ADVERTISEMENT
అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం
*అక్టోబర్ 4న పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ
*ఉత్సవ తేదీలను ప్రకటించిన అసిస్టెంట్ కమిషనర్, ఈవో కె.ఎల్. సుధారాణి
విజయనగరం, ఆగస్టు 31 ః ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 31న నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. తిథి, వార నక్షత్రాలను అనుసరించి నిర్ణయించిన ముహుర్తం ప్రకారం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే నవంబర్ 7వ తేదీన పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు.
అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, అక్టోబర్ 25న అర్థమండలి దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న ఛండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పేర్కొన్నారు. సిరిమాను పూజారి బి. వెంటకరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు.
సమావేశంలో సిరిమాను పూజారి బి. వెంకటరావు, వేద పండితులు తాతా రాజేశ్ బాబు, దూసి శివప్రసాద్, వి. నర్శింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్. అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT