కరప్షన్ ఇండియా ?
(డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా – Anti Corrption Day)
“ఇందుగలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే గలదు అవినీతి’ అంటే సరిపోతుంది. ఇప్పటికే వ్యక్తుల అవినీతి , లంచగొండితనంతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు, వ్యవస్థలు కూడా కేరాఫ్ కరప్షన్లు గా మారి దేశాన్ని కుదేలు చేస్తున్నాయి.
ఒక వ్యక్తి లేదా సంస్థ లేదా తమవారి లాభం కోసం, అక్రమ ప్రయోజనాలను పొందేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవినీతి. ప్రభుత్వం చేపట్టే రోడ్లు, భవనాలు, కాలువలు , వంతెనల నిర్మాణాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడటంతో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా, మరికొంతమంది శాశ్వత దివ్యాంగులుగా మారిపోతున్నారు. ఈ పరిణామం అనేక కుటుంబాలు నడిరోడ్డున పడటానికి కారణమవుతోంది. ప్రభుత్వ డాక్టర్లు లంచం ఇవ్వలేదని రోగి ప్రాణాలను గాలిలో కలపడం, అర్హతగలవారిని కాకుండా అనర్హులను అధికారులు ఉద్యోగాల్లో నియామకాలు జరపడం, ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
పెరుగుతున్న రేట్లతో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడానికే సామాన్యుడు సతమతమవుతుండగా..అదే సమయం లో అవినీతి పరిస్థితులను మరింత దిగజారేలే చేస్తున్నాయి. వాస్తవానికి లంచం ఇవ్వడం, తీసుకోవడం భారతీయ చట్టాలు నేరంగా పరిగణిస్తాయి. ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్షని భారత సర్వోన్నత న్యాయస్థానం చెబుతోంది. అవినీతి కేసుల్లో డబ్బులు చిన్నదా ? పెద్ద మొత్తమా ? అనేది సమస్యే కాదని ఎంత తీసుకున్నా నేరమేనని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పష్టం చేస్తోంది.
మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే. ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోతోందని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు అవినీతిపరుడ్ని సమాజం చిన్న చూపు చూసేదని, ప్రస్తుత సమాజం డబ్బు ఉంటే చాలు గౌరవంగా చూస్తోందని వారు వివరించారు. అవినీతి ఉద్యోగులను గుర్తించి త్వరితగతిన దోషులను కఠినంగా శిక్షించాలని న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, పౌర సమాజం కోరుతోంది.
అవినీతి సూచికలో 2024 నాటికి 180 దేశాలలో భారతదేశం 96వ స్థానంలో నిలిచింది. ఐక్య రాజ్య సమితి ఆధ్యర్యంలో 2005 నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. “యువతతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడి, రేపటి సమగ్రతను రూపొందించుదాం” స్లోగన్ ను ఈ ఏడాది అంతర్జాతీ అవినీతి వ్యతిరేక దినోత్సవానికి ఎంపిక చేశారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రభుత్వ అధికారులు, పౌర సేవకులు, చట్ట అమలు అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రైవేట్ రంగం, పౌర సమాజం, విద్యాసంస్థలు, ప్రజలు, యువతతో సహా – ప్రతి ఒక్కరి హక్కులు – బాధ్యతలను తెలియచేయడమే ఈ స్లోగన్ ఉద్దేశం.
అవినీతికి పరాకాష్ట
అవినీతి మన దేశంలో ఎంతగా పాతుకుపోయిందో తెలియాలంటే మనం ఒక యధార్థ ఘటనను తెలుసుకోవాలి. రెకొండో పేరుతో పార్సీ సోదరులు మహారాష్ట్రలో రోడ్డు నిర్మాణ సంస్థను ప్రారంభించారు. పూనేలోని జంగ్లీ మహరాజ్ రోడ్డును వారు 1976లో నిర్మించారు. పదేళ్లలో రోడ్డు పాడైతే మరమ్మతులు ఉచితంగా చేస్తామని కూడా హామీ ఇచ్చారు. 50 ఏళ్లుగా ఆ రోడ్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే హృదయ విదారక ఘటన ఏమంటే ఆ కాంట్రాక్టరు ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. కారణం అతనికి ప్రభుత్వం నుంచి మరే ఇతర కాంట్రాక్టులు లభించకపోవడమే.
అవినీతిని అరికట్టడంలో కేరళ ఫస్ట్
మన దేశంలో అవినీతి అతితక్కువ స్థాయిలో ఉన్న రాష్ర్టంగా కేరళ నిలిచింది. వందశాతం అక్షరాస్యత కలిగి ఉండటంతోపాటు, అవినీతి, లంచగొండితనంపై ప్రజలకు అవగాహన , రిక్షా కార్మికుడి స్టాయి వ్యక్తికూడా ముఖ్య మంత్రి తో సహా, మంత్రులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటంతో అవినీతి, లంచగొండులను ఆ రాష్ట్రం నివారించగలుగుతోంది. అవినీతి తక్కువగా ఉండటంతో అత్యంత దారిద్ర్య ప్రజల సంఖ్య కూడా ఆ రాష్ట్రంలో గణనీయంగా తగ్గి రికార్డులకెక్కింది.
