• స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వాములవ్వాలి
• పేదరికంలేని సమాజ నిర్మాణానికి తమ వంతు సేవలందించాలి
• నూతన సాంకేతిక విధానంతో పారదర్శకంగా ప్రజలకు దగ్గరవ్వాలి
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమ, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యసాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
Amaravati:
స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో శుక్రవారం జిల్లా, మండల, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు అధికారులకు, అర్బన్ స్వర్ణ వార్డు అధికారులకు రెండు రోజుల అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమ, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి మాట్లాడుతూ.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు, స్వర్ణ మండల, స్వర్ణ జిల్లాల ద్వారా ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ సాధించడమే లక్ష్యమని అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యం మేరకు ‘విజన్ 2047’లో భాగంగా ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ను సాధించడమే లక్ష్యమన్నారు. జిల్లా, మండల స్థాయి అర్బన్ లెవల్ స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు అధికారులందరులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో వేర్వేరు క్యాడర్‌లలో ఉన్న అధికారులందరికీ నేడు ఇప్పుడు పదోన్నతులు లభించాయని ఆయన పేర్కొన్నారు.
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది ప్రతి పౌరునికి సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.
గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖల పర్యవేక్షణ వేర్వేరుగా ఉండేదని, అయితే మెరుగైన పర్యవేక్షణ కోసం నేడు వాటిని సమన్వయం చేస్తూ స్వర్ణ గ్రామ సచివాలయాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న సుమారు 20,000 పోస్టులతో కలిపి మొత్తం 1,40,000 మంది సిబ్బంది స్వర్ణ వార్డు/స్వర్ణ గ్రామ శాఖలో పనిచేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన ఏ, బి, సి కేటగిరీలుగా సిబ్బందిని విభజించి (రేషనలైజేషన్) సేవలను క్రమబద్ధీకరించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను బలోపేతం చేస్తూ 10 మంది అదనపు సిబ్బందిని కేటాయించామన్నారు. మండల స్థాయిలో అధికారులకు సహాయంగా ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించామన్నారు. విశాఖపట్నం వంటి మహానగరాల్లో 18 మంది, ఇతర నగర పంచాయతీలలో జనాభాను బట్టి 4 నుండి 10 మంది వరకు సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. క్లస్టర్ ఆధారిత సేవలను అందిస్తూ, సంబంధిత విభాగాలతో (లైన్ డిపార్ట్‌మెంట్స్) సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గుర్తుచేశారు.
స్వర్ణ వార్డు/స్వర్ణ గ్రామ సచివాలయ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లా, మండల , పట్టణ స్థాయిల్లో ‘స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు’ శాఖలో పదోన్నతి పొందిన అధికారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని ప్రజలకు గౌరవ, వేగవంతమైన సేవలను అందించాలన్నారు. స్వర్ణ గ్రామం/ స్వర్ణ వార్డు కేవలం పేరు మార్పు మాత్రమే కాదని 2047 నాటికి మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే ప్రక్రియలో భాగంగా ఈ మార్పు జరిగిందన్నారు. ప్రతి గ్రామం, వార్డులో మెరుగైన మౌలిక సదుపాయాలు (రోడ్లు, పాఠశాలలు, డ్రైనేజీ వ్యవస్థ) కల్పించి, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశం అన్నారు. సాంకేతికత వేగంగా మారుతోందని, ప్రభుత్వం ఇప్పటికే చాట్ బాట్లను (Chatbots) ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేసే స్థాయికి చేరిందని ఆయన గుర్తు చేశారు. అధికారులు ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకమైన ప్రవర్తన కలిగి, పనులను నిర్ణీత సమయంలో, నిబంధనల ప్రకారం గౌరవంగా పూర్తి చేయాలన్నారు. బయోమెట్రిక్ వంటి పర్యవేక్షణ వ్యవస్థలు అవసరం లేని విధంగా, ప్రతి అధికారి తమ బాధ్యతను గుర్తించి సక్రమంగా పని చేయాలన్నారు. ఒక సామాన్య పౌరుడు ఆఫీసుకి వస్తే మనం ఎలా స్పందించాలో ఆలోచించి, సేవలందించాలని కార్యదర్శి కాటమనేని భాస్కర్ కోరారు.
స్వర్ణ వార్డు/స్వర్ణ గ్రామ సచివాలయ శాఖ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో ‘గ్రామ వార్డు సచివాలయ శాఖ’గా ఉన్న పేరును నేడు ‘స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు’ శాఖగా మార్చామన్నారు. సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులతో కూడిన మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
పనిభారాన్ని క్రమబద్ధీకరించడానికి (Rationalization) జనాభా ఆధారంగా కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజించామన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ సెక్రటరీల పదోన్నతులపై ఉన్న సందిగ్ధతను తొలగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒక ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ కమిటీని వేశామన్నారు. రాబోయే రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన నిబంధనలు వస్తాయని డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ అన్నారు.
కార్యక్రమంలో ఏడీసీ సీబీ అండ్ హెచ్ఆర్ జీవీ సూర్యనారాయణ, ఏడీసీ డీఎస్ ఎస్. గౌతమి, చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ సీహెచ్. చిన్నారావు, ప్రణాళిక శాఖ అధికారి అనంత శంకర్, తదితర అధికారులు ఓరియెంటేషన్ పై ఉద్యోగులకు, అధికారులకు అవగాహన కల్పించారు.

















































