26/01/2026
విజయవాడ
కార్మిక చట్టాలు మరియు ఇతర కీలక అంశాలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో నిర్వహిస్తున్న 3వ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు విచ్చేసిన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శోభ కరణ్ దల్జే ను నోవాటెల్
వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషగిరి బాబు, లేబర్ కమిషనర్ గంధం చంద్రుడుతో పాటు శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక సంస్కరణలు, కొత్త కార్మిక చట్టాల అమలు విధానం, కార్మికుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి మరియు రాష్ట్ర–కేంద్ర సమన్వయంపై ఈ ప్రాంతీయ సదస్సు కీలకంగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల పెంపు దిశగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి శోభ కరణ్ దల్జే సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ, కార్మిక సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కార్మిక విధానాలపై సమన్వయం మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.

















































