కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులకు ఆదేశం
దుబాయ్, అక్టోబర్ 24 : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని పెద్దసంఖ్యలో ప్రయాణికులు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. హోంమంత్రి, రవాణా శాఖా మంత్రి, సీఎస్, డీజీపీ, స్థానిక డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్సీతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. గాయపడ్డవారికి పూర్తి స్థాయిలో వైద్యం అందేలా అధికారులు, మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


















































