కవి కరీముల్లా సామాజిక వ్యాసం
ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం
………………………………………
నిజానికి ఇస్లాం ఒక మతం కాదు.జీవన మార్గం.ఇస్లాం అంటే శాంతి,సన్మార్గం,దైవ విధేయత అనే అర్థాలు వస్తాయి.అశాంతి నిండిన మనసుల్లో,సమాజాల్లో ఇస్లాం శాంతిని స్థాపించింది.మానవులందరి మధ్య ప్రేమను,సామరస్యాన్ని పంచింది.ప్రాధమికంగా ఇస్లాం మానవులంతా సోదరులేనని బోధిస్తుంది.ఏ కులానికి,ప్రాంతానికి,భాషకు ,మతానికీ చెందిన వారయినా అందరూ ఒక్కటేనన్న విశ్వజనీన భావన మానవ హృదయాలలో నాటుతుంది. పవిత్ర ఖుర్ఆన్ లో ఓ చోట “మానవులారా నిస్సందేహంగా మేము మిమ్మల్ని ఒకే జంట ద్వారా సృష్టించాము”అని ఉంది.ఇస్లాం మానవాళికి గొప్ప ప్రజాస్వామ్య,లౌకిక దృక్పధానికి బాట వేసింది.అన్య మతస్థులపై దాడులు చేయటం,వారి ప్రార్థనాలయాలు కూల్చటం,బలవంతపు మత మార్పిడులు ఇత్యాది విద్వేషపూరిత చర్యల్ని ఖండిస్తుంది.
“ధర్మం విషయంలో బలాత్కారానికి తావు లేదు…(పవిత్ర ఖుర్ఆన్ 2:256)
హింస ద్వారా పర ధర్మమును అణచనెంచుట రక్తపాతం కన్నా అత్యంత తీవ్రమైన పని..(2:217)
పై వాక్యాలను బట్టి ఇస్లాం పరమత సహనాన్ని బోధించినట్టు స్పష్టమౌతుంది.
అంతేకాక ఇస్లాం ఉగ్రవాదాన్ని కరాఖండిగా ఖండిస్తుంది.”అన్యాయంగా చిందించే ప్రతి నెత్తుటి బొట్టుకు అల్లాహ్ వద్ద సమాధానం ఇచ్చుకోవల్సిందేనని. హెచ్చరిస్తుంది.కొంతమంది మతోన్మాద విశ్లేషకులు టివి స్టూడియోలలో,పత్రికలలో ఇస్లాం పై దుష్ప్రచారం చేస్తుంటారు.వాళ్ళు సాధించదల్చుకున్న ప్రమాదకరమైన లక్ష్యాలు యేమిటనే సంగతి అటుంచి సహేతుకమైన,సమగ్ర దృష్టితో ఇస్లాంను అధ్యయనం చేస్తే ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకమని విశదమౌతుంది.మతిమాలిన వారు,వివేక హీనులు మాత్రమే టెర్రరిజం వైపుకు మరలుతారు.మానవీయ విలువల్ని ధ్వంసం చేసి హింసే ఆయుధంగా సాగే టెర్రరిజం వ్యక్తులదైనా,సంస్థలదైనా,రాజ్యానిదైనా ఇస్లాం ఖండిస్తుంది.
ఒక మానవుడిని చంపిన వాడు సమస్త మానవుల్నీ చంపినట్లే,ఒక మానవుడి ప్రాణాలు కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలు కాపాడినట్లే”(పవిత్ర ఖుర్ఆన్ అల్ మాయిదా32).మక్కా వాసులచే అతి క్రూరంగా హింసించ బడ్డ దైవ ప్రవక్త ముహమ్మద్(స)వారిపై ప్రేమను కురిపించారు.చివరికి తనకు అత్యంత ప్రియమైన బాబాయి ని చంపి ఆయన కాలేయాన్ని నమిలిన వారిని సైతం తనకు దొరికినపుడు క్షమించి వదిలేశారు.ఆ క్షమాగుణమే,ప్రేమ మార్గమే మొత్తం ప్రపంచాన్ని జయించింది.ఆయన సహచరులు ప్రవక్త(స)మార్గంలో నడిచారు కనుకనే సూర్యకిరణాలు తాకిన ప్రతి నేలనూ ఇస్లాం కిరణాలు తాకగలిగాయి.
సమాజంలో ముస్లింల ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మహా ప్రవక్త ముహమ్మద్(స)వివరించారు.”నీపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని క్షమించు,నీ పట్ల చెడుగా ప్రవర్తించే వారి పట్ల మంచిగా వ్యవహరించు”అని చెప్పారు.
“మలినాన్ని మలినంతో శుద్ది చేయలేరు(ప్రవక్త ముహమ్మద్(స)
ఇస్లాం ద్వేషానికి సమాధానం ద్వేషం కాదని చెప్తుంది.
ఇస్లాం ప్రేమను నిర్మిస్తుంది.అనాధల పట్ల,వితంతువుల పట్ల,పొరుగువారి పట్ల,చివరికి మహా శక్తివంతుడైన దైవం పట్ల అవ్యాజ్యమైన ప్రేమను కలిగివుండేలా మానవుడ్ని సంస్కరిస్తుంది.శాంతి,ప్రేమ,సహనం,సేవ,సౌశీల్యం అనే పునాదులపై ఇస్లాం సౌధం నిలబడివుంది.అంతేకాని హింస ,ద్వేషం,టెర్రరిజం అనే మతిమాలిన విషయాలపై కాదు…

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT