కవి కరీముల్లా సామాజిక వ్యాసం
చరిత్ర సాక్షిగా మార్చి 31 ఓ విప్లవ దినం
హిజ్రీ 8వ సంవత్సరం,మార్చి 31చరిత్రలో ఓ మరుపురాని ఘట్టాన్ని ఆవిష్కరించిన తేది..మానవ మహోపకారి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పది వేల మంది అనుచరులతో మక్కాకు బయలుదేరారు.తను పుట్టి పెరిగిన నేల.సంవత్సరాల తరబడి భౌతికంగా,మానసికంగా హింసించిన ప్రజలు నిస్సహాయంగా ప్రవక్త రాకను వీక్షిస్తున్న సందర్భం.మానవులంతా ఒక్కటే,అందరి దేవుడు ఒక్కడే,ఆయన జనన మరణాలకు అతీతుడు.ఆయనను పోల్చదగిన ఏ మనిషి,ఏ ప్రాణి,ఏ వస్తువు ఈ భూమండలంపై లేదు అని బోధించినందుకు ఒంటె ప్రేగుల్ని తెచ్చి ఆయన నమాజ్ చేసుకుంటున్నప్పుడు మెడకు చుట్టి లాగిన పాషండులు నక్కి నక్కి చూస్తున్న సందర్భం.మనుషుల్లో పుట్టుక రీత్యా ఎవరూ గొప్పవాడు,తక్కువ వాడు కాదు అని , నల్ల జాతి వారిని బానిసత్వం నుండి విముక్తి చేయమని ప్రవక్త చెప్పినందుకు అగ్రవర్ణ అరబ్బు దురహంకారంతో రాళ్లతో పైశాచికంగా దాడి చేసిన క్రూరులు ప్రవక్త తమపై తమపై ప్రతీకారం తీర్చుకుంటారేమోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సమయమది.ఆడపిల్లల్ని చంపడం తప్పు,ధర్మం ప్రకారం పురుషులకు గల అన్ని హక్కులు మహిళలకూ ఉన్నాయని,స్త్రీని గౌరవించండి అని చెప్పినందుకు ప్రవక్తను నానా దుర్భాషలాడి అనుక్షణం పరిహసించిన నీచులు ఇప్పుడు గజగజా వణుకుతున్న క్షణమది.సంవత్సరాల తరబడి ప్రవక్తను,ఆయన సహచరులకు అన్నపానీయాలు అందకుండా చేసి ఎంతోమందిని బలిగొన్న దుర్మార్గులు ఇక తమ పని అయిపోయింది అని భావించి భీతితో చూస్తున్న రోజిది…
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా సరిహద్దుల వద్ద నిలబడి ప్రశాంత వదనంతో నిలబడి తను పుట్టి పెరిగిన ఆ నేల వైపు తదేకంగా చూశారు.తన సహచరులు వైపుకు తిరిగి ఓ నా సహచరులారా అహంభావంతో, విజయగర్వంతో గాక వినయంతో,అణుకువతో మక్కాలో ప్రవేశించండి,పాత గాయాలను మర్చిపొండి అని చెప్పి మక్కాలో ప్రవేశించారు.వస్తూనే బిగ్గరగా ఓ మక్కా వాసులారా మీపై ఎటువంటి ప్రతీకారం లేదు.నిర్భయంగా,నిశ్చయంగా ఉండండి.అల్లాహ్ అనంత కరుణామయుడు .మాపై జరిగిన ఏ హింసకూ ప్రతీకారం లేదు అని పలకగానే యావత్తు మక్కా ప్రజలు నిశ్చేష్టులైనారు.ప్రతీకార న్యాయం అరబ్బులకు చాలా సహజం కదా! అయినా ప్రవక్త మనల్ని క్షమించడమేమిటి?అని విస్తుపోయారు.వారి కన్నులు అశ్రుపూరితాలయ్యాయి.. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయారు..ప్రవక్త కాబా చెంత చేరి కాబాను తన స్వహస్తాలతో పరిశుద్ధం చేస్తుండగా పవిత్ర ఖుర్ఆన్ వాక్యం అవతరించింది.”సత్యం వచ్చేసింది.అసత్యం నిష్క్రమించింది.అసత్యమైతే ఎప్పటికైనా నిష్క్రమించవల్సిందే “…
