ఇది మీ అందరి ప్రభుత్వం
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
మేనిఫెస్టో లో చెప్పిన దాని కంటే మిన్నగా చేశాం
కాపు పేద మహిళలకు అండగా ఉండాలనే వైయస్ఆర్ కాపు నేస్తం
వరుసగా ఐదేళ్ల పాటు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం
3,57,844 మందికి రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నాం
4 ఏళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247 కోట్లు ఇచ్చాం
రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు
45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు
సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారు
ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు
ఎల్లో మీడియా నిజాలను చూపించరు, అవినీతి పై మాట్లాడదు
నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారు
బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే
స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే
ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు
రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ?
ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ?
చట్టం ఎవరికైనా ఒక్కటే : సీఎం వైయస్ జగన్
మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి
మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం: సీఎం వైయస్ జగన్
నిడదవోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఏ ప్రభుత్వం వైయస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమం అమలు చేయలేదని చెప్పారు. కులం, మతం, రాజకీయాలు చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కేబినెట్‌లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందచేసే సాయంతో ఇప్పటివరకు (నాలుగేళ్లలో) ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అదించినట్లు పేర్కొన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘వైయస్ఆర్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్నిసీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
మీ అందరి ఆప్యాయతలు, చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు.., ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.., ప్రతి అవ్వాతాతకు, మీ అందరి ప్రేమానురాగాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఈరోజు నా అక్క చెల్లెమ్మల కోసం ఇంకో మంచి కార్యక్రమం జరుగుతుంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేదలైన వారికి ఏటా రూ. 15 వేల చొప్పున, అదే అక్కచెల్లెమ్మలకు వరసగా 5 ఏళ్ల పాటు, మొత్తంగా రూ. 75 వేల ఆర్థికసాయం చేసే… వైయస్సార్ కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నాం.
వరుసగా నాలుగో ఏడాది…
ఈ పథకంలో వరసగా నాలుగో ఏడాది, ఈరోజు, ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి, 3,57,844 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ. 536.77 కోట్లు నేరుగా జమ చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి.
ఈరోజు ఇస్తున్న మొత్తంతో కలిపి వైయస్సార్ కాపు నేస్తం పథకంలో ఇప్పటి వరకు, సుమారు రూ. 2029 కోట్ల ఆర్థిక సాయం చేసినట్టయింది.
ఈ ఒక్క పథకం ద్వారానే, ఇప్పటివరకు ప్రయోజనం పొందిన నా అక్కచెల్లెమ్మలు దాదాపు 4 లక్షల మంది. ఈ అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, ఆర్థిక స్వావలంబన రావాలని, నాలుగో దఫా కూడా ఇవ్వడంతో ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా రూ. రూ.60,000 ఇచ్చినట్టు అయింది.
నా అక్కచెల్లెమ్మల్లో పేదవాళ్లు ఎక్కడున్న వారికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో ఈ నాలుగేళ్లలో అడుగులు వేస్తూ వస్తాం. 45 నుంచి 60 ఏళ్ల వయసులో, అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్కచెల్లెమ్మల చేతిలో, ఈ డబ్బు పెడితే, అది ఆ కుటుంబానికి, ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకంతో…. వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆ పథకాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
వారికి ప్రతి ఏటా చేయిపట్టుకుని నడిస్తూ… ఏటా రూ.18,750 చొప్పున… వరసగా 4 సంవత్సరాలలో మొత్తం రూ. 75 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటి వరకు 26,39,703 మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ పథకంలో రూ. 14,129 కోట్లు అందజేశాం.
అలాగే పేదరికంలో ఉన్న ఏ అక్కచెల్లెమ్మకు అయినా అండగా నిలబడాలని.. ఓసీల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్క చెల్లెమ్మలకు వైయస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా… ఏటా రూ.15 వేల చొప్పున, వరసగా మూడేళ్లలో మొత్తం రూ. 45 వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ పథకంలో ఇప్పటి వరకు 4,39,068 మంది, నా అక్కచెల్లెమ్మలకు రూ. 1257 కోట్లు ఇచ్చాం.
ఇక, నా కాపు అక్కచెల్లెమ్మలకు కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో, మేనిఫెస్టోలో చెప్పకపోయినా, వైయస్సార్ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించాం. ఇది రాష్ట్ర చరిత్రలో, ఏ ఇతర ప్రభుత్వం, గతంలో ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమం.
మరో విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో అక్కచెల్లెమ్మల కోసం అమలు చేస్తున్న వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఈబీసీ నేస్తం, వైయస్సార్ కాపునేస్తం… కేవలం ఈ మూడు పథకాల ద్వారానే, వారిలో 34.37 లక్షల మందికి ఈ పథకాలతో తోడుగా ఉన్నాం.
మన ప్రభుత్వంలో జరిగిన మంచి….
రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక, వివిధ పథకాల్లో కాపులకు అందిన ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను, క్లుప్తంగా నాలుగు మాటల్లో చెపుతాను.
రాష్ట్రంలో ఈ నాలుగేళ్ళ కాలంలోనే 2.06 లక్షలమందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయాల్లో మన కళ్లెదుటనే దాదాపు 1.30వేల మంది పిల్లలు కనిపిస్తారు. వైద్య, ఆరోగ్యం, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటే… ఈ నాలుగు సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మరో 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 2.06లక్షల ఉద్యోగాలలో కాపు చెల్లెమ్మెలకు, తమ్ముళ్లకు లభించిన ఉద్యోగాలు… దాదాపు 9.5 శాతం.
సామాజిక న్యాయం నినాదం కాదు విధానం..
సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వంగా… కాపు సోదరులకు రెండు క్యాబినెట్లలో, ఒక్కో క్యాబినెట్‌లో నలుగురు మంత్రులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి నా పక్కనే కూర్చొబెట్టుకున్నాను. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 5 మంది మంత్రులు పక్కనే కనిపిస్తారు. ఉపముఖ్యమంత్రి పదవుల్లో ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో పాటు నా కాపుసోదరుడు కనిపిస్తాడు. కారణం ఇది మీ అందరి ప్రభుత్వం.
డీబీటీ ద్వారా కాపులకు రూ. 22,333 కోట్ల లబ్ధి.
అంతే కాకుండా మొత్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా 12 శాతం కాపు సోదరులకు, అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నవరత్నాల్లోని వివిధ పథకాలకు సంబంధించి, డీబీటీ ద్వారా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి.ఎక్కడా లంచాలకు చోటులేదు. వివక్షకు తావులేదు. కులం, మతం, రాజకీయాలు చివరకు ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడ్డం లేదు. నేరుగా బట్‌న్ నొక్కి నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఖాతాల్లో రూ. 2.31 లక్షల కోట్లు జమ చేయగా.. అందులో కాపులకు అందిన మొత్తం రూ. 22,333 కోట్లు.
నాన్ డీబీటీ పథకాల్లోనూ…
ఇవే కాకుండా నాన్ డీబీటీ పథకాలు… జగనన్న తోడు,గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు విలువ… ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ.5 లక్షలు అనుకుంటే….. ఈ నాన్ డీబీటీ పథకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, కేవలం వీటి ద్వారా నా కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో రూ.16,914 కోట్లు.
ఇళ్ల స్థలాలకు సంబంధించి చూస్తే, 2.46 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాం.
ఇలా… డీబీటీ, నాన్ డీబీటీ రెండు పథకాలను కలిపి చూస్తే కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు ఈ నాలుగేళ్లలో జరిగిన లబ్ధి రూ.39,247 కోట్లు.
10 శాతం మేలు కూడా చేయని చంద్రబాబు..
ఆలోచన చేయండి. మరి, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మనం ఖర్చు చేసిన రూ.39,247 కోట్లలో… కనీసం 10 శాతం కూడా ఇచ్చిన పరిస్థితిలు లేవు. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథ కమిషన్ పేరిట చేసినది ఒక మోసమైతే… కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాన్ని పంచడం సాధ్యం కాదని తెలిసి కూడా చేసినది మరో మోసం. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు…. మీ బిడ్డ ఎప్పుడూ మోసం చేయబోడు.
