26 నుండి పాన్ ఇండియా ప్రచార కార్యక్రమం
గుంటూరు, జనవరి 22 : బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమంను ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిర్వహించాలని
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పెద్ద ఎత్తున అన్ని శాఖలు సమష్టిగ కృషి చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలు అరికట్టాలని స్పష్టం చేశారు. రక్షించిన చిన్నారులకు వెంటనే సిడబ్ల్యుసి (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ఎదురుగా భౌతికంగా లేదా వర్చువల్ గా హాజరు పరచాలని అనంతరం పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. రక్షించిన పిల్లల భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు నివారణలో భాగంగా చేపడుతున్న పాన్ ఇండియా ప్రచార కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించుటకు తగిన షెడ్యూల్ ను తయారు చేయాలని, తదనుగుణంగా అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని చెప్పారు.
కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రి దేవి మాట్లాడుతూ కార్మిక శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, బాలల సంరక్షణ అధికారి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.















































