అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం
ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

2026 మార్చి 16కి పూర్తి
మ్యూజియంగా శ్రీరాములు నివాసం
రాజధానిలోనే స్మారక కేంద్రం కూడా ఏర్పాటు చేస్తాం
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులపాటు కఠోర దీక్ష చేపట్టి, ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలోని నివాసాన్ని మ్యూజియంగా రూపుదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. గ్రామస్థుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని, తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఆయన గుర్తుంటారని పేర్కొన్నారు. శ్రీరాములు త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాందీ అని సీఎం అన్నారు.