Sri Kolusu Parthasarathy, the State Minister for Information & Public Relations and Housing, briefed the media at the Publicity Wing of the State Secretariat’s Fourth Block regarding the decisions taken on various issues during the Cabinet meeting.
తేదీ.26.03.2026
తే.26–03–2026 దీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1383 వ (46వ)
క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…
హోం శాఖ
1. హోం శాఖ:
గుంటూరు జిల్లా నీరుకొండలో SRM యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు ‘అకడమిక్ భవనాలు’ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. AP ఫైర్ సర్వీసెస్ చట్టం ప్రకారం మరియు నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన అగ్ని మరియు జీవ భద్రతా చర్యలన్నింటినీ తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు.
సాధారణంగా నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) 2016 నిబంధనల ప్రకారం విద్యాసంస్థల భవనాలు 30 మీటర్ల ఎత్తు వరకే ఉండాలి. అయితే వర్సిటీలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడానికి, అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని పూర్తిగా వాడుకుని పెరుగుతున్న విద్యార్థుల రద్దీకి తగ్గట్లు భవనాలు నిర్మించడానికి ఈ ఎత్తు సడలింపు అవసరమని ప్రభుత్వం భావించింది. దీనికోసం మున్సిపల్ (MAUD), అగ్నిమాపక శాఖలతో చర్చించి ఈ అనుమతి ఇచ్చారు. నిర్మాణం పూర్తయ్యాక కూడా ఎప్పటికప్పుడు ఫైర్ ఎన్‌ఓసీ (NOC) రెన్యువల్ చేయించుకోవడం, ఆకస్మిక తనిఖీలు చేయడం తప్పనిసరి.
న్యాయ శాఖ (కోర్టులు)
2. న్యాయ శాఖ (కోర్టులు):
గౌరవ హైకోర్టు ప్రతిపాదించిన విధంగా (i) 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి మరియు వాటికి నామకరణం చేయడానికి, (ii) అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి, (iii) ప్రతి కోర్టులో మసాల్చి సేవలను అడ్మిన్ ఖర్చుల్లో భాగంగా అవసరమేరకు వినియోగించడానికి, మరియు (iv) న్యాయాధికారుల పోస్టుల సంఖ్యను సంబంధిత కేడర్ స్ట్రెంత్‌లో చేర్చడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
“ఏ కేసు కూడా ఐదేళ్లకు మించి పెండింగ్‌లో ఉండకూడదు, ప్రతి పది లక్షల జనాభాకు 50 మంది జడ్జీలు ఉండాలి” అని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 2500 కోర్టులు ఉండాలి, కేసుల సంఖ్యను బట్టి చూసుకుంటే కనీసం 1420 నుంచి 1500 కోర్టులు అవసరం. 2025 నాటికి రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య ఏకంగా 8.9 లక్షలు దాటిపోయింది. అందుకే ముందుగా ఫేజ్-1 కింద ఈ 96 కోర్టులను తక్షణమే మంజూరు చేశారు.
పరిశ్రమలు & వాణిజ్యం (మైన్స్)
3. పరిశ్రమలు & వాణిజ్యం (మైన్స్):
వడ్డెర సంఘాలకు క్వారీ లీజులు ప్రాధాన్య ఎంపిక ప్రాతిపదికన కేటాయించడానికి మరియు ప్రీమియం మొత్తం మరియు సినరేజీ ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి ప్రతిపాదిత మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
వడ్డెర సామాజిక వర్గం తరతరాలుగా ఎక్కువ మంది రోడ్డు మెటల్, కంకర, రాళ్లు కొట్టే పనుల్లో ఉన్నారు. అయితే 2022లో అప్పటి ప్రభుత్వం క్వారీలను వేలం (ఆక్షన్) పద్ధతిలో ఇవ్వడం మొదలుపెట్టాక.. వడ్డెరలకు తీవ్ర అన్యాయం జరిగింది. గడచిన రెండున్నరేళ్లలో 300కు పైగా వడ్డెర సంఘాలున్నా ఒక్క లీజు కూడా వాళ్లకు దక్కలేదు. వాళ్ల జీవనోపాధిని కాపాడేందుకు 2025 మైనర్ మినరల్ పాలసీలో పాత పద్ధతిని తిరిగి తెచ్చారు. దీనిద్వారా 15 శాతం క్వారీలను (ఒక సొసైటీకి గరిష్టంగా 12 హెక్టార్లు) వడ్డెరలకు రిజర్వ్ చేస్తారు. ఈ లీజులను వేరే వాళ్లకు అమ్ముకోవడానికి మాత్రం వీల్లేదు.
