ప్రజలందరి ఆరోగ్య సంరక్షణే “జగనన్న ఆరోగ్య సురక్ష” లక్ష్యం
ప్రజలందరి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వం “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమం చేపట్టిందని, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఓ పత్రిక ప్రకటనలో తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 5 దశల్లో అమలవుతుందని, తొలిగా ఈనెల 15 నుండి వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవల గురించి అనగా ఎన్ని రకాల జబ్బులకు చికిత్సలు అందిస్తారు?… వైద్యం అందించే ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఉన్నాయో.. వాటి అడ్రస్సుల గురించి మరియు స్మార్ట్ ఫోన్లో “ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్” డౌన్లోడ్ చేయించి, దాని వినియోగంపై అవగాహన కల్పించడం వంటి మొత్తం వివరాలను ముందుగా తెలియజేస్తారన్నారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికి వచ్చి, ప్రతి ఒక్కరి ఆరోగ్యపరమైన అంశాలపై వాకబు చేసి, వాటన్నింటినీ రికార్డు చేసి, తమ తమ ప్రాంతాలలోని వైయస్సార్ విలేజి క్లినిక్ల, వైయస్సార్ పట్టణ క్లినిక్కుల, పిహెచ్సి డాక్టర్లకు తెలియజేస్తారు. పైగా ఈనెల 30వ తేదీ నుండి జరిగే మొదటి దశ వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్) నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆ రోజున అందుబాటులో ఉండాలని, ప్రజలందరికీ చెబుతారన్నారు. ఈ హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వైద్య పరీక్షలు జరిపి, ఉచితంగా మందులు ఇస్తారన్నారు. అవసరతను బట్టి అదనపు వైద్య చికిత్సల కోసం పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులకు గానీ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గానీ ఆయా రోగులను పంపి, మెరుగైన వైద్య సేవలు అందిస్తార న్నారు.
ఇలా తొలి దశలో క్యాంపియన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యం పై వాకబు చేసి, ఏడు రకాల వైద్య పరీక్షలు చేయించడం, మూడో దశలో మరోసారి హెల్త్ క్యాంపు లపై అవగాహన కల్పించడం, నాలుగో దశలో వైద్య శిబిరాలు జయప్రదంగా నిర్వహించడం, ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణకు సచివాలయాలు, మహిళా శిశు సంక్షేమం, విద్య, మున్సిపల్, గిరిజన శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఈ విధంగా ప్రభుత్వ శాఖలు, వైద్య సిబ్బంది, ప్రజలందరూ ఆరోగ్య సంరక్షణ కోసం, “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మూర్తి విజ్ఞప్తి చేశారు.
అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్