పీ ఎస్ఆర్ఎంలో ఘనంగా టీచర్స్ డే’
సీఎం పూర్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరికి సన్మానం
– డాక్టర్ కార్తీక్ రాజేంద్రకు వీఎస్ రావు ఫౌండేషన్ అవార్డు
అమరావతి, సెప్టెంబరు 05:
ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మంగళవారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్వ ఐటీ సలహాదారు, ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త జేఏ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్లు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సృజనాత్మకతో కూడిన విద్యాబోధన ఎంతో అవసరమనీ, పరిశోధనలకు అనువుగా సరికొత్త లేబొరేటరీలను ఏర్పాటు చేసిన ఏపీ ఎస్ఆర్ఎంలో అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలు లభించడం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజకుమార్ అరోరా మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి ఏటా ఐదుగురు ప్రొఫెసర్లకు అవుట్ స్టాండింగ్ టీచర్స్ అవార్డులు అందజేయనున్నామని ప్రకటించారు. బెస్ట్ ఎక్స్పెరిమెంటల్, థియరీ, ఇండస్ట్రీ, సోషియల్ రీసెర్చ్, యంగ్ రీసెర్చ్ అవార్డుల కేటగిరీలో ప్రొఫెసర్లను ఎంపిక చేసి వీటిని ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా విశేషమైన సేవలందిస్తోన్న జేఏ చౌదరిని వేదికపై ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ వీఎస్ రావు ఫౌండేషన్ ద్వారా హెచ్ పీ తివారీ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డును ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్ కు అందజేశారు. ఈ అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను ప్రదానం చేశారు.
5 గురు ప్రొఫెసర్లకు ఉత్తమ టీచర్స్ అవార్డ్స్ …
ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం ఐదుగురు ప్రొఫెసర్లకు అవుట్ స్టాండింగ్ టీచర్స్ అవార్డులను ప్రదానం చేసింది. ప్రొఫెసర్ రంజిత్ తాపా , వీఎం మణికందన్, డాక్టర్ జితేంద్రకుమార్ దాస్, డాక్టర్ ఎండూరి మురళీకృష్ణ, డాక్టర్ స్రబానీబసులు ఈ అవార్డులను అందుకున్నారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మనోజకుమార్, ముఖ్య అతిథి జేఏ చౌదరిలు వీటిని అందజేశారు. ఈ అవార్డుల కింద రూ. 50 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందించారు. అనంతరం ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 17 మంది ప్రొఫెసర్లకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
యూనివర్సిటీ హెచార్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యూనివర్సిటీ సలహాదారు ప్రొఫెసర్ వీఎస్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమకుమార్, హెచ్ ఆర్ డైరెక్టర్ మనీష్ కుమార్ ఆనంద్, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ షీలా సింగ్, డీన్లు డాక్టర్ వినాయక్,
డాక్టర్ భరద్వాజ్, శివరంగన్ తదితరులు పాల్గొన్నారు.