వెనుకబడిన వర్గాల సంక్షేమం
4. వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ :
చిత్తూరు జిల్లా కుప్పంలో జి.ఓ.ఎంఎస్.నం.04, BCW(B) శాఖ, తేదీ:06.05.2025 ద్వారా కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (MJPAPBCWR) స్కూల్ (గర్ల్స్)లో ఇప్పటికే మంజూరైన పోస్టులకు (9 టీచింగ్ + 17 నాన్-టీచింగ్) అదనంగా — 1 PET పోస్ట్ నెలకు రూ.16,350/- గెస్ట్ బేసిస్‌లో, 1 స్టాఫ్ నర్స్ పోస్ట్ నెలకు రూ.19,350/- గెస్ట్ బేసిస్‌లో, మరియు 1 రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ నెలకు రూ.15,000/- అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో మంజూరు చేయడానికి మరియు సదరు జి.ఓ. ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది.
కుప్పం నియోజకవర్గంలో ఇప్పటిదాకా బాలికల కోసం ప్రత్యేకంగా ఒక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా లేదు. వెనుకబడిన వర్గాల ఆడపిల్లలకు మెరుగైన చదువు, వసతి కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త స్కూలును తెచ్చారు. ఆర్థిక శాఖ అనుమతితో తీసుకొచ్చిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవాడలోని MJPAPBCWR విద్యా సంస్థల సొసైటీ చూసుకుంటుంది.
పురపాలక & పట్టణాభివృద్ధి
5. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
AP మునిసిపాలిటీస్ యాక్ట్, 1965లోని సెక్షన్ 387-A మరియు మునిసిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, 1955లోని సెక్షన్ 679-E కింద కల్పించిన అధికారాలను వినియోగించి, పురపాలక మరియు మునిసిపల్ కార్పొరేషన్లలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని ఒక్కసారి మాత్రమే వర్తించే చర్యగా మాఫీ చేయడానికి జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నం.58, MA&UD(C) శాఖ, తేదీ:16.03.2026 ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ మాఫీ అనేది పేరుకుపోయిన వడ్డీలో సగానికి (50%) మాత్రమే వర్తిస్తుంది. అంటే పన్ను బకాయి మొత్తంతో పాటు మిగిలిన 50% వడ్డీని ఒకేసారి చెల్లిస్తేనే ఈ ప్రయోజనం కలుగుతుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకే ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్ల వృద్ధి రేటు బాగుండాలి, కానీ మన రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 76 సంస్థలు వసూళ్లలో వెనుకబడ్డాయి. సుమారు రూ. 2,409 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, టాక్స్ కట్టేవారికి భారం తగ్గించి వసూళ్లు పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
06. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ (అమరావతికి స్పష్టమైన చట్టబద్ధత):
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సవరణల ప్రతిపాదనల కింద:
ఎ) సెక్షన్ 5లోని సబ్-సెక్షన్ (2)లో “అమరావతి వద్ద (at Amaravati)” అనే పదాన్ని చేర్చాలని; మరియు
బి) సెక్షన్-5 వివరణకు “మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) చట్టం, 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి” అనే పదాలను చేర్చాలని తీర్మానించనున్నారు.
జలవనరుల అభివృద్ధి
7 & 8 -ఈ రెండు నిర్ణయాలు రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతం చేయడానికి తీసుకున్నవి. పనులు సరిగ్గా చేయని పాత కాంట్రాక్టర్లను తప్పించి, కాలువలకు సిమెంట్ లైనింగ్ చేసి డిజైన్ ప్రకారం పూర్తిస్థాయిలో నీళ్లు పారేలా చూడటమే ఈ రెండు నిర్ణయాల ప్రధాన ఉద్దేశం.
7. జలవనరుల అభివృద్ధి శాఖ:
జి.ఓ.ఎంఎస్.నం.29, WR (Projects-III) శాఖ, తేదీ:7.6.2021 ద్వారా సేవింగ్స్ అకౌంటు పరిధిలో మంజూరైన రూ.606.03 కోట్లతో రెండు పనులకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది: (i) HNSS ప్రాజెక్ట్ – ఫేజ్-I – ప్యాకేజ్ నం.36A (బ్యాలెన్స్ వర్క్), మరియు (ii) HNSS మెయిన్ కెనాల్ Km 188.200 వద్ద ఫీడర్ చానల్ తవ్వకం మరియు ఆఫ్ టేక్ స్లూయిస్ నిర్మాణం (బ్యాలెన్స్ వర్క్).
