అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులకు వైభవంగా అద్వేష్టక శిలాన్యాసము
– రూ.260 కోట్లతో తిరుమల తరహాలో శ్రీవారి ఆలయం
– దేవతల రాజధాని అమరావతిలా మన రాష్ట్ర రాజదాని అమరావతి
– ప్రజలందరు ఆరోగ్యం, సంపద, ఆనందంతో జీవించాలి
– రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ రెండవ ప్రాకారం అభివృద్ధి పనులకు గురువారం ఉదయం 11 నుండి 11.30 గంటల నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ, అద్వేష్టక శిలేష్టకాన్యాసం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం, నివేదనం, దివ్య సమర్పణ, హోమం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు.
మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు యాగశాలకు వేంచేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల వేద మంత్రాలు, మంళవాయిధ్యాలు, భక్తుల గోవిదంనామస్మరణల నడుమ గౌ|| ముఖ్యమంత్రివర్యులు పునాది రాయి వేయడంతో ఆలయంలో ద్వితీయ మహాప్రాకారము, చతుర్థ్యార గోపురముల నిర్మాణాము, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ పవిత్రమైన సంకల్పంతో మన రాజధాని అమరావతిలో తిరుమల తరహాలో శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో పనులకు భూమి పూజ చేశామన్నారు. కృష్ణా నది ఒడ్డున శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అదే మనకు శక్తి నిస్తుందన్నారు. దేవతల రాజధాని అమరావతి ఎలా ఉండేదో, అదే తరహాలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. శ్రీవారికి అప్రతిష్టపాలు చేసే ఏ పనిని చేయనని, శ్రీవారి సన్నిధిలో ఉన్నపుడు పవిత్రంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ఓ సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శిస్తున్నానని, గతంలో తప్పు చేసిన వారిని రెండు మూడు తరాల తర్వాత శిక్ష అనుభవించేవారని, ఇపుడు ఈ జన్మలోనే శ్రీవారు శిక్షిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్టీఆర్ ఉండగా టిటిడిలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారని, తాను ముఖ్యమంత్రిగా స్విమ్స్ లో ప్రాణదానం స్కీం ను ప్రారంభించామన్నారు. 23 క్లైమోర్ బాంబులు పెట్టినా శ్రీవారు ప్రాణభిక్ష పెట్టారన్నారు. అమరావతిలో 25 ఎకరాల్లో రూ.260 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని పూర్తి చేసే బాధ్యత టిటిడి తీసుకోవాలని కోరారు. ప్రతి మనిషికి ఆరోగ్యం, సంపద, సంతోషం ఉండేలా పాలన అందిస్తామన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా 29 వేల మంది రైతులు, 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతులను అభినందిస్తున్నానన్నారు.
అటు తర్వాత, గౌరవ ముఖ్యమంత్రివర్యులు అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి
ఆలయంలోని ధ్వజస్తంభానికి, నమస్కరించి, స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గౌ.ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు అందించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ, సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పలువురు టిటిడి బోర్డు సభ్యులు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పలువురు అర్చకులు, శ్రీవారి సేవకులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







































