తేది:27.11.2025
అమరావతి
రాపిడోతో ఏపీ పర్యాటక శాఖ జోడి.. దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్-కం-గైడ్’ సేవలు
త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో సేవల ప్రారంభానికి సన్నాహాలు
అమరావతి: పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ అందాలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్-కం-గైడ్’ విధానాన్ని ఏపీ పర్యాటక శాఖ ఆవిష్కరించింది. సీఎం చంద్రబాబునాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి మరియు రాపిడో సహ-వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి సమక్షంలో ఏపీ ప్రభుత్వానికి, రాపిడోకు మధ్య ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఎంఓయూ ద్వారా రాపిడోలో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆతిథ్యం, భద్రతపై వచ్చే నెల నుంచి పర్యాటక శాఖ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఈ సేవలు ప్రారంభించనుంది. రాపిడో యాప్‌లోనే టూరిస్ట్ ఆటోలు/క్యాబ్‌లు, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక కో-బ్రాండెడ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి పర్యాటక సేవలను సులభతరం చేయనుంది. దీనివల్ల క్యాబ్, ఆటో డ్రైవర్లకు ఆదాయం కూడా పెరుగుతుంది. టెక్నాలజీ సాయంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్, పర్యాటక రవాణాలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం కాగా, ప్రపంచవ్యాప్తంగా అరుదైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
















































