Warren Buffett Money Lessons For Kids :
ఆర్థిక పాఠాలు నేర్పే గురువు -వారెన్ బఫెట్
వారెన్ బఫెట్ అనగానే ఒక మల్టీమిలియనీర్ గుర్తుకు వస్తారు. ఆయనను చాలా మంది మంచి పెట్టుబడిదారుడిగా, స్టాక్ మార్కెట్ నిపుణుడిగానే గుర్తిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, అయన యువతీయువకులకు ఆర్థిక పాఠాలు నేర్పే గురువు కూడా.
సీక్రెట్ మిలియనీర్స్ క్లబ్’ –
బఫెట్ తన యానిమేటెడ్ సిరీస్ ‘సీక్రెట్ మిలియనీర్స్ క్లబ్’ ద్వారా చాలా సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు. ముఖ్యంగా పిల్లలకు వ్యాపారం, పెట్టుబడి, స్మార్ట్ మనీ మేనేజ్‌మెంట్ గురించి చాలా సరళంగా ఆ సిరీస్‌లో బోధించారు.
వాస్తవానికి ఈ షో 2011లోనే ప్రసారం అయ్యింది. స్వయంగా బఫెట్ యానిమేటెడ్ పాత్ర రూపం ధరించి, వాస్తవ ప్రపంచ ఆర్థిక విషయాలను చాలా సులువుగా, పిల్లలకు కూడా అర్థమయ్యేలా రీతిలో వివరించారు.వారెన్ బఫెట్ ప్రకారం, ‘పిల్లలకు వీలైనంత త్వరగానే ఆర్థిక అక్షరాస్యతను కల్పించాలి. పెద్దయ్యాక చూద్దాంలే అనుకోకూడదు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్మార్ట్ మనీ మేనేజ్‌మెంట్‌ను నేర్పించాలి. డబ్బులను ఎలా పొదుపు చేయాలి. వాటిని అవసరాలకు ఎలా ఉపయోగించాలి. ఆర్థిక విషయాలను తెలివిగా ఎలా మేనేజ్ చేయాలి అనేది నేర్పించాలి.
అప్పుడే వారు జీవితాంతం ఆర్థికంగా విజయవంతంగా ఉంటారు’. మరి మీరు కూడా మీ పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నారా? అయితే వారెన్ బఫెట్ తన సొంత పిల్లలకు చెప్పిన 5 ముఖ్యమైన ఆర్థిక పాఠాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న వయస్సులో ఆర్థిక పాఠాలు :
పిల్లలు యుక్తవయస్సులోకి రాకముందే వారికి డబ్బు గురించి, దాని ప్రాధాన్యత గురించి తెలియజేయాలి. ఏడేళ్లలోపు పిల్లలు ప్రధాన ఆర్థిక అలవాట్లను తమకుతామే బాగా అభివృద్ధి చేసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల భవిష్యత్ అంతా ఆర్థికంగా విజయవంతంగా ఉండాలంటే, చిన్నప్పటి నుంచే వారికి డబ్బు నిర్వహణను అలవాటు చేయడం మంచిదని బఫెట్ సూచించారు. చెప్పడం ద్వారా, ఆచరణాత్మకంగా చూపడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ఆర్థిక పాఠాలు చెప్పాలని ఆయన సూచిస్తున్నారు.
పొదుపు నేర్పించాలి :
పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం నేర్పించాలి. కొద్ది మొత్తంలో పొదుపు చేసినా చాలు. కాలం గడుస్తున్న కొద్దీ అది చాలా పెద్ద మొత్తం అవుతుంది. భవిష్యత్ అవసరాలకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే అనవసరమైన ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకుని, పొదుపు చేసేలా పిల్లలను ప్రోత్సహించాలి. అంతేకాదు ఆ డబ్బుపై వడ్డీ వచ్చేలా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాలి. దీని ద్వారా డబ్బు ద్వారా డబ్బును ఎలా సంపాదించాలో పిల్లలకు తెలుస్తుందని బఫెట్ సూచిస్తున్నారు.
అవసరాలు Vs కోరికలు :
తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలియజేయాలి. పిల్లల చేత వారి కోరికల లిస్ట్ రాయించి, అందులో అవసరమైనవి ఏమిటి? అనవసరమైనవి ఏమిటి? విలాసవంతమైనవి ఏమిటి? అనేది తెలియజేయాలి. దీని వల్ల వాళ్లు యుక్తవయస్సులోకి వచ్చాక ఎలాంటి ఆర్థిక పరమైన తప్పులు చేయకుండా ఉండగలుగుతారు.
పిల్లల్లో జ్ఞానాసక్తిని పెంచాలి :
సింపుల్‌గా చెప్పాలంటే, పిల్లలు స్వయంగా ఆర్థిక అంశాలను చదివేలా చేయాలి. అలా వీలుకాకపోతే కోర్స్‌లు చేయించాలి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే చేయాలి. ఈ విధంగా జీవితాంతం ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను నేర్చుకుంటూ అభివృద్ధి చెందేలా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లలకు ఈ విధమైన మైండ్ సెట్ ఏర్పడేలా చేయాలి. అప్పుడే వారి భవిష్యత్ బంగారుమయం అవుతుంది. పాఠశాలకు వెళ్లి చదవడమే కాదు, డబ్బు విషయాలను ప్రత్యేకంగా నేర్చుకునేలా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి.
బిజినెస్ మైండ్ సెట్ :
వారెన్ బఫెట్ తన ఆరేళ్ల వయస్సు నుంచే సంపాదించడం ప్రారంభించారు. గమ్, వార్తా పత్రికలు అమ్మడం ద్వారా తొలిసారిగా ఆయన డాలర్లను సంపాదించారు. అందుకే ఆయన, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే బిజినెస్ మైండ్‌సెట్‌ను పెంపొందించాలని సూచిస్తుంటారు. దీని వల్ల పిల్లల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరిగి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించుకుంటారని ఆయన చెబుతుంటారు.
అంతేకాదు చిన్నప్పటి నుంచే తమ పిల్లల చేత చిన్నచిన్న వ్యాపారాలు చేయించి, కష్టపడి పనిచేయడం నేర్పించాలని, దీని వల్ల స్మార్ట్ మనీ మేనేజ్‌మెంట్ వారికి తెలుస్తుందని బఫెట్ సూచించారు.