ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన అభ్యర్ధులు..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో చాలా మంది నేరచరిత్ర కలిగిన వాళ్లున్నారు. దీనిపై సరైన సమాచారాన్ని నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) వెల్లడించింది. మొత్తం 8,051 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుంటే వారిలో 1,452 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మరో 959 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంవెటున్నారని ఏడీఆర్ ఓ నివేదికను విడుదల చేసింది.
నవంబర్ 30న జరుగుతున్నఎన్నికల్లో తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న 8,051 మంది అభ్యర్ధుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ వారిలో 1,452 నేరచరితులు ఉన్నట్లుగా పేర్కొంది. పోటీ చేస్తున్న 8,051 మందిలో 2,117 మంది నేషనల్ పార్టీల అభ్యర్ధులున్నారు. 2,051 ప్రాంతీయ పార్టీలకు చెందిన వారున్నారు. గుర్తింపు లేని పార్టీలకు చెందిన 537మంది పోటీలో ఉన్నారు. వీళ్లతో పాటు స్వతంత్రులుగా మరో 3,346 మంది అభ్యర్థులున్నట్లుగా నివేదికలో పేర్కొంది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం 8,051 మంది అభ్యర్థులను విశ్లేషిస్తే వారిలో 1,452 అభ్యర్ధుల అఫిడవిట్ లో క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది.మరో 959 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 5రాష్ట్రాల్లో 22మంది అభ్యర్ధులపై హత్య కేసులుండగా, మరో 82మందిపై మర్డర్ అటెంప్ట్ కేసులున్నాయి. 107మందిపై మహిళలపై నేరాలకు పాల్పడినట్లుగా కేసులున్నాయని ఏడీఆర్ నివేదికలో పేర్కొనగా, ఐదుగురు అభ్యర్ధులు అత్యాచార కేసుల్లో ఉన్నారన్నారు.