అనారోగ్య బాధితుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం
*శారదాపీఠం వద్ద ముఖ్యమంత్రిని కలిసిన బాధిత కుటుంబీకులు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 21 ః రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూరో సంబంధిత అనారోగ్య బాధితుడు సాలాపు లీలాధర్ నాయుడు(10)కు జిల్లా యంత్రాంగం రూ.1 లక్ష ఆర్థిక సాయం సమకూర్చింది. సంబంధిత చెక్కును పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు, జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావులు బాధిత కుటుంబానికి అందజేశారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో పూజల నిమిత్తం బుధవారం నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పెందుర్తి మండలం జెర్రుపోతుల పాలెం గ్రామానికి చెందిన న్యూరో సంబంధిత అనారోగ్య బాధితుడు సాలాపు లీలాధర్ నాయుడు(10) తన తల్లిదండ్రులు నూకరాజు, సత్యకళతో పాటు వచ్చి కలిశారు. పుట్టకతోనే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందని.. వయసుతో పాటు అది పెరిగి బాబు కంటి చూపు మందగించిందని, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయని తల్లిదండ్రులు వివరించారు. ఇది వరకు చాలా ఆసుపత్రుల్లో చూపించామని, ప్రస్తుతం బెంగళూరు నిమ్ హాన్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చూపిస్తున్నామని ముఖ్యమంత్రికి లీలాధర్ నాయుడు తల్లిదండ్రులు చెప్పారు. వారి సమస్యను సానుకూలంగా విన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.1 లక్ష ఆర్థిక మంజూరు సాయం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున చెక్కును సిద్ధం చేయగా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇతర అధికారుల చేతుల మీదుగా అందజేశారు.