కొబ్బరి పార్క్, విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన దిశ గా కోనసీమ జిల్లా యంత్రాంగం ముందడుగు
సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ ఆచరణ పద్ధతుల అధ్యయనం కోసం మైసూరు, కాసర్గోడ్, కొచ్చిన్, కోయంబత్తూర్ పర్యటనలు
జిల్లాలో కోకోనట్ పార్క్, కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంగా కీలక అధికారుల బృంద పర్యటన
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత విలువ జోడింపు పరిశ్రమల స్థాపన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం వినూత్న ముందడుగు వేసింది. ఈ క్రమంలో జిల్లాలో కోకోనట్ పార్క్ మరియు కామన్ ఫెసిలిటీ సెంటర్ల (CFCs) స్థాపనకు అవసరమైన స్థలాలు, సాంకేతికత, సరఫరా గొలుసు, మార్కెట్ లింకేజెస్ వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ప్రత్యేకంగా ఐదు రోజుల అధ్యయన పర్యటనను ప్రారంభించింది.
ఈ బృందాన్ని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి. ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు. బృందంలో పీడీ-డిఆర్డిఏ జయచంద్రగాంధీ, జిల్లా ఉద్యాణా ధికారి బీవీ రమణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, ఎల్‌డీఎం వర్మ తదితరులు ఉన్నారు.
మైసూరు పర్యటన – సిఎఫ్‌టిఆర్ఐ నిపుణులతో సాంకేతిక చర్చలు
మే 19 సోమవారం రోజున మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (CFTRI)ని అధికారులు సందర్శించారు. సిఎఫ్‌టిఆర్ఐ డైరెక్టర్ డా. శ్రీదేవి అన్నపూర్ణ, ఇతర శాస్త్రవేత్తలతో సమావేశమై కొబ్బరి మరియు అరటి వంటి తోట పంటల విలువ జోడింపు ఉత్పత్తులపై పరిశోధనలు, ప్యాకేజింగ్, ఎగుమతులకు అనుకూలమైన ఉత్పత్తుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
కాసర్గాడ్ పర్యటన – అధిక దిగుబడి వంగడాలపై చర్చలు
మే 20 న కేరళలోని కేంద్రీయ తోట పంటల పరిశోధనా సంస్థ (CPCRI), కాసర్గాడ్‌ను సందర్శించిన జిల్లా బృందం, శాస్త్రవేత్తలతో నూతన వంగడాలు, రోగ నిరోధకత కలిగిన కొబ్బరి రకాలు, కోనసీమ వాతావరణానికి అనుకూల వంగడాలపై సమగ్ర చర్చలు జరిపారు.
కొచ్చిన్ పర్యటన – కొబ్బరి అభివృద్ధి బోర్డు, కాయరు పరిశ్రమల పై అవగాహన
మే 21న బృందం కొచ్చిన్‌లోని కొబ్బరి అభివృద్ధి బోర్డు ( కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్), కాయరు బోర్డు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో కొబ్బరి ఫైబర్ ప్రాసెసింగ్, కొబ్బరి నీటిని బ్రాండెడ్ ఉత్పత్తిగా తయారు చేయడం, కాయర్ పరిశ్రమలకు అవసరమైన మిషనరీ వివరాలు సేకరించనున్నారు. మే 22న కొచ్చిన్ చుట్టుపక్కల పరిసరాలలోని పరిశ్రమలను పరిశీలిస్తారు.
తమిళనాడు పర్యటన – ప్రైవేట్ పరిశ్రమల మోడల్ పరిశీలన
మే 23న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ కొబ్బరి పరిశ్రమలను పరిశీలించి, వాటి నిర్వహణ, మార్కెటింగ్ మోడల్స్, రైతులకు లాభదాయకత తదితర అంశాలపై అధ్యయనం చేసి, వాటిని జిల్లా స్థాయిలో ఎలా అనుసరించవచ్చో పలు విశ్లేషణలు చేపట్టనున్నారు.
కలెక్టరుకు నివేదిక
ఈ పూర్తి అధ్యయన పర్యటన అనంతరం బృందం జిల్లాలో వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన నివేదికను జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్‌కు సమర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన పారిశ్రామిక మోడల్‌ను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు తెలిపారు.
ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా వ్యవస్థాపక చర్యలు
ఈ పర్యటనల ద్వారా రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్తమ పరిశ్రమల నమూనాలను పరిశీలించి, కోనసీమ జిల్లాను కొబ్బరి ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేయడమే జిల్లా యంత్రాంగ లక్ష్యమని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎగుమతులకు అనువైన పరిశ్రమలు స్థాపించడంతో పాటు ‘విలువ ఆధారిత కోనసీమ’ లక్ష్యంగా జిల్లాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇది కీలకమైన దశ అని పేర్కొన్నారు.