అమరావతిలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Rayapudi, Amaravati:(26-01-2026)
రాష్ట్ర స్థాయి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజధాని అమరావతి నేలపాడులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పెరేడ్‌ను పరిశీలించి, తన సందేశాన్ని అందించారు. వేడుకల్లో ఇండియన్ ఆర్మీ, కర్నూలు ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, కేరళ రాష్ట్ర పోలీస్, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16 వ బెటాలియన్, ఎన్సీసీ (బాయ్స్), ఎన్సీసీ (గరల్స్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ (బాయ్స్ అండ్ గరల్స్), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బాయ్స్ అండ్ గరల్స్), యూత్ రెడ్ క్రాస్ (బాయ్స్) కంటింజెంట్స్ కవాతును నిర్వహించారు. కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ కు మొదటి స్థానం, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16 వ బెటాలియన్ కు రెండో స్థానం, కాన్సులేషన్ ప్రైజ్ గా కేరళ రాష్ట్ర పోలీస్ కంటింజెంట్ కు అందించారు. పెరేడ్ లో ప్రధానంగా బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ఆహుతులను అలరించాయి.
పెరేడ్ కు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ బీ. రాజకుమారి నోడల్ ఆఫీసర్ గాను, డీఐజీ డా. కె. ఫకీరప్ప కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గాను వ్యవహరించారు. పెరేడ్ కమాండర్ గా జంగారెడ్డి గూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత, పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ ఏపీఎస్పీ మొదటి ఐఆర్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ టీ.ఎన్. శ్రీనివాసరావు, పెరేడ్ అడ్జుటెంట్ కాకినాడ ఏపీఎస్పీ 3 వ బెటాలియన్ ఎం. శివరామకృష్ణ లు వ్యవహరించారు.
రిపబ్లిక్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దంపతులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు, పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జే. శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా,ఎస్పీ వకుల్ జిందాల్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్ధులు హాజరయ్యారు. అమరావతి రాజధానిలో నిర్వహించిన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి.
ఆకట్టుకున్న అలంకృత శకటాలు:
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధానిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాంస్కృతిక వారసత్వం, సామాజిక అవగాహన అంశాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు కనువిందు చేశాయి.
శకటాల్లో వందేమాతరం-150 సంవత్సరాల ఇతివృత్తంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రధమ, మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం తో రూపొందిన సెర్ప్ శకటానికి ద్వితీయ, పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇతివృత్తంగా రూపొందిన పరిశ్రమల శాఖ శకటానికి తృతీయ స్థానాల్లో నిలిచాయి. వీటితోపాటు జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి (Population Management & Human Resource Development), ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, నైపుణ్యం, ఉపాధి (Skilling & Employment) స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యా శాఖ, పర్యాటక శాఖ, (Water Security) జలవనరుల అభివృద్ది శాఖ, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖ లు, రైతు-వ్యవసాయ సాంకేతికత (Farmer – Agri Tech) తో వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ లు, మౌలిక వసతులు & పెట్టుబడులు, సముద్ర మరియు వైమానిక రంగాలు, సీఆర్డీఏ లు, వ్యయ అత్యుత్తమీకరణ (ఖర్చుతగ్గింపు) – శక్తి, ఇంధనం (Cost Optimization – Energy & Fuel) నెడ్కాప్ (ఇంధనం), ఉత్పత్తి పరిపూర్ణత (Product Perfection), చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ, స్వచ్ఛ ఆంధ్ర (Swachh Andhra) పురపాలక & పట్టణాభివృద్ది శాఖ (స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్), పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ, ఆర్టీజిఎస్ (RTGS) శాఖల శకటాలు ప్రభుత్వ సంకల్పం, ప్రజా సంక్షేమ లక్ష్యాలను స్పష్టంగా ఆవిష్కరించాయి. ఆధునిక సాంకేతికతతో పాటు సంప్రదాయ కళారూపాల మేళవింపుతో రూపొందిన శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
















