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులు వైపుకు తిరిగారు హజ్రత్ బిలాల్ ను తన వైపుకు రమ్మన్నారు.జీవితంలో నల్లజాతి బానిసగా అరబ్బు అగ్రవర్ణ దురహంకారుల చేతుల్లో హింసింపబడి ప్రవక్త బోధించిన సామాజిక సమానత్వానికి ఆకర్షితుడై ప్రవక్త చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించి ప్రవక్తకు సైదోడుగా నిల్చిన బిలాల్ ఆర్ధ్రమైన కన్నులతో ప్రవక్త వంక చూస్తున్నారు.బిలాల్ పవిత్రమైన ఈ కాబాపై ఎక్కి తొలి అజాన్ ఇవ్వు అని కోరగానే బిలాల్ కళ్లు ఉద్వేగంతో అశ్రుపూరితాలయ్యాయి.ఏ మక్కాలో అయితే తనను జాతి పేరుతో హింసించారో,బానిసగా చూశారో అలాంటి మక్కాలో,అందునా పవిత్రమైన కాబా గృహం పైకెక్కి తొలి అజాన్ ఇవ్వమనటంతో బిలాల్ ఆనందాశ్రువులతో తాడు సహాయంతో కాబా పైకెక్కి “అల్లాహో అక్బర్,అల్లాహో అక్బర్ (అల్లాహ్ అందరికన్నా గొప్పవాడు )అని అజాన్ ఇస్తుంటే మక్కా మొత్తం విస్తుపోయింది..ఒక నల్లజాతి బానిసకు ఇంతటి సౌభాగ్యమా!ఇంత పెద్ద స్థానమా? ఇంతమంది అరబ్బులం ఉండగా ప్రవక్త ఆయనకు అవకాశం కల్పించడమేంటి ? గుసగుసలు మొదలయ్యాయి.ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గంభీరంగా అరబ్బులు వైపుకు తేరీపార జూసి పుట్టుక రీత్యా ఎవరూ అధికులూ కాదు,అల్పులూ కాదు.మానవులంతా సమానులే.వంశాల,గోత్రాల ఘనతల్ని రద్దు చేస్తున్నాను, దైవానికి భయపడండి అంటూ చెప్పగానే ఆ కొద్దిసేపు కలిగిన ఆధిపత్య భావన ఎంత పాపమో తల్చుకుని అరబ్బులు కన్నీరుమున్నీరయ్యారు…చరిత్ర సాక్షిగా ప్రవక్త ప్రేమకు,కరుణకు తలవంచి మొత్తం మక్కా వినయంతో ఇస్లాం స్వీకరించింది….హజ్రత్ బిలాల్ రజిఅల్లా గొంతు అజాన్ రూపంలో ఆనాటి నుండి ప్రతిధ్వనించింది..హయ్యాలస్సలాహ్, హయ్యాలస్సలాహ్ (మీరు సన్మార్గం వైపుకు రండి, మీరు సన్మార్గం వైపుకు రండి) హయ్యాలల్ఫలాహ్, హయ్యాలల్ఫలాహ్ (మీరు సాఫల్యం వైపుకు రండి.మీరు సాఫల్యం వైపుకు రండి.హజ్రత్ బిలాల్ రజి గొంతు నుండి మొదలైన ఈ అజాన్ అప్పటి నుండి ఇప్పటివరకూ కోటానుకోట్ల గొంతుల నుండి విస్తరించి సూర్యుని వెలుతురు ప్రసరించే ప్రతి చోట,ప్రతిక్షణం భూమండలం మొత్తం వింటూనే ఉంది.