కరీముల్లా కవిత్వం
—————————-
ప్రతిజ్ఞ
————
భారత దేశం నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు
పలికీ పలికి నా హృదయం
గడ్డకట్టి కల్లోల శిఖరమయ్యింది
బోనులో ముద్దాయి గానే
నా జవసత్వం ఉడిగిపోయింది
ఏమని నిరూపించను?
నా పౌరసత్వం!
నీ కుటిల చాణుక్యాల ముందు
నీ మత విద్వేషపు చట్టాల ముందు.
భారతీయులందరూ నా సహోదరులు
మొగ్గతనం నుండే మీనార్ పావురాయినై
ఎలుగెత్తిన అజాన్ నై విన్పిస్తూనే ఉన్నా
నువ్వెప్పుడు విన్నావని!
నువ్వెప్పుడు వింటావని!
మా ముత్తాతల చెవుల్లో
నువ్వు కరిగించిన సీసం అయ్యాకే కదా!
వాళ్లు కలిమా చదివి మా కనుపాపలయ్యింది.
కుళ్ళిన శవం కంపుగొడ్తున్న
నీ కులాల రొంపి నొదిలే కదా!
సజ్దాల సామరస్యాలయ్యింది.
నువ్వు నాలుక తెగ్గోస్తేనే కదా!
నిన్ను ఎడం కాలితో తన్ని
అల్లాహోఅక్బర్ నినాదమయ్యింది.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను
నేనసలు ప్రేమించనిదెప్పుడు?
నఖశిఖపర్యంతం ప్రేమికుడ్ని కదా!
తల్లిని,చెల్లిని,ఆలిని,ఆకలిని
మట్టిని,మృత్యువును
సమంగా ప్రేమించిన వాడ్ని
నిన్ను ప్రేమించలేనా!
నేనీ దేశ పౌరుడ్నని
నీకే రుజువులు చూపను?
ఎర్రకోట బురుజుల నడుగు
నా రక్తం మెరుగులు చూపుతుంది.
దేశ విముక్తికై నే ముద్దాడిన
ఉరికొయ్యల నడుగు
మరణించడమంటే జీవించడమని చెప్తాయి.
యిదిగో!
నన్ను కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో
బందీని చేస్తావా!
నా కాళ్లు పాతాళంలో
నా శిరస్సు ఆకాశంలో
నా దేహం దేహమంతా
భూమండలం నిండా
విస్తరించింది జాగ్రత్త!.