అవినీతి రహిత దేశాలు
డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్ , స్వీడన్ లు , ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి దేశాలుగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ ఆర్థిక పారదర్శకతలో స్థిరంగా ఉన్నత స్థానంలో ఉన్నాయి. దీంతో ఆయా దేశాలు ‘ఆనంద’ దేశాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. 2025 సెప్టెంబరు1, అతి తక్కువ అవినీతి దేశంగా డెన్మార్క్ అగ్రస్థానంలో నిలవగా, ఫిన్లాండ్, సింగపూర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మన దేశంలో అవినీతి కేసుల్లో ని రాజకీయ నాయకుల జాబితా తక్కువే మీ కాదు. అత్యున్నతాధికారులు, రాజకీయ నాయకుల సంతానం వారి వ్యాపారాల్లో ప్రతి ఏడాది వేలాది రెట్ల లో లాభాలు గడిస్తుండగా మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబంగా, పేదలు- నిరుపేదలుగా మారుతున్నారు. కారణం అవినీతి. ధనవంతులు – పేదల మధ్య రోజురోజుకు అంతరం పెరగడం కూడా అందులో భాగమే. అవినీతి కారణంగా భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 20 కోట్ల మంది ప్రజలు ఆకలితో పడుకుంటున్నారు. 2024 డిసెంబర్ నివేదిక ప్రకారం, ప్రతిరోజూ 7,000 మంది ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 3,000 మంది పిల్లలు. దేశంలో సంపద పెరిగినా వేళ్లపై లెక్కపెట్టే కార్పొరేట్ల వద్దకే అది చేరుతోంది. ఫలితంగా పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అధికార పార్టీలు వారి వందిమాగధులు చట్టాలను అతిక్రమించి అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. నా దేశంలో ఏ ఒక్కడు ఆకలితో పడుకున్నా.. అధ్యక్షుడిగా నేను విఫలం అయినట్టే అని చెప్పే ఆఫ్రికా దేశమైన బుర్గినా ఫాసో అధ్యక్షుడు, సైనికాధ్యక్షుడైన ఇబ్రహీం ట్రవోర్ వంటి నాయకుడు ప్రపంచ దేశాలకు అవసరం.
రోడ్డు, వంతెనల నిర్మాణాల్లో భారీ అక్రమాలు, అవినీతి చోటుచేసుకోవడంతో జననష్టమే కాకుండా మళ్లీ మళ్లీ వాటికి నిధులు కెటాయించడం వల్ల ఆయా అక్రమార్కులు కుబేరులుగా మారుతున్నారు. అదే సమయంలో విద్య, వైద్యం, ప్రభుత్వ గ్రామీణ ఉపాధి పథకం వంటి కీలకరంగాల్లో నిధులు నిండుకుంటున్నాయి. ఫలితంగా ఉత్తర భారతంలో సుమారు 90 వేల పాఠశాలలను మూసివేశారు. అవినీతి సమాజంలో ఉద్యోగ కల్పనలు జరగకపోవడమే కాదు.. ఉన్న ఉద్యోగాలు కూడ పోతున్నాయి. దీంతో యువత నైరాశ్యానికి గురవుతుంది. లేదా విచ్ఛిన్నకర శక్తుల పంచన చేరుతోంది.
లంచగొండులను, అవినీతి అక్రమార్కులను చీల్చి చెండాల్సిన వ్యవస్థలన్నింటినీ రాజకీయ నాయకులు నిర్వీర్యం చేశారు. స్వయం ప్రతిపత్తిగల న్యాయ, ఎన్నికల వ్యవస్థలు కూడా అభాసుపాలవుతున్నాయి. న్యాయమూర్తులు సాక్ష్యాధారాలను బట్టికాకుండా మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తీర్పులు వెలువరించడం, పదవీవిరమణ అనంతరం రాజ్యాంగపదవులు చేపట్టడంతో వారు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఎన్నికల కమిషన్ విషయం ఎంత చెప్పినా తక్కువే .. వాస్తవ ఓట్ల కంటే పోలయ్యే ఓట్లే ఎక్కువ. ఈ మ్యాజిక్ ను చూసి ప్రపంచ దేశాలు పరిహసించినా నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అని పాలకులంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన శాసనసభ, పరిపాలన, న్యాయవ్యవస్థలు ఘోరంగా విఫలం కాగ, గాటిన పెట్టాల్సిన మీడియా అధికార భజనలో మునిగి పోయింది. సామాన్యులు తమ భద్రత కోసం ముందు చూపుతో కూడబెట్టుకుంటున్న ఎల్ ఐసీ నిధులు పక్కదారి పట్టిన సంగతి కూడా విదేశీ పత్రికలు బయటపెట్టేవరకు తెలియకపోవడం ఇందుకు ఉదాహరణ. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం యావత్తూ అవినీతిలో బంధీ అయ్యింది.

















