ప్యాకేజీ 36 పాత కాంట్రాక్టర్ సరిగ్గా పని చేయకపోవడంతో అతన్ని తొలగించారు. ఆ మిగిలిన పనులు చేస్తేనే 55,608 ఎకరాలకు నీరు అందుతుంది. ఇక పుంగనూరు కెనాల్ విషయానికొస్తే.. అక్కడ ఊహించిన దానికంటే ఎక్కువగా గట్టి రాళ్లు (hard-rock) బయటపడటం, మట్టి సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని మార్చాల్సి రావడం, గట్లు వెడల్పు చేయాల్సి రావడం వల్ల ఖర్చు 51% పెరిగింది. కాలువ డిజైన్ ప్రకారం పని జరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.
8. జలవనరుల అభివృద్ధి శాఖ:
శ్రీ సత్య సాయి జిల్లాలో HNSS ఫేజ్-II పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను Km.0.000 నుండి Km.22.200 వరకు (చెర్లొపల్లి రిజర్వాయర్ వరకు) సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌తో ఆధునీకరించే పనికి – ఇంతకు ముందు జి.ఓ.ఆర్‌టీ.నం.404, WR (P.III) శాఖ, తేదీ:03.12.2024 మరియు జి.ఓ.ఆర్‌టీ.నం.197, WR (MI.G) శాఖ, తేదీ:6.5.2025లో మంజూరైన రూ.112,40,00,000/-కు బదులుగా సవరించిన రూ.169,80,00,000/- అంచనాకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.
క్షేత్రస్థాయిలో కాలువను పరిశీలించినప్పుడు గట్లు వెడల్పు చేయాల్సి రావడం, ఎక్కువ గట్టి రాళ్లు (hard-rock) బయటపడటం, పనికిరాని మట్టిని తీసేసి కొత్త మట్టి పోయాల్సి రావడం వల్ల ఈ ఖర్చు పెరిగింది. కాలువ ద్వారా నీటి ప్రవాహం సాఫీగా జరిగి రిజర్వాయర్‌కు నీళ్లు చేరాలంటే ఈ మార్పులు తప్పనిసరి అని ఇంజనీర్ల కమిటీ తేల్చి చెప్పింది.
9. జలవనరుల అభివృద్ధి శాఖ:
కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ పరిధిలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ‘ఆపరేషన్ & మెయింటెనెన్స్’ పనులకు 2025-26 సంవత్సరానికి రూ.440.60 లక్షలతో అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.
తుంగభద్ర (TBP LLC) కాలువ కింద సాగునీరు అందని పొలాలకు (గ్యాప్ ఆయకట్టుకు) ఈ 7 ఎత్తిపోతల పథకాలే ప్రాణాధారం. పంపులు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ పాడైపోకుండా వాటిని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తేనే (O&M) రైతులకు నిరంతరాయంగా నీళ్లు అందుతాయి.
10. జలవనరుల అభివృద్ధి శాఖ:
పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లో KM 74.000 నుండి KM 165.800 వరకు ఉన్న ఆఫ్ టేక్ పాయింట్లు మరియు ఇతర అతిసున్నిత ప్రాంతాల వద్ద నీటి నిర్వహణ సంవత్సరం 2025-26లో తేదీ 25.08.2025 నుండి 10.02.2026 వరకు నిర్వహించిన వాచ్ అండ్ వార్డ్ సేవలకు రూ.27.440 లక్షల చెల్లింపుకు పరిపాలన ఆమోదాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను వదిలినప్పుడు, కాలువల వద్ద నిఘా పెట్టడానికి సిబ్బంది కొరత ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు రైతులు అక్రమంగా సైఫన్ పైపులు వేసి రాత్రిపూట నీళ్లను దొంగిలిస్తున్నారు. దీనివల్ల కిందనున్న చెరువులకు నీరు చేరట్లేదు. దీన్ని అడ్డుకుని కాలువ వెంబడి గస్తీ కాయడానికే ఈ లస్కర్లను నియమిస్తున్నారు.
