పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
దేశవ్యాప్త ర్యాలీ, ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది సంతకాలతో ప్రధాన మంత్రికి కోర్కెల పత్రం సమర్పించారు.
వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (తాప్రా) పిలుపు మేరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పోరాట స్ఫూర్తితో సామూహిక ప్రదర్శనలు నిర్వహించి గురువారం కలెక్టర్ల ద్వారా చీఫ్ సెక్రటరీకి వినతి పత్రాలను సమర్పించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఈపియస్, సింగరేణి తదితర పెన్షనర్లకు ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ అభినందనలు తెలిపారు.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీ.పి.ఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.ఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పి.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పెన్షనర్లు పొందేది జీవనభృతి కావున ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీలలో గతంలో రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
8వ కేంద్ర వేతన కమీషన్ (సి.పీ.సీ), రాష్ట్ర పే రివిజన్ కమీషన్ (పి.ఆర్.సీ)లను వేసి ఇంటరిమ్ రిలీఫ్ ను ప్రభుత్వాలు ప్రకటించాలని, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రీస్టోర్ కాలాన్ని 15 సంవత్సరాలకు బదులుగా 12 సంవత్సరాలకు కుదించాలని కోరారు. అన్ని జిల్లాల్లో వెల్ నెస్ సెంటర్లను ఏర్పరిచి వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని, నగదు రహిత చికిత్స వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ.పి.ఎస్- 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1000/- నుంచి పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పులను నిజ స్ఫూర్తితో అమలు పరచాలని, పెన్షన్ ఫండ్ల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణి తదితర కోల్ మైన్ పెన్షనర్ల కనీస పెన్షన్ ను రూ.350/-, రూ.250/- నుంచి పెంచాలని, కరువు భత్యం చెల్లించాలని, పెన్షన్ ను పెంచాలని వి.కృష్ణ మోహన్ కోరారు. సమస్యలు వెంటనే పరిష్కరించనట్లైతే ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు ఐక్యంగా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు.
వి. కృష్ణ మోహన్
నేషనల్ వైస్ చైర్మన్,
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ), కార్యదర్శి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసీయేషన్