ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసన సభ తృతీయ (బడ్జెట్) సమావేశంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసన సభ తృతీయ (బడ్జెట్) సమావేశంలో భాగంగా ఆరో రోజైన శుక్రవారం (07.03.2025) 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబందించి గృహనిర్మాణ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖల గ్రాంట్ల డిమాండ్లపై మూడో రోజు చర్చ లో భాగంగా రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి రాష్ట్ర *శ్రీ కొలుసు పార్థసారధి మాట్లాడుతూ….
పేదవారికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదం,సిద్ధాంతంపైనే తెలుగుదేశం పార్టీ నిర్మితమైందన్నారు. 1983 కు ముందు సెమీ పక్క బిల్డింగ్స్ కట్టుకునేందుకు 800 నుంచి 3 వేల రూపాయలు ఉండేదని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 6000 నుంచి 12 వేల రూపాయలకు పెంచి పక్క గృహాలను నిర్మించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో దేశం మొత్తానికి మార్గదర్శకం చేసేలా గృహ నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం 18.50 లక్షల ఇల్లు కట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. 2014 -19వ మధ్య కాలంలో 15 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ గృహ నిర్మాణానికి కేటాయించారన్నారు.
షేర్ వాల్ టెక్నాలజీ తో ఏడు లక్షల ఇళ్లను ప్రారంభించారని, 2014 -19లో పిఎంఏవై క్రింద 12 లక్షల గృహాలు 18 వేల కోట్ల రూపాయలతో మంజూరు అయిందని, రాష్ట్ర వాటాగా అర్బన్ ప్రాంతంలో రూ.50,000/-లు అదనంగా, మున్సిపాలిటీల్లో లక్ష రూపాయలు అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చారన్నారు. అలాగే ఎస్సీలకు రూ.50,000/- ఎస్టీలకు రూ.70000/-, పీవీటీజి తెగలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. 10 లక్షల ఎన్టీఆర్ గృహాలలో 4.75 లక్షల ఇళ్లను పూర్తి చేసామని, అలాగే టిడ్కో ఇళ్లలో ఏడు లక్షల గృహాలకు గానూ 2.50 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. కానీ అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాలపై పూర్తి నిర్లక్ష్యాన్ని వహించిందన్నారు.
ఎన్టీఆర్ పేరును సైతం వైఎస్ఆర్ హౌసింగ్ గా మార్చి 1200 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినప్పటికీ ఒక్క రూపాయిని కూడా ఖర్చు చేయకుండా ఎన్టీఆర్ గృహాలను, టిడ్కో గృహాలను ఆ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 4.70 లక్షల టిడ్కో గృహాలను రద్దు చేసిందని, 2.80 లక్షల లబ్ధిదారులకు ఇవ్వవలసిన 926 కోట్ల రూపాయలను ఇవ్వకుండా ఎగ్గొట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చిందని ఆ భూములను సైతం నివాసయోగ్యమా, కాదా అనేది చూడకుండా కేటాయించిందన్నారు. ఆయా లేఅవుట్లలో కనీస మౌళిక వసతి సదుపాయాలను కూడా కల్పించలేదన్నారు. 18వేల కోట్ల రూపాయలను వారు నిరుపయోగం చేశారన్నారు. గతంలో తమ ప్రభుత్వం ప్రతి ఇంటికి 2.50 లక్షల రూపాయలు ఇస్తే దాన్ని 1.80 లక్షల రూపాయలకు తగ్గించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇచ్చిన మొత్తాన్ని సైతం రద్దు చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన 3760 కోట్ల రూపాయలను దారి మళ్ళించారన్నారు. 2023- 24 చివరి మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 968 కోట్ల రూపాయలను దారి మళ్ళించారని, ఆ మొత్తాన్ని ఈ మార్చి 31లోపు సంబంధిత కేంద్ర ఖాతాలో జమ చేయకపోతే తదుపరి నిధుల మంజూరు లో ఆలోచించాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించిందన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మరలా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధనంగా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. పిఎంఏవై 1.0 కింద డిసెంబర్ 24 నాటికి ఆ పథకం పూర్తి అవుతుంటే, దాన్ని కేంద్ర పెద్దలతో మాట్లాడి 2026 మార్చి వరకు ఆ గడువును పొడిగించడం జరిగిందన్నారు. జూన్ నాటికి ఐదు లక్షల ఇళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. 7.25 లక్షల గృహాలను మార్చి 26 లోపు పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. పిఎంఏవై 2.0 కింద మార్చ్ నుండి 53,950 గృహాలను ఇచ్చేందుకు సర్వే చేసి నివేదికను సిద్ధం చేస్తున్నామని, మరో నాలుగు లక్షల ఇళ్లకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో గృహాలు మంజూరు కాని వారికి ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఆ నిర్మాణాలకు అదనంగా ఎన్ఆర్ఈజీఎస్, స్వయం సహాయక బృందాల క్రింద ఆర్థిక సహాయాన్ని కూడా అందించనున్నా మన్నారు. అలాగే ఎన్టీఆర్ గృహాలు పూర్తయిన వారికి పెండింగ్ లో ఉన్న మొత్తాలను చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు.
ఇళ్ల స్థలాల్లో అవకతవకలపై విజిలెన్స్ వేశామని వారి నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. 4400 కోట్ల రూపాయల హడ్కో రుణం మంజూరు అయిందన్నారు. ఆ నిధులు రాగానే టిడ్కోఇళ్లను పూర్తి చేస్తామన్నారు. రాక్రిట్ సంస్థ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. 27 లక్షల ఇందిరమ్మ గృహాలపై కూడా నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామన్నారు. అందులో గృహాలు నిర్మించుకోని వారికి పిఎంఏవై 2.0 కింద ఇల్లు మంజూరు చేస్తామన్నారు. 2029 నాటికి మెరుగైన ఆహ్లాదకరమైన గృహాలను నిర్మిస్తామన్నారు.