కవి కరీముల్లా సామాజిక వ్యాసం
ఈరోజు జనవరి 14 ,హజ్రత్ అలీ (రజిఅన్ ) జయంతి సందర్భంగా….
ధీరత్వ ప్రతిరూపం హజ్రత్ అలీ( రజిఅన్ )
మక్కాలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు అలజడి రేపాయి.అందరి దేవుడు ఒక్కడే,మానవులంతా పుట్టుక రీత్యా అందరూ సమానులే అనే ఆయన మాట మక్కా సర్దార్లకు రుచించలేదు.ఏమిటీ !అందరి దేవుడు ఒక్కడా,నీగ్రో బానిసలు కూడా మాకు సమానమా!అంటూ హూంకరిస్తూ ప్రవక్తపై కత్తి కట్టారు.ఆయనపై భౌతిక దాడులు మొదలయ్యాయి.సందేశ ప్రచారం క్లిష్టంగా మారింది.. ప్రవక్తను అనుసరించడమంటే కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే.ఇలాంటి సందర్భంలో ప్రవక్త ఓ సమావేశం ఏర్పాటు చేశారు.అన్ని బాధలను అధిగమించి నాతో నడిచేందుకు మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా ? అని ప్రశ్నించారు.. నిశ్శబ్దం తాండవించింది.ఇంతలో ఓ గొంతు నేను మీతో నడుస్తాను ప్రవక్త అని లేచి నిలబడింది..అంతటా ఆశ్చర్యం.అది ఓ బాలుని గొంతు..ఆ బాలుని తర్వాతి కాలంలో అసమాన ధీరునిగా,దైవ ప్రవక్త అల్లుడిగా,ఇస్లామియా రాజ్యానికి నాలుగో ఖలీఫాగా చరిత్ర లిఖించింది..ఆ బాలుని పేరే హజ్రత్ అలీ (రజిఅన్ ).
ఓసారి అలీ రజిఅన్ వడ్రంగి పని చేసుకుంటూ పనిలో నిమగ్నమై ఉన్నారు.ఓ యూదు వహిల్వాన్ రంకెలు వేసుకుంటూ నన్ను ఎదుర్కొనే శూరుడు మీలో ఎవరైనా ఉన్నారా అంటూ అలీ వద్దకు వచ్చి రెచ్చగొట్టసాగాడు.ఇతరుల్ని చిత్తు చేసేవాడు శూరుడు కాడు.ఆగ్రహంలో నిగ్రహం చూపేవాడే మీలో నిజమైన శూరుడు అని బోధించిన ప్రవక్త వాక్కును అనుసరించి సహనం వహించి అలీ తన పని తను చేసుకుంటున్నారు.నానావిధాలుగా దూషించడం మొదలుపెట్టాడు..అలీ కనీసం కన్నెత్తి చూడటం లేదు.ఇక లాభం లేదనుకుని ముహమ్మద్ (స)దైవ ప్రవక్త అనే విశ్వాసమే నీకుంటే నాతో తలపడు అంటూ అరవసాగాడు.అప్పుడిక అలీ పోరాటానికి సిద్ధమన్నారు.ఇద్దరి మధ్య కరవాల యుద్ధం మొదలైంది.ఒక్క ఉదుటున ఆ వహిల్వాన్ని మట్టికరిపించి అతని గుండెలపై కూర్చున్నారు అలీ.ఉక్రోషం పట్టలేక తుఫుక్కున అలీ ముఖంపై ఉమ్మేశాడు ఆ యూదు వహిల్వాన్.ఆ వెంటనే చేతిలోని కరవాలం పారేసి మౌనంగా వెళ్లసాగారు అలీ..ఆ వహిల్వాన్ కు ఏమీ అర్థం కాలేదు.తనను చంపే అవకాశం ఉన్నప్పటికీ అలా కత్తి పడేయటం అతన్ని ఆశ్చర్యపర్చింది.వీరుడా !అలీ నన్నింతవరకూ మట్టికరిపించిన వారే లేరు.ఉమ్మి వేసిన వెంటనే మీ కత్తి నా గుండెల్లో దిగుతుందేమో అనుకున్నాను.మీరెందుకు నన్ను వదిలేశారో చెప్పగలరా ?అంటూ అడిగాడు.అప్పుడు అలీ ఓయీ నీవు నాపై ఉమ్మేయగానే నావంటి వీరునిపై ఉమ్మేస్తాడా ఇతను అనే అహంకారం నాలో ప్రవేశించింది.అహంకారాన్ని ఇస్లాం అంగీకరించదు.శూరత్వాన్ని నిరూపించుకోవటం కోసం ఇతరుల్ని చంపటం ఆమోదం కాదు.ఇంతవరకూ నీతో పోరాడింది ప్రవక్త ముహమ్మద్ దైవ ప్రవక్త అని సాక్ష్యమిచ్చేందుకే తప్ప నాకు నీపై ఎలాంటి ద్వేషం లేదు అని పలికారు అలీ.ఈ సమాధానం ఆ యూదు వహిల్వాన్ని నిర్ఘాంతపర్చింది..
ప్రవక్త బోధపై విశ్వాసంతో సహనం వహించిన అలీ రజిఅన్ పట్ల అతనిలో గౌరవం పెరిగింది..ఇంతగా సహనాన్ని ప్రబోధించి తన సహచరులచే ఆచరింపజేస్తున్న ముహమ్మద్ ప్రవక్త ఖచ్చితంగా దైవ ప్రవక్తే అని చెప్తూ అచేతనంగా అతని నోటి నుండి లాయిలాహ యిల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ (దేవుడు ఒక్కడే.ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడు.ముహమ్మద్ దైవ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను )అంటూ పలవరించసాగాడు ఆ వహిల్వాన్.హజ్రత్ అలీ రజిఅన్ అతన్ని తన గుండెలకు హత్తుకున్నారు..అలీ చూపిన సహనం అతనిలో పరివర్తన తెచ్చింది.