లేదని ఇకపై India ను భారత్ గా పిలుస్తామని పార్లమెంటులో తీర్మానం చేస్తే చాలని రాజ్యాంగ కోవిదులు చెబుతున్నారు.
పేరు మార్చితే మార్చాల్సినవి
ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1951 ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ ఎస్, సర్వీసులు ఇండియా పేరుతో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆర్మీ, ఐఐటీ, ఐఐఎం, ఇండియన్ క్రికెట్ టీం ఉన్నాయి. దేశం పేరును భారత్ గా మారిస్తే వాటన్నింటినీ మార్చాల్సి ఉంది. ఇందువల్ల సామాన్యులకు ఒరిగేదేమన్నా ఉందా ? ఎన్ డీఏ వ్యతిరేక కూటమికి I.N.D.I.A పేరు పెట్టినప్పటి నుంచి ఈ విషయంపై చర్చ లేచిందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. దేశాన్ని అభివద్ది చేస్తామని 9 ఏళ్ల క్రితం మోడీ అధికారంలోకి వచ్చారని అయితే ఇన్నేళ్లల్లో వాళ్లు చేసేది ఇదేక్కటేనన్నారు.
అనవసర రాద్దాంతం
ఇండియా పేరును భారత్ గా మార్చడానికి ముంబై ఇండియన్స్ వ్యతిరేకిస్తున్నారు. వరల్డ్ కప్ కోసం టీం ఇండియా జట్టును ప్రకటించడంతో రిప్రజెంటింగ్ ఇండియా అని ముంబై ఇండియన్స్ ట్వీట్ చేశారు. దీంతో భారత్ మద్దతుదారుల ఎంఐ అడ్మిన్ పై విమర్శలకు దిగారు వెంటనే భారత్ గా మార్చాలని , ఎంఐ టీం ఇండియాకు రిప్రజెంట్ చేస్తుందా అంటూ ఫైర్ అవుతున్నారు.
పవార్ ఫైర్
దేశం పేరు మార్చే హక్కులేదంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మండిపడ్డారు. దేశం పేరుపై అధికార పార్టీ ఎందుకు కలవరపడుతుందో తెలియడం లేదన్నారు. కూటమిలో దేశం పేరు మార్పుపై చర్చిస్తామన్నారు. దేశం పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ జై రాం రమేష్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై మండిపడుతున్నారు. ప్రజల్లో స్నేహం, సయోద్య, నమ్మకం తీసుకురావాలని ఆయన కోరారు. కాగా, గతంలో ఇండియా పేరును భారత్ లేదా హిందుస్థాన్ గా మార్చాలంటూ 2020లో దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈ అంశంలో తాము కలుగ చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్ అని ఎక్కువ మంది పిలుస్తున్నారని పేర్కొంది.
వెబ్ సైట్ల వెతలు
ఇండియానుంచి భారత్ గా మారితే వేలాది వెబ్ సైట్లకు కష్టాలు మొదలవుతాయి. ఎందుకంటే చాలా వెబ్ సైట్లకు . in అని ఉంటుంది. అంటే ఇండియా స్పెల్లింగ్ లోని రెండు అక్షరాలను అది సూచిస్తోంది. పేరుమారితే భారత్ అని స్పురించేలా అక్షరాలను మార్చాల్సి ఉంటుంది. బీహెచ్ , బీఎన్ అని పెట్టుకుందామనుకుంటే బీహెచ్ బెహ్రన్ కు, బీఎన్ బ్రెజిల్ ఉపయోగించుకుంటున్నాయి. కొత్తదాన్ని నెలకొల్పి మళ్లీ దానిని పాపులర్ చేయడమంటే మాటలు కాదు. ఏతా వాతా మనకు తెలిసిందేమంటే ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భారత్ పేరుమార్పు కూడా ఉంటుందన్నమాట. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడమో, యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు సబ్సిడీలు, మహిళలకు రక్షణ వంటివి చేపడితే దేశ ప్రజలు ఆనందిస్తారు. జీవితాలు మారనప్పుడు దేశానికి ఏ పేరు అయితే ఏంటి ? అని వారు నిరాశ చెందుతున్నారు.