విజయవాడ, మే. 27
క్షేత్ర స్థాయి లోమెరుగైన “డెలివరీ మెకానిజం”, “డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్”
విద్య, వైద్య రంగాల సమూల సంస్కరణలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను ప్రజలకు చేరవేయడంలో సహకరించాలి.
– ప్రజా వ్యవహారాల ముఖ్య సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి
—————————————————————————————————————————–
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మునుపెన్నడూ లేని విధంగా పలు పథకాలు, సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల ముఖ్య సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పథకాల ప్రయోజనం ఆయా వర్గాలకుఅందేలా చూడడం లో క్షేత్ర స్థాయిలోని జర్నలిస్టుల పాత్ర కీలక మైందని ఆయన అన్నారు. ప్రతి వారం సి.ఆర్. మీడియా అకాడెమీ నిర్వహించే “ఆన్ లైన్ అవగాహన కార్యక్రమం” లోభాగంగా ‘రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర’ అంశం పై ఆయన శనివారం ప్రత్యేక ప్రసంగం చేశారు. లబ్దిదార్ల జీవితాల్లో గుణాత్మక మార్పు చోటు చేసుకునేలా ప్రేరణ కల్పించడం జర్నలిస్టుగా అత్యంత సంతృప్తికరమైన అంశంగా తాము భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమాజ హితం కోరి పనిచేయడం, సమాజ గౌరవానికి, తద్వారాసమున్నత స్థానాన్ని పొందడానికి దోహద పడుతుందని ఆయన హితవు పలికారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పలు మార్పులు, సంస్కరణల ఫలితాలు, తక్కిన మరెవరికన్నా అక్కడ పనిచేసే జర్నలిస్టులకు మాత్రమే ఖచ్చితంగా తెలుస్తాయని ఆయన అన్నారు. అయితే, ఇందుకు వారు స్వయంగా చూడడం, వినడం అవసరమన్నారు. ఇలా చేయడం వారు పని చేస్తోన్న మీడియా హౌస్ విధానాలకు భిన్నం కాదనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.
జగన్ మోహన రెడ్డి గత నాలుగేళ్లలో సమాజ మౌలిక అంశాల లో సంస్కరణలు చేపట్టడం జరిగిందన్నారు. అవి నిరంతరంగా, విజయవంతంగా కొనసాగుతున్నసంగతిని పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. రాష్ట్ర పేదల సుస్థిర అభివృద్ధిని కోరి ప్రవేశ పెట్టిన సంస్కరణలకు ప్రజల ఆమోదం వుందని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ,వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లోమెరుగైన “డెలివరీ మెకానిజం” యేర్పడిన సంగతిని ఆయన గుర్తు చేశారు. “డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్” పద్దతి లో నగదు ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందించడం ద్వారా అవినీతిని అరికట్టడానికి దోహదపడిందన్నారు. దీనితో పాటు, కుల మత, ప్రాంత, రాజకీయ వివక్షలేకుండా లబ్ది చేకూర్చడం జరుగుతున్న సంగతిని గుర్తించాలన్నారు. “డి.బి.టి.” పద్దతి ద్వారా లబ్ధిదారుల ఎంపికలో గతంలో ప్రభుత్వాలకుండే విచక్షణాధికారాన్ని సైతం ఈ ప్రభుత్వం వదులుకుందన్నారు. నిరుపేదలకు సంక్షేమ కోసం నిధులు ఇవ్వడం సరైనదా కాదా అనేది వేరే అంశం అని ఆయన పేర్కొన్నారు.
లబ్ది దారుల ఎంపిక కోసం అర్హత కు ప్రామాణికంగా”6 సూత్రాల ఫార్ములా” రూపొందించడం జరిగిందన్నారు. ఆ ఫార్ములా లోని నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల జాబితాలో చేర్చడం,తొలగించడం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. నిబంధనల పరిమితి లోకివచ్చిన వెంటనే లబ్ధిదారుల జాబితాలోకి చేర్చడం అనేది అప్రయత్నంగానే జరిగిపోతుందన్నారు. ఈ ప్రక్రియ లో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి లోకి మార్పులు చోటు చేసుకోవడం లో ఎక్కడైనా కొన్ని పొరపాట్లు చోటుచేసుకోవడం సహజమని అన్నారు. ఇటువంటి లోపాలను ఎత్తి చూపడం ద్వారా విధాన పరమైన లోపాలను ప్రభుత్వాలు సరిచేసుకునే వీలుంటుందన్నారు. ఇలా విధాన పరమైన లోపాలను ఎత్తిచూపడం లో జర్నలిస్టులు ప్రజా ప్రయోజనాలను, సమాజ హితాన్ని దృష్టిలో వుంచుకోవాలని సూచించారు.
జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం విద్య, వైద్య రంగాల పై పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తోందని, ఈ ఫలితాలను క్షేత్ర స్థాయి లో స్వయంగా పరిశీలించి తెలుసుకోవడం జర్నలిస్టుల కర్తవ్యం అని అన్నారు. పాఠశాలల రూపు రేఖల్ని ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా “నాడు- నేడు” పధకం మార్చివేసిందన్నారు. త్రాగునీరు, పోషకవిలువలతో కూడిన ఆహరం, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలకల్పన జరిగిందన్నారు. గ్లోబల్ పోటీ ని తట్టుకునే దిశగా ఇంగ్లీషు మీడియం, సి.బి.ఎస్.ఈ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
అదే విధంగా ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, మందులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే, ఈ సదుపాయాలు సమాజంలోని పేదలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చేయడం లో జర్నలిస్టులు తమ వంతు పాత్ర నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఇలా చేయడం ద్వారా ఆయా పాఠశాలలు, ఆసుపత్రుల పై సమాజానికి ఈ వసతులు తమ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు పెద్ద యెత్తున ప్రజా ధనం ఖర్చు చేయడం జరిగిందని, తలచి ప్రజలు వాటిని సమర్ధవంతంగా వినియోగించుకునే వీలుంటుందన్నారు. క్షేత్ర స్థాయి లో జర్నలిస్టులు ఇలా “మార్పుకు” నాంది పలకాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన రెడ్డి “కౌలు రైతుల” కష్టాలకొక పరిష్కారం కనుగొన్నారని ఆయన తెలిపారు. ‘భూమి యజమాని’, ఆ భూమిని కౌలుకు తీసుకుని పండించే “కౌలురైతు” ల మధ్య 11 నెలలకు ఒప్పందం చేసుకోవడం ఒక పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. తద్వారా అటు భూమి యజమాని తన భూమి పై హక్కును కోల్పోరని, కౌలు రైతుకు చట్టబద్దమైన అన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు. తన ఇంటిని అద్దె కు ఇచ్చే యజమాని, అందులో నివాసం వుండే “టెనెంట్” కు మధ్య కుదుర్చుకునే ఒప్పందం లాంటిదే ఇది అని ఆయన అన్నారు. ఇటువంటి అంశాల పై ప్రజలు , రైతులకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గత నాలుగేళ్లు గా క్షేత్ర స్థాయిలో గుర్తించదగిన మార్పు కనిపిస్తోందని, వీటి అమలులో అనేక సవాళ్లున్నాయని శ్రీ సజ్జల రామ కృష్ణా రెడ్డి అన్నారు. వాటిని అధిగమించి, ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు లబ్ధిదారులు అందుకోగలిగే రీతిలో ప్రేరణ గా పనిచేసే జర్నలిస్టుల ను ప్రజలు కలకాలం గుర్తుంచుకుని, సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పిస్తారని ఆయన అన్నారు.
అంతకు ముందు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీ గోవిందరాజు చక్రధర్ “వార్తలు – విలువలు” అనే అంశం పై ప్రసంగించారు.
ఈ ఆన్ లైన్ సమావేశానికి (C. Raghavachari Andhra Pradesh Press Academy ) సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమం లో కోర్సు డైరెక్టర్ శ్రీ ఎల్.వి.కె.రెడ్డి, మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు, డిప్లొమా ఇన్ జర్నలిజం విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.