అమరావతి/ న్యూఢిల్లీ
గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్’ అవార్డు
బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో పురస్కారం అందుకున్న ఏపీ పర్యాటక ప్రతినిధి పద్మారాణి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13, 2025: దేశంలోని ప్రముఖ ట్రావెల్ ట్రేడ్ షో అయిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలోని గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్’ అవార్డు రావడం రాష్ట్రస్థాయిని పెంచింది. వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 11 నుండి 13 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (IICC)లో జరిగిన BLTM 2025లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం సత్తా చాటింది. వ్యాపారం, విశ్రాంతి ప్రయాణం మరియు MICE పర్యాటకంలో రాష్ట్రం తన ఉనికిని ప్రదర్శించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో వైవిధ్య ప్రదర్శనతో రాష్ట్రం తన విశాలమైన పర్యాటక అవకాశాలను అందంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించి అవార్డు సాధించింది. ఈ అవార్డును ఏపీ టూరిజం అథారిటీకి చెందిన చీఫ్ మార్కెటింగ్ అధికారిణి, కమ్యూనికేషన్ ఆఫీసర్ పద్మారాణి సీలా అందుకున్నారు. అదే విధంగా ఈవెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టాల్ వద్ద పర్యాటక ప్రొఫెషనల్స్‌కు రాష్ట్రంలోని విభిన్న ఆకర్షణలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా వారసత్వ ప్రదేశాలు, సముద్రతీర పర్యాటక గమ్యస్థానాలు, గ్రామీణ పర్యాటకం, పర్యావరణ పర్యాటక ఆవిష్కరణల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన రాష్ట్రాన్ని ఆఫ్బీట్, సస్టెయినబుల్ మరియు అనుభవాత్మక పర్యాటక గమ్యస్థానంగా స్థిరపరచిందనడంలో అతిశయోక్తి లేదు.
గండికోటకు జాతీయ స్థాయిలో గుర్తింపు
“భారతదేశపు గ్రాండ్ కేనియన్”గా గుర్తింపు పొందిన ఏపీ లోని గండికోటకు, ICRT మరియు భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన ‘రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్’లో “మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు” లభించింది. ఈ అవార్డు గండికోటకు వరించడం ద్వారా అడ్వెంచర్ టూరిజం ఇష్టపడే పర్యాటకులకు ఉత్సాహం ఇస్తోంది.
బీఎల్టీఎమ్ 2025లో, ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రతినిధులు B2B స్పీడ్ నెట్‌వర్కింగ్ సెషన్లలో పాల్గొన్నారు. తద్వారా శ్రీలంక, ఇజ్రాయెల్, సెయింట్ పీటర్స్‌బర్గ్, నార్తర్న్ యూరోప్ నుండి వచ్చిన కార్పొరేట్ బయ్యర్లు, మైస్ ప్లానర్లు, టూర్ ఆపరేటర్లు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు (DMCs), హాస్పిటాలిటీ బ్రాండ్స్, అంతర్జాతీయ టూరిజం బోర్డులతో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, కొత్త మైత్రీ సంబంధాలను నెలకొల్పారు.
మైస్ టూరిజం విస్తరణపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, గండికోట, సూర్యలంక బీచ్ తదితర ప్రదేశాల ద్వారా ప్రపంచ స్థాయి మైస్ (MICE) సదుపాయాలను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. మొత్తంగా కాన్ఫరెన్స్‌లు, కార్పొరేట్ ఈవెంట్లు, ప్రోత్సాహక ప్యాకేజీలు వంటి వాటి ద్వారా మైస్ టూరిజం విభాగంలో అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో కేవలం బిజినెస్ మరియు మైస్ పర్యాటకంపై దృష్టి సారించిన ప్రధాన ట్రేడ్ షో అయిన BLTM ఈవెంట్‌లో 500కిపైగా ఎగ్జిబిటర్లు, 15,000కిపైగా ప్రీ-క్వాలిఫైడ్ బయ్యర్లు పాల్గొన్నారు.ఫెయిర్‌ఫెస్ట్ మీడియా లిమిటెడ్ ఈ ఈవెంట్ నిర్వహించింది.. ఈ ట్రేడ్ షోలో పాల్గొనడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అవకాశాలను ప్రపంచానికి తెలిపినట్లు అయింది.