ఇక మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం.. ప్రతి ఏటా రూ.2 వేల కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని, ఇలా 5 ఏళ్లలో, కాపులకు రూ. 10 వేల కోట్లు ఇస్తామని మన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం.
కానీ, నాలుగేళ్లలోనే డీబీటీ, నాన్ డీబీటీతో వారి సంక్షేమానికి అంత కంటే ఎక్కువగా, మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ… దేవుడి దయవల్ల రూ.39,247 కోట్లు ఖర్చు చేశాం. మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. చేయలేనిది అబద్దాలు చెప్పకుండా.. చేయలేమని చెప్పామే తప్ప.. బాబు మాదిరిగా మనం ఎవరికీ మోసం చేయలేదు. మీ బిడ్డ చూపిస్తున్న ఇలాంటి నిజాయితీ లేకుండా.. తన జీవితమంతా సామాజిక వర్గాలన్నింటినీ కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకుని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టు అయిన ఒక మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెపుతాను.
చట్టం ఎవరికైనా ఒక్కటే…
ఆలోచన చేయమని మిమ్నల్ని కోరుతున్నాను. దురదృష్టమేమిటంటే.. ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబునాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కల్గిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు కానీ.. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు.
చట్టం ఎవరికైనా ఒక్కటే. ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పుచేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో… అధికారంలో ఉన్నవాళ్లకు కూడా అదే శిక్ష పడాలని చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారే ఇంతకాలం లేరు. ఇప్పుడు చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పే వాయిస్‌లు గళం విప్పుతున్నాయి. ఈ వాయిస్‌లు గళం విప్పేకొద్దీ ఈ దొంగల ముఠా సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు.
చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ మందుంచుతాను. ఆలోచన చేయండి.
బాబు అడ్డంగా దొరికినా.. అడ్డుగోలు వాదనలు..
చంద్రబాబు నాయుడు దొంగగా అడ్డంగా, నిలువునా దొరికినా కూడా… మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆడియో టేపులతోనూ, వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ వాళ్లు సర్టిఫికేట్ ఇచ్చి… నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ దొరికినా.. అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ అర్ధం అయినా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని…వాదించడానికి 10 కోట్ల ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి, ఆ దొంగతనాల్లో వాటాదారుల పదిమంది వెంటనే రెడీ అయ్యారు. అరడజను ఎల్లో ఛానెళ్లు, రెండు ఎల్లో పత్రికలు రెడీగా నిలబడ్డారు కానీ.. నిజంగా నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న వారిలో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే బాబు దొంగతనాల్లో వీళ్లు కూడా వాటాదారులు కాబట్టే.
ఆలోచన చేయండి. ఇంత అడ్డగోలుగా నల్లధనంతో డబ్బులిస్తూ.. ఆడియో, వీడియో టేపులతో దొరికినా, ఆ వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ వాళ్లు సర్టిఫికేట్ ఇచ్చినా… ఆ ఓటుకు కోట్లు ఇచ్చే కేసులో నీతి, న్యాయం, ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలన్నది ఆలోచన చేయండి. చట్టం వైపు నిలబడాలా ? దొంగల వైపు నిలబడాలా ? ఆలోచన చేయండి.
ప్రశ్నిస్తా అన్నవాడు…?
ఇంత బాహాటంగా, ఇంత ఆడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా … అన్నవాడు ప్రశ్నించడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ ఎల్లో మీడియా పత్రికలు, టీవీ ఛానెళ్లు నిజాన్ని చూపించరు. నిజాలను వినిపించరు. నోరెత్తరు. మాట్లాడరు. పైగా నిస్సిగ్గుగా.. ఆ పని సబబే అని సపోర్టు చేస్తారు. మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామన్నది ఆలోచన చేయండి. మరో ఉదాహరణ కూడా మీ అందరికీ చెబుతాను.
