ఆంధ్ర ప్రదేశ్ అగ్రి మిషన్ – లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా ? (పార్ట్ 1)
2019 ఎన్నికలలో తిరుగులేని ప్రజామద్దతుతో 151 MLA సీట్లు గెలుసుకొని, రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారిని మట్టికరిపించి జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన వైనం. విభజన తరువాత జీడీపీ విషయంలో వ్యవసాయరంగంపై (36%-AP , 18% ఇండియా ) ఎక్కువ ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రైతుల అవసరాలు, ఎదురుకొంటున్న సమస్యలు తెలుసుకొని, కొలువుతీరిన రెండు నెలలకే ముఖ్యమంత్రిగారే స్వయంగా అధ్యక్షులుగా, పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ,స్వయంగా రైతు అయిన నాగి రెడ్డి గారిని కార్య నిర్వాహక ఉపాధ్యక్షులుగా, ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ గారు , RDT మల్లా రెడ్డి గారు , ప్రముఖ rice breeder రాఘవ రెడ్డి గారు తదితరులు మెంబెర్స్ గా , అగ్రి మిషన్ ఏర్పాటు చేయడంఎంతో హర్షించదగ్గ పరిణామం.
అగ్రి మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యవసాయరంగం, అనుబంధరంగాలు ఎదురుకొంటున్న అనేక సవాళ్ళను,ముఖ్యంగా ఉత్పత్తి, మార్కెటింగ్, ,పంటకు మంచి ధరలు వచ్చే విధంగా, సంబంధిత శాఖలకు పాలసీపరంగా సలహాలు ఇస్తూ పనిచేయించడం. వ్యవసాయాన్ని పరిశ్రమలు, ఇతర రంగాలకు అనుసంధానం చేయటం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఎగుమతులు/దిగుమతులు, పంట విస్తీర్ణ ప్రణాళికలు లాంటి విషయాలను వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయంతో ముందుకు తీసుకొని వెళ్లడం అగ్రి మిషన్ ముఖ్య విధి. ముఖ్యమంత్రిగారికి రైతులపై ఉన్న ప్రేమకు ఇదొక మచ్చుతునక. ముఖ్యమంత్రి గారి సంకల్పం ఎంతవరకు నెరవేరిందో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
సశేషం ……..
బొంతు గురువా రెడ్డి – బీబీసీ*
ఆంధ్ర ప్రదేశ్ అగ్రి మిషన్ – లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా ? (పార్ట్ 2)
అగ్రి మిషన్ ఏర్పాటైన కొత్తలో 5-6 మీటింగ్స్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగి ,కాలక్రమేణా కార్యాచరణ ప్రణాళికలు లేక , కొత్తదనం లోపించి మరుగున పడ్డట్టు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అగ్రి మిషన్ తమ లక్ష్యాన్ని, కార్యనిర్వహణ ప్రణాళికగా తయారుచేసుకొని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. అగ్రి మిషన్ ప్రణాళిక గురించి వారి వెబ్ పేజి లో గాని, ఇతరత్రా ముద్రించినట్టు లేదు.
సంబంధిత శాఖలు సిబ్బంది, జీతభత్యాలు, బడ్జెట్ , పాత పద్దతులతో మునిగి త్రేలుతూ, కొత్త ఆలోచనలు, ఆచరణ ప్రణాళికలు చేయలేని పరిస్థితినుండి బయటపడాలనే ముఖ్యమంత్రి గారు అగ్రి మిషన్ మార్గం ఎన్నుకోవటం. కారణం ఏదైనా కావచ్చు , అగ్రి మిషన్ తమ ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారు ఆశించిన ఫలితాలనుండి దూరంగా జరిగి, పిలవని పేరంటానికి భాజాభజంత్రీలు వాయిస్తూ బాధ్యతను మరచి ఊళ్లు తిరగటం మంచి సంప్రదాయం కాదు
వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న లెక్కలు పదే పదే నెమరువేయటం అగ్రి మిషన్ యొక్క పని కచ్చితంగా కాదు. అట్టి వాటికి సంబంధిత శాఖ మంత్రి, సమాచార శాఖ ఉన్నాయి. నేను రెండు , మూడు సార్లు అగ్రి మిషన్ వాళ్లతో మాట్లాడినప్పుడు కూడా , మా పాత్ర సలహాలు , సూచనలు చేయడంవరకే, కార్యాచరణకు సంబంధిత శాఖలు ఉన్నాయి అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. బహుశా అందుకేనేమో ఉద్దండులైన సభ్యులుకూడా విషయం గ్రహించి మెల్లగా అగ్రి మిషన్ ప్రస్తుత కార్యాచరణ నుండి తప్పుకొన్నట్టు తెలుస్తుంది . రౌతు గుర్రాన్ని తొట్టివరకు తీసుకువెళ్లగలడు కానీ బలవంతగా నీరు త్రాగించలేడు కదా?
ఆకాశానికి హద్దులు లేవు , అవకాశానికి సరిహద్దులు అన్నట్టు, ముఖ్యమంత్రిగారి మానసపుత్రికగా వెలిసిన అగ్రి మిషన్, కార్యనిర్వహణ నాయకత్వ లోపంతో ముందుకు పోలేని పరిస్థితి. ఇప్పటికైనా మేల్కొని, సమర్ధతని వెతికి పట్టుకొని, ఏపీలో ఉన్