11. జలవనరుల అభివృద్ధి శాఖ:
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు (PDFs) భూమి మరియు కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్, పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల మరియు రాజవొమ్మంగి మండలాల్లో గుర్తించిన భూముల ధరను ఎకరాకు రూ.4,20,000/-కు పెంచడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్, పోలవరంకు అనుమతి ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భూ సేకరణ, పునరావాసం మరియు పునరుద్ధరణ చట్టం, 2013లోని సెక్షన్లు 26 నుండి 30 మరియు ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం మొత్తం 4,520.52 ఎకరాల భూ సేకరణకు ఎకరాకు రూ.12,50,000/- పరిహారం చొప్పున మొత్తం రూ.565.06 కోట్లు అవసరమవుతాయి.
ఈ ఏరియాలో భూముల అమ్మకాలు ఎక్కువగా జరగకపోవడం వల్ల రికార్డుల్లో ధర కేవలం రూ. 1.13 లక్షలు మాత్రమే ఉంది. ఇంత తక్కువకు భూములు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకించారు. అయితే 2023లో నేషనల్ హైవే వేసినప్పుడు పక్కనే ఉన్న రైతులకు ఎకరాకు 12-15 లక్షల దాకా పరిహారం వచ్చింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని, న్యాయబద్ధంగా ఈ రేటు పెంచారు.
12. జలవనరుల అభివృద్ధి శాఖ:
గౌరవనీయ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యూనల్ – II (KWDT-II) కోర్టులో అంతర్రాష్ట్ర జల వివాద కేసుల నిమిత్తం నలుగురు న్యాయవాదులను నియమించడానికి మరియు Ms. శివాంగి సింగ్ రావత్‌ను అడ్వకేట్-ఆన్-రికార్డ్ స్థానంలో అడ్వకేట్‌గా గుర్తించడానికి జి.ఓ.ఆర్‌టీ.నం.438, జలవనరుల అభివృద్ధి (IS.EA) శాఖ, తేదీ:26.08.2025 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే, తేదీ 07.07.2024 నుండి నదీ జలాల వివాద కేసులను పర్యవేక్షించేందుకు గౌరవనీయ KWDT-II మరియు సుప్రీం కోర్టు రెండింటిలోనూ అడ్వకేట్-ఆన్-రికార్డ్‌గా శ్రీ గంటూరు ప్రమోద్ కుమార్‌ను నియమించడానికి కూడా ఆమోదం తెలిపింది.
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బలంగా వాదించడానికి అడ్వకేట్ జనరల్ (AG) సలహా మేరకు జైదీప్ గుప్తా, ముకుల్ రోహత్గీ లాంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయకోవిదులను ప్రభుత్వం బరిలోకి దింపింది.
13. జలవనరుల అభివృద్ధి శాఖ:
M/s మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు అగ్రిమెంట్ నం.3/2021-22, తేదీ:28.10.2022 ప్రకారం అప్పగించిన ‘పోలవరం లిఫ్ట్ స్కీమ్’ పనిని కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. గవర్నమెంట్ U.O. నోట్ (2569244)/FMUOMISC/428/2024-FMU/TR-B, తేదీ:27.09.2024లోని పేరా 4(ii) నుండి ఈ పనిని మినహాయించడం జరిగింది.
కరువు సమయంలో పోలవరం అడుగుభాగం నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు తాగునీరు ఇవ్వడానికి ఇది ముఖ్యం. ప్రస్తుతం పనులు 17% పూర్తయ్యాయి. పోలవరం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీళ్లు నింపకముందే, పంప్ హౌస్ లాంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలి. నీళ్లు నింపాక ఈ పనులు చేయడం ఇంజనీరింగ్ పరంగా కుదరదు కాబట్టే దీన్ని ఆపకుండా కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు.
14. జలవనరుల అభివృద్ది శాఖ (కొప్పోలు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకు నీరు):
కడప జిల్లాలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న కొప్పోలు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ (Koppolu Pumped Hydro Storage) కోసం గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
రెవెన్యూ
15. రెవెన్యూ శాఖ:
SPSR నెల్లూరు జిల్లా సీతారామపురం (M), గంగవరం (V)లో Sy.No.67-2లో 14.32 సెంట్ల ప్రభుత్వ భూమిని పరిహార ఆటవీకరణ కార్యక్రమం కింద అటవీ శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. చేజర్ల స్పిల్‌వే టెయిల్ చానల్ నుండి కందలేరు రిజర్వాయర్ వరకు తవ్వకంలో 4.86 హెక్టార్ల అటవీ భూమి మళ్ళించబడటానికి పరిహారంగా ఈ బదిలీ జరుగుతుంది.
