ప్రతి నియోజవర్గానికీ విజన్ డాక్యుమెంట్
ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికల అమలు
స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా స్థాయి అధికారి నియామకం
పైలట్ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలకు విజన్ సిద్ధం… త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్
త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని హితవు
అమరావతి, మార్చి 17 : స్వర్ణాంధ్ర విజన్ – 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వాటిని అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు చెప్పారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో జరిగిన లఘ చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్‌ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నామని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్‌ను గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదుస్సులో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతి చివరి వ్యక్తిని కూడా విజన్‌లో భాగస్వామిని చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమేయడం కాకుండా… తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు తేవడంలో మీరు కూడా భాగములు అవ్వాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి…అలానే ఉపాధి కలగాలంటే పరిశ్రమలు రావాలి… సేవల రంగం వృద్ధితో ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
వికసిత్ భారత్ బాటలోనే… :
నాడు 2020 రూపొందించాం. వికసిత్ భారత్ 2047 విజన్ కింద 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కాగా, తలసరి ఆదాయం 18 వేల డాలర్లు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకుని నిర్ధష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాం. వృద్ధిరేటు, తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ రాళ్ల సీమ, ఎడారిగా మారుతుందని గతంలో అందరూ అనుకున్నారు. కానీ రతనాల సీమగా మారుతోంది. సీమ హార్టికల్చర్ హబ్‌గా మారుతోంది. రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్రంగా మారుతుంది. ఒకప్పుడు అనంతపురం కరవు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు సవాల్‌గా ఉండేవి. కృష్ణానది పక్కనున్న మహబూబ్ నగర్‌కు నీళ్లుండేవి కాదు. ఆ రెండు జిల్లాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాన్ని. విజయవాడ, శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాలకు నీళ్లున్నా అభివృద్ధిలేదు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా 26 జిల్లాల్లో 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ప్రతి కుటుంబానికి సొంతిల్లు :
నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. గత ప్రభుత్వం సెంటు పట్టాను ఊరికి దూరంగా ఇచ్చింది. దాంతో అవి ఎవరికీ పనికిరాకుండా, చాలీచాలనట్టుగా ఉండటంతో నిరుపయోగం అయ్యాయి. సెంటు పట్టా ఉన్నచోటనే స్థలం కావాలంటే రెండు సెంట్లు స్థలం ఇస్తాం. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మిస్తాం.
35 లక్షల మందికి పీ4 ఫలాలు :
రాష్ట్రంలో 35 లక్షల మంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వీరిలో మొదటి దశ కింద 20 లక్షల మందిని, రెండో దశలో 15 లక్షల మందిని పీ4లో భాగస్వాముల్ని చేస్తాం. పేదలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, గుర్తింపు ఇచ్చి గౌరవిస్తాం.
ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ వివరాలు ఇలా ఉన్నాయి…
స్వర్ణాంధ్ర-నియోజకవర్గాలు 2047 విజన్ :
వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నాం. దీనికి అనుగుణంగా ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటు లక్ష్యాంగా పెట్టుకున్నాం. 2047 నాటికి రాష్ట్రాన్ని రూ.308 లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది మా ప్రభుత్వ ఆశయం. తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేరుకునేలా ప్రణాళికలు అమలు చేస్తాం. దీనికి ‘సూక్ష్మం నుంచి సూక్ష్మం’ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఇప్పుడు నియోజకవర్గస్థాయిలో విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.
2047-48 నాటికి ఆర్ధిక వృద్ధి అంచనాలు :
వ్యవసాయం-అనుబంధ రంగాల ఆదాయం : 2024-25 కాలానికి రూ.5,17,482 కోట్లు ఉంటే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈ ఆదాయం రూ.6,02,728 కోట్లు అవుతుందని అంచనా. 2028-29 నాటికి రూ.8,91,331 కోట్లకు చేర్చడం లక్ష్యం.
పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం : 2024-25 కాలానికి రూ.3,40,387 కోట్లు ఉంటే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈ ఆదాయం రూ.3,99,358 కోట్లకు ఉంటుందని అంచనా. 2028-29 నాటికి రూ.6,32,748 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం.
సేవల ద్వారా ఆదాయం : 2024-25 కాలానికి రూ.6,12,045 కోట్లు ఉంటే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈ ఆదాయం రూ.7,10,714 కోట్లకు ఉంటుందని అంచనా. 2028-29 నాటికి రూ.11,69,728 కోట్లకు పెరిగేలా చూస్తాం.
ఇక 2047-48 నాటికి వ్యవసాయం, అనుబంధరంగాల ఆదాయం రూ.52,56,052 కోట్లు, పరిశ్రమల ఆదాయం రూ.74,00,083 కోట్లు, సేవారంగం రూ.1,55,88,891 కోట్లకు చేరుకునేలా రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను అమలు చేస్తాం.
ప్రస్తుత ధరల్లో జీఎస్డీడీపీ : 2024-25 కాలానికి రూ.15,93,062 కోట్లు ఉంటే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీ రూ.18,65,704 కోట్లు, 2028-29 నాటికి రూ.29,29,402 కోట్లు, అలాగే 2047-48 నాటికి రూ.3,08,11,722 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
అలాగే తలసరి ఆదాయం 2024-25లో రూ.2,98,058 ఉంటే, ఈ ఏడాది రూ.3,47,871, 2028-29లో రూ.5,42,985, 2047-2048 నాటికి రూ.54,60,748కి చేరుకుంటుంది.
ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి 2024-25లో 12.02 శాతం ఉండగా, 2025-26కు వృద్ధి 17.11 శాతం, 2028-29కి 16.23 శాతం, 2047-48కి 11.97 శాతం ఉంటుందని అంచనా.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు :
ప్రస్తుతం 5.3 కోట్లుగా ఉన్న జనాభా 2047 నాటికి 5.8 కోట్లకు చేరుకుంటుంది. అలాగే 70.6 ఏళ్లుగా ఉన్న సగటు జీవితకాలం 85 ఏళ్లకు పెరుగుతుంది. పట్టణ జనాభా 36 శాతం 60 శాతానికి చేరుకుంటుంది. 100 శాతం అక్షరాస్యత సాధిస్తాం. నిరుద్యోగ రేటు 4.1శాతం నుంచి 2 శాతానికి తగ్గనుంది. ఎగుమతులు రూ.1.68 లక్ష కోట్ల నుంచి 39.12 లక్షల కోట్లకు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
స్వర్ణాంధ్రకు పది సూత్రాలు :
స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారానికి 10 సూత్రాలు… స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు.
1. పేదరికం లేని సమాజం, 2. ఉద్యోగ, ఉపాధి కల్పన, 3. నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ది, 4. నీటి భద్రత, 5. ఫార్మర్ అగ్రిటెక్, 6. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, 7. ఇంథన వనరుల సమర్థ వినియోగం, 8. నాణ్యమైన ఉత్పత్తులు, 9. స్వచ్ఛాంధ్ర, 10. డీప్ టెక్.
విభాగాల వారీ థీమ్ విజన్ :
రాష్ట్ర విజన్, విభాగాల వారీ థీమ్ విజన్, జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్, మండలం-మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్… ఇలా ఐదు దశల్లో విజన్ ఫ్రేమ్ వర్క్ రూపొందించుకుంటున్నాం.
మండలం-జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ :
రాష్ట్రంలోని 686 మండలాలకు సంబంధించి బలాలు, అవకాశాలు గుర్తించాం. మండల స్థాయిలో ప్రాథమిక రంగంపైనా, కీ గ్రోత్ ఇంజిన్స్‌పైనా దృష్టి పెట్టాం. 2028-29 కల్లా విభాగాల వారీగా ఐదేళ్ల లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో ఇవి రూపొందించాం.
రాష్ట్రంలోని 26 జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నాం. మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేయడంతో పాటు… వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, గవర్నెన్స్‌కు లక్ష్యాలు ఈ విజన్ డాక్యుమెంట్‌లో సుస్పష్టంగా ఉన్నాయి.
నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ :
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అభివృద్ధికి మైక్రో లెవెల్ ప్లానింగ్ అనుసరిస్తున్నాం. ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలపై దృష్టి పెడతాం. రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో ప్రాజెక్టులు చేపడతాం. కుటుంబ స్థాయిలో అభివృద్ధి-సాధికారత సాధించడం, సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. పీ4 విధానం, జనాభా నిర్వహణ ప్రభుత్వ ప్రాధాన్యాలు.
2029 కల్లా హామీలు నెరవేరుస్తాం :
ప్రతి కుటుంబానికి కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రతి కుటుంబానికి ఇళ్లు, పారిశుధ్య సౌకర్యం, నీటి సరఫరా, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, డిజిటల్ కనెక్టవిటీ, ఎలక్ట్రిసిటీ, సోలార్ రూఫ్ టాప్, రహదారుల అనుసంధానం, డ్రైనేజీ నెట్వర్క్, వేస్ట్ టు వెల్త్, స్ట్రీట్ లైటింగ్, సోషల్ ఇన్ఫాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం.
ప్రణాళికల అమలుకు ఫ్రేమ్‌వర్క్ :
సచివాలయం, మండలం, మున్సిపాలిటీ, నియోజకవర్గం, జిల్లాల వారీగా విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. పీ4, జీరో పావర్టీ, బ్లూ ఎకానమీ, నాలెడ్జ్-ఇన్నోవేషన్, పాపులేషన్ మేనేజ్మెంట్ వంటి థీమ్ స్పెసిఫిక్ టాస్క్‌ఫోర్స్‌లను స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. చివరి అత్యుత్తమ అధికార కేంద్రంగా లీడర్‌షిప్ కౌన్సిల్ పనిచేస్తుంది.
సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు :
నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యే చైర్మన్‌గా, జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం. వీరికి సహాయంగా ఒక యంగ్ ఫ్రొఫెషనల్‌ను, జీఎస్‌డబ్ల్యుఎస్ నుంచి ఐదుగురిని నియమిస్తాం. ఈ మొత్తం వ్యవస్థను నియోజకవర్గ విజన్ మానిటరింగ్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. ఎమ్మెల్యే, ప్రత్యేకాధికారికి సమర్ధత, జవాబుదారీతనం పెంచేందుకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారం చేసుకుని ర్యాంకులను నియోజకవర్గం వారీగా ఇవ్వడం జరుగుతుంది.
నెలకోసారి రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖలు డిజిటల్ డ్యాష్ బోర్డు ద్వారా పురోగతిని పరిశీలిస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2 నెలలకు ఒకసారి, ముఖ్యమంత్రి 3 నెలలకు ఒకసారి విజన్ డాక్యుమెంట్ అమలును సమీక్షిస్తారు.
త్రిభాష విధానంలో తప్పేముంది.. :
ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు. కానీ భాష కేవలం కమ్యునికేషన్‌కు మాత్రమే. మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచ వ్యాప్తంగా రాణించారు. భాష అనేది ద్వేషించడంలో అర్థం లేదు. మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన వాళ్లు జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ భాషలను మనం నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంది