బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడంలో దిశ SOS యాప్ ముఖ్య సాధనంగా పని చేస్తోంది.
23-07-2023, దిశ SOS ఎఫెక్ట్…డప జిల్లా:
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడంలో దిశ SOS యాప్ ముఖ్య సాధనంగా పని చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నా ప్రజలు స్వచ్ఛందంగా దిశ SOS యాప్ కు కాల్ చేసి సమాచారం అందిస్తున్నారు. తాజాగా కడప జిల్లా సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నట్లు మైనర్ బాలిక స్నేహితులు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. నిముషాల వ్యవధిలో దిశ పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని మ్యారేజ్ జరగకుండా అడ్డుకున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రాయదుర్గం, పెనమలూరు, ఏలూరు, కడప, నెల్లూరులో బాల్య వివాహాలు జరగకుండా దిశ పోలీసులు వెళ్లి అడ్డుకోవడం జరిగింది. దిశ యాప్ ద్వారా ఇప్పటి వరకు 34 బాల్య వివాహాలను నిలుపుదల చేసినట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తాజాగా కడప జిల్లా సిద్దవటం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు జులై 23న వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. మైనర్ బాలికకు ఇష్టం లేకుండా వివాహం చేస్తున్నారని బాలిక స్నేహితులు దిశ SOS కు కాల్ చేసి శనివారం రోజున సమాచారం అందించారు. కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలో బాలిక ఇంటికి దిశ పోలీసులు చేరుకున్నారు. మైనర్ బాలికకు వివాహం జరిపించాలని చూసిన తల్లిదండ్రులకు దిశ టీం కౌన్సెలింగ్ ఇచ్చింది. బాలిక ఇష్ట ప్రకారం చదువుకోవడానికి సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు. దిశ పోలీసుల సూచన మేరకు మరికొన్ని గంటల్లో జరిగే వివాహాన్ని క్యాన్సల్ చేస్తున్నట్లు బాలిక పేరెంట్స్ పేర్కొన్నారు. అమ్మాయి చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
దిశ SOS కు కాల్ చేసి చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నట్లు సమాచారం అందించిన బాలిక స్నేహితులను పోలీసులు అభినందించారు. ఇష్టం లేకుండా జరుగుతున్న తన వివాహాన్ని అడ్డుకొని, చదువుకోవడానికి పేరెంట్స్ ను ఒప్పించిన పోలీసులకు బాలిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.