16. రెవెన్యూ శాఖ:
SPSR నెల్లూరు జిల్లా మూతుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో LPM No.2030 (Sy.No.685/3-2)లో 1.02 సెంట్ల ప్రభుత్వ భూమిని M/s SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు State of the Art CSR హాస్పిటల్ స్థాపన కోసం మార్కెట్ విలువ రూ.33,15,000/- (1.02 సెంట్లకు) చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
ఇరిగేషన్ పనుల కోసం పోయిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా ఈ 14 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు లేవు. ఇక హాస్పిటల్ విషయానికొస్తే.. SEIL సంస్థ తమ సొంత ఖర్చులతో 20 పడకల ఆసుపత్రి కట్టి, స్థానిక పేదలకు పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తుంది. భవిష్యత్తు వాళ్లు ఫ్రీ వైద్యం చేయకపోతే.. భూమికి డబ్బులు తీసుకున్నా సరే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది.
17 & 18: నంద్యాల జిల్లాలో పవన విద్యుత్ (Wind Power) ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇకోరెన్ ఎనర్జీ (Ecoren Energy) అనే ఒకే కంపెనీకి ఒకేరకమైన నిబంధనలతో ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఇవి. ఈ భూములన్నీ ఎందుకూ పనికిరాని మెట్ట భూములు.
17. రెవెన్యూ శాఖ:
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గుతుపల్లి, RS రంగాపురం, కోతపల్లె గ్రామాలు మరియు డోన్ మండలం మాల్కాపురం, కొచెరువు, ఢోన్, S.వలసాల గ్రామాలలో Sy.No.389, 949 మొదలైనవాటిలో 33.91 సెంట్ల ప్రభుత్వ భూమిని, అలాగే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం M.పెండేకల్, RS రంగాపురం, గుతుపల్లి, కొలుముళ్లపల్లి, ముద్దవరం, బేతంచెర్ల (V), బేతంచెర్ల (M)లో Sy.No.225/C, 342 మొదలైనవాటిలో 27.83 సెంట్ల ప్రభుత్వ భూమిని — M/s ఇకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 210 MW మరియు 168.30 MW విండ్ పవర్ ప్రాజెక్టుల జనరేషన్ కోసం NREDCAP కు లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.31,000/- చొప్పున, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలానికి జి.ఓ.ఎంఎస్.నం.37, ఎనర్జీ (Power.II) శాఖ, తేదీ:30.10.2024 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
18. రెవెన్యూ శాఖ:
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం మరియు M.పెండేకల్ పరిసర గ్రామాల్లో Sy.No.225/C, 342 మొదలైనవాటిలో 27.83 సెంట్ల ప్రభుత్వ భూమిని M/s ఇకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 168.30 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం NREDCAP కు లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.31,000/- చొప్పున, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలానికి జి.ఓ.ఎంఎస్.నం.37, ఎనర్జీ (Power.II) శాఖ, తేదీ:30.10.2024 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
19. రెవెన్యూ శాఖ:
నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనేపల్లె (V)లో Sy.No.386/1 లో 0.50 సెంట్లు మరియు Sy.No.387/1A లో 1.50 సెంట్లు — మొత్తం 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ నంద్యాల అధ్యక్షులకు నంద్యాలలో TDP కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున జి.ఓ.ఎంఎస్.నం.340, Rev.(Assn.I) శాఖ, తేదీ:21.07.2016 నిబంధనల ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
20 & 21 : రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ (APSPCL) ద్వారా కడప, కర్నూలు జిల్లాల్లో ఒక్కోటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న అల్ట్రా మెగా సోలార్ పార్కులకు సంబంధించిన భూ కేటాయింపులు ఇవి. సోలార్ పవర్ పాలసీ ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్లకు పూర్తిగా అమ్మేయకుండా కేవలం లీజు పద్ధతిలోనే ఇవ్వాలన్న నిబంధన ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
20. రెవెన్యూ శాఖ:
YSR కడప జిల్లా మైలవరం (M), పొన్నంపల్లి (V)లో LPM No.46 (Sy.No.192) మొదలైనవాటిలో 466.54 సెంట్ల ప్రభుత్వ భూమిని MD&CEO, APSPCL, తాడేపల్లి, గుంటూరుకు 1000 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం 2016 నాటి మార్కెట్ విలువపై 10% లీజు అద్దె చొప్పున, ప్రతి 5 సంవత్సరాల బ్లాక్‌కు 10% పెంపుతో 33 సంవత్సరాల లీజు పద్ధతిలో జి.ఓ.ఎంఎస్.నం.571, Revenue (Assign.I) శాఖ, తేదీ:14.09.2012 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
21. రెవెన్యూ శాఖ:
కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం సకునాల గ్రామంలో LPM No.561, 614 మొదలైనవాటిలో 737.66 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 1000 MW కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్ స్థాపన కోసం 2,00,000/- రూపాయల మార్కెట్ విలువపై 10% చొప్పున అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.20,000/- లీజు అద్దె చొప్పున, ప్రతి 5 సంవత్సరాలకు 10% పెంపుతో 33 సంవత్సరాల లీజు పద్ధతిలో జి.ఓ.ఎంఎస్.నం.571, Revenue (Assign.I) శాఖ, తేదీ:14.09.2012 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
ఇంధన శాఖ
22. ఇంధన శాఖ:
జి.ఓ.ఎంఎస్.నం.15, ఎనర్జీ (Power.II) శాఖ, తేదీ:11.03.2026 మరియు జి.ఓ.ఎంఎస్.నం.16, ఎనర్జీ (P.II) శాఖ, తేదీ:11.03.2026 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ఏర్పాటు చేసే పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లకు (REMZ – అంటే సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు లాంటివి తయారు చేసే పరిశ్రమలు) ఇకనుంచి ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ (APSPCL) బదులు నెడ్‌క్యాప్ (NREDCAP) ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ జారీ చేసిన జీవోలను క్యాబినెట్ ఆమోదించింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలతో (MNRE) సమన్వయం చేసుకోవడం, పనులకి అనుమతులు ఇవ్వడం మరింత సులభం అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లకు (REMZ – అనగా సోలార్ ప్యానెళ్లు, విండ్, బ్యాటరీలు, ఎలక్ట్రోలైజర్లు తయారు చేసే పరిశ్రమలు) ఇకనుంచి ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ (APSPCL) బదులు నెడ్‌క్యాప్ (NREDCAP) ను నోడల్ ఏజెన్సీగా నియమించారు. క్లీన్ ఎనర్జీ పాలసీ కింద అనుమతులు ఇవ్వడం తదితర పనులన్నీ ఇప్పటికే నెడ్‌క్యాప్ చూసుకుంటోంది కాబట్టి, పనుల్లో గందరగోళం లేకుండా కేంద్రీకరించడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలతో (MNRE) సమన్వయం చేసుకోవడం మరింత సులభం అవుతుంది. ఈ కొత్త విధానంలో భాగంగా ప్రకాశం జిల్లా బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలోని (కుందూరుగుడిపాడు, ముక్తేశ్వరం) సుమారు 1000 ఎకరాల భూమిలో ఈ భారీ తయారీ పరిశ్రమల (REMZ) జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
23. ఇంధన శాఖ:
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) చైర్‌పర్సన్ & MD అభ్యర్థన మేరకు, ADCL పనులకు APCPDCL వసూలు చేసే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్‌హెడ్ / సూపర్‌విజన్ చార్జీలను ప్రస్తుతం ఉన్న 15% నుండి 2.5%కి తగ్గించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పనులకు APCPDCL వసూలు చేసే రేటు కూడా 2.5% మాత్రమే కావడంతో, ఆ రేటుకు అనుగుణంగా ఈ తగ్గింపు చేయడం జరిగింది.
అమరావతి రాజధానిలో ప్రస్తుతం ట్రంక్ రోడ్లు, ఎల్‌పీఎస్ (LPS) రోడ్లు, కాలువలు, రిజర్వాయర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఆ పనులకి అడ్డుగా ఉన్న కరెంట్ స్తంభాలను, లైన్లను పక్కకు మార్చాల్సి వస్తోంది. ఈ పనికి విద్యుత్ శాఖ 15% ఛార్జీ అడగడంతో రాజధాని ప్రాజెక్ట్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. వాస్తవానికి 2019లో జాతీయ రహదారుల (NHAI) పనులకు ఈ ఛార్జీలను 2.5 శాతానికి తగ్గించారు. రాజధాని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం తగ్గించి పనులను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో అమరావతి పనులకు కూడా ఆ ఛార్జీలను తగ్గించారు.
