ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుమీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జిల్లా కలెక్టర్లుగా ఎంతోమంది గొప్పగా పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని, వారి స్ఫూర్తి తో పనిచేసి అభివృద్ధిని కొనసాగిస్తా మన్నారు. ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారులు, ఇతరుల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా గణనీయమైన పాత్ర పోషించాలని, ప్రభుత్వం చేసే మంచి పనులను అందరికీ తెలియజేయాలన్నారు.
2013 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన హిమాన్షు శుక్లా , విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకుని మొదటి పోస్టింగ్ తిరుపతి సబ్ కలెక్టర్ గా పనిచేశానని, అనంతరం టూరిజం డైరెక్టర్ గా, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్ గా, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా పనిచేశానన్నారు. అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా పనిచేస్తూ నెల్లూరు జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని వివరించారు.