ఆధారాలతో చంద్రబాబుకు కోర్టు రిమాండ్…
లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంటును సృష్టించి.. ప్రభుత్వ నిబంధనలను అన్నింటినీ సాక్షాత్తూ చంద్రబాబే పక్కనపెట్టించారు. చివరకు ఆ సీమెన్స్ కంపెనీయే మాకు రూ.371 కోట్లు డబ్బు ముట్టలేదని, ఆ అగ్రిమెంట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదని లిఖిత పూర్వకంగా చెప్పినా.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ).. రూ.371 కోట్ల స్కిల్ స్కాంలో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన దొంగలను ఇప్పటికే అరెస్టు చేసినా… ఆ స్కిల్ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు, ఆధారాలు, నోట్ ఫైల్స్ ఉన్నా… బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్‌కు సంబంధించి నిబంధనలన్నింటికీ విరుద్ధంగా.. అధికారులందరూ డబ్బులు ఇవ్వొద్దని సలహా ఇచ్చినా.. వాటిని కూడా పక్కన పెట్టారు. ఏకంగా 13 సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చి మరీ సంతకాలు పెట్టారు. సీఐడీ వారు ఇవన్నీ స్వయంగా చూపిస్తున్నా కూడా ఆడబ్బును డొల్ల సూట్‌కేసు కంపెనీలకు ఎలా మళ్లించారో.. కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ కనుగొని వాళ్లు అరెస్టులు చేశారు. సాక్షాత్తూ చంద్రబాబు పీఏ ఇంకో కేసులో దీనితో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్‌ఫోన్లలో చాట్‌లు, ఈమెయిల్స్‌తో అడ్డగోలుగా దొరికిపోయారు. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ విచారణలో, ఐటీఏఆర్‌లో ఈ పీఏ ఇచ్చిన స్టేట్‌మెంట్ విషయాలను ఇన్‌కంటాక్స్ వాళ్లు నిర్ధారిస్తున్నా… ఈడీ అరెస్టు చేస్తున్నా.. ఏకంగా బాబుకు ఇన్‌కంటాక్స్ వాళ్లు ఆధారాలు చూపించి, నోటీసులు ఇస్తున్నా అది కూడా వాట్సప్ చాట్‌లు, ఈ మెయిల్స్ చూపి మరీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. చివరకు కోర్టుల్లో సుమారు పదిగంటలపాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత.. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్‌కు పంపించింది.
అయినా ఇంత బాహాటంగా, అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ ఎల్లో మీడియా అంతా నిజాలను చూపించరు. వివిపించరు. నిజాల మీద నోరెత్తి మాట్లాడరు. పైగా నిస్సిగ్గుగా మద్ధతు ఇస్తారు. ఎలాంటి వ్యవస్ధలో మనమంతా బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి. ఇవాళ రూ.371 కోట్లు ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందని ? చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరెవ్వరిని అరెస్టు చేయాలని కానీ.. ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు నోరెత్తరు. ఎల్లో మీడియాకు ఇది కనిపించదు. కారణం దొంగ వాళ్లవాడే కాబట్టి.. వాటాలు పంచుతాడు కాబట్టి నోరు విప్పరు.
ములాఖత్‌లో మిలాఖత్…
చివరకు ఏ స్ధాయిలోకి ఈ వ్యవస్ధలు దిగజారిపోయాయంటే… వీళ్లు రాసే రాతలు, వీళ్లు చేసే చేష్టలు చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. నిస్సిగ్గుగా పేపర్లో ఎడిటోరియల్స్ రాస్తారు. మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్త పలుకులు రాసేది ఒకడు. బాబు అవినీతిని దాచడానికి అష్టకష్టాలు పడేది ఇంకొరు. ఇంకొకరేమో… నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్‌లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేవారు ఇంకొకరు.
అందుకే ఎలాంటి మనుషులున్నారు ? ఎలాంటి వ్యవస్ధలున్నాయని ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇంత పెద్ద సొమ్ము, ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు… ఎవరి జేబులోకి ఈ డబ్బులు పోయాయి. ఆ దోచేసిన వాళ్లను జైళ్లలో పెట్టకపోతే మరెక్కడ పెట్టాలి? అని ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్ధలు.. ములాఖత్‌లలో మిలాఖత్ అయిపోతే రాష్ట్రంలో పరిస్థితిలు ఏమవుతాయని ఆలోచన చేయండి.