24. ఇంధన శాఖ:
M/s సుజ్లాన్ ఎనర్జీ మరియు M/s ఆక్సిస్ ఎనర్జీ అభ్యర్థన మేరకు, వీరు PIA, PA మరియు SIA కింద చేపట్టిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గడువును మరో రెండు సంవత్సరాలు పొడిగించడానికి న్యూ & రీన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (NREDCAP) చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విద్యుత్ సజావుగా గ్రిడ్‌కు చేరాలంటే CTUIL మరియు PGCIL వంటి కేంద్ర ట్రాన్స్‌మిషన్ సంస్థలు నెట్‌వర్క్ అనుసంధానత పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ పని పూర్తయ్యే వరకు ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉండేందుకు ఈ గడువు పొడిగింపు అవసరమైంది.
ఈ సంస్థలు 2016, 2019 నాటి అగ్రిమెంట్ల ప్రకారం ప్రాజెక్టులు మొదలుపెట్టినా, 2019-2022 మధ్యకాలంలో గత ప్రభుత్వ విధానాల (GO Ms No. 35) వల్ల, డిస్కంలు పీపీఏలు (PPAs) చేసుకోకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. ఇప్పుడు బ్రూక్‌ఫీల్డ్ (Brookfield) లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చి, భూములు కొని ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, ఆ ఉత్పత్తి అయిన కరెంట్‌ను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వ లైన్లు (CTUIL సబ్‌స్టేషన్లు) ఇంకా సిద్ధంగా లేవు. ఈ భారీ విద్యుత్‌ను మోసే సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు (STU) లేదు. కేంద్రం లైన్లు పూర్తి కావడానికి కనీసం 2028-29 వరకు పడుతుంది కాబట్టి, ఆ లైన్లు సిద్ధమయ్యే సమయానికి వీళ్లు కూడా పనులు పూర్తి చేసుకునేలా ఈ రెండేళ్ల గడువును పెంచారు.
పౌర సరఫరాల శాఖ
25. పౌర సరఫరాల శాఖ :
పౌర సరఫరాల శాఖ పరిధిలో, ఇళ్లకు పైప్డ్ నాచురల్ గ్యాస్ (PNG) వాడుకునే వినియోగదారులకు కూడా సబ్సిడీని పొడిగించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం దీపం-2 (Deepam-2) పథకం కింద ఎల్‌పిజి (LPG) కనెక్షన్ ఉన్న లబ్ధిదారులకు అందుతున్న విధంగానే, ఇకపై పిఎన్‌జి (PNG) కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా సమానమైన సబ్సిడీని వర్తింపజేయనున్నారు.
సురక్షితమైన మరియు పర్యావరణహితమైన పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సబ్సిడీ లేకపోవడం వల్ల ఇప్పటివరకు గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు మారడానికి విముఖత చూపిన గృహాలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. దీనికి అయ్యే వ్యయాన్ని దీపం-2 లేదా ఎనర్జీ సబ్సిడీ పథకాల బడ్జెట్ నుండి కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు కానుంది.
ఉన్నత విద్యా శాఖ
26. ఉన్నత విద్యా శాఖ :
రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ మరియు పర్యవేక్షణ కోసం ‘ది ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2026’ ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం లభించింది.
ఈ నిబంధనల ద్వారా అన్ని కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది, దీనివల్ల విద్యా వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించి, ఆందోళన మరియు ఆత్మహత్యలను నివారించడానికి కౌన్సెలింగ్ సేవలు మరియు మానసిక ఆరోగ్య మద్దతును ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.
అంతేకాకుండా, సంస్థలు నాణ్యమైన బోధనతో పాటు కనీస మౌలిక సదుపాయాలు మరియు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచే బ్యాచ్‌ల విభజన, అవాస్తవ లక్ష్యాల నిర్దేశం వంటి అవాంఛనీయ పద్ధతులను నిరోధించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగంతో పాటు, క్షేత్రస్థాయిలో ఈ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.














