అందరికీ ఒక్కటే తెలియజేస్తున్నాను. మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. ఆ తర్వాత దాదాపుగా గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉందో.. మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా అదే బడ్జెట్ ఉంది.
వాళ్లకు ఎంత ఆదాయముందో మీ బిడ్డకు కూడా అంతే ఆధాయమార్గాలు. పైగా మీ బిడ్డ ప్రభుత్వంలో అనుకోకుండా కోవిడ్ కూడా వచ్చి.. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. అప్పులలో గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ రూ.2.35 లక్షల కోట్ల రూపాయలు ఈ నాలుగేళ్ల పరిపాలనలో నేరుగా బటన్ నొక్కి… అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ చేయగలిగాడు. వాళ్లు చేయలేకపోయారు. ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా. మీ అందరినీ ఒక్కటే కోరుతున్నాను.
వీళ్లందరికీ కండకావరమేమిటంటే.. మాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉంది. ఓ దత్తపుత్రుడి సపోర్టు ఉంది. కాబట్టి మేం దోచేసినా కూడా పంచుకున్నా కూడా ఎవ్వరూ మాట్లాడరు అన్న థీమా వాళ్లకుంది. కానీ మీ బిడ్డకు ఇవేవీ లేవు.మీ బిడ్డ వీళ్ల మీద నమ్మకం పెట్టుకోలేదు. మీ బిడ్డ దేవుడి దయను ఆ తర్వాత మిమ్నల్ని తప్ప మధ్యలో వేరేవాళ్లను నమ్ముకోలేదు.
మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి..
జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం మీ బిడ్డ పక్షాన ఉంది. అన్యాయం, మోసం, వెన్నుపోట్లు అటువైపు ఉన్నాయి. మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా నిలబడకపోవచ్చు. టీవీ5 తోడుగాఉండకపోవచ్చు. దత్తపుత్రుడు సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మీ అందరినీ కోరేది ఒక్కటే.
మీ బిడ్డ హయాంలో, ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ? లేదా ? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావాలని మిమ్నల్ని కోరుతున్నాను.
ఈ ప్రభుత్వం – పేదల గుండె చప్పుడు…
పేదల గుండె చప్పుడుగా, సామాజిక న్యాయానికి చిరునామాగా మీ బిడ్డ ప్రభుత్వం పనిచేసింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా దేవుడు ఆశీర్వదించి ఇంకా మెరుగైన పాలన ఇవ్వాలని, దేవుడి ఆశీస్సులతో ఇంకా మీకు ఉపయోగపడే పరిస్థితులు రావాలని, దేవుడి మీ బిడ్డ ప్రభుత్వాన్ని, మిమ్నల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.
చివరిగా…
కాసేపటి క్రితం నా సోదరుడు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం అడిగారు. బీటీ రోడ్డు, వశిష్ట రైట్ బ్యాంకు వర్క్… విజ్జేశ్వరం వరకు, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు 17 గ్రామాలకు సంబంధించి నిడదవోలు, పేరవాలి మండలాలకు మంచి చేసే రూ.66 కోట్ల ఈ వర్క్‌ను మంజూరు చేస్తున్నాను. మన దగ్గర ఉన్న సీహెచ్‌సీ మనం వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలతో బ్రహ్మాండంగా నడుపుతున్నాం. ఆ సీహెచ్‌సీను 100 పడకల ఆసుపత్రి చేయాలని అడిగారు. రూ.19 కోట్లతో దాన్ని కూడా మంజూరు చేస్తున్నాను. అదే విధంగా ఉండ్రాజవరం మండలానికి సంబంధించి అత్తిలి కెనాల్, వడలూరు గ్రామం బ్రిడ్జి కోసం అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాను. బీఆర్ అంబేద్కర్, బీసీ కమ్యూనిటీ, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, షాధీ ఖానా కోసం అడిగారు. ఇవన్నీ మంజూరు చేస్తున్నాను. నిడదవోలులో ఆర్టీసీ బస్ డిపో కోసం రూ.6 కోట్లు ఖర్చవుతుందన్నారు. అది కూడా మంజూరు చేస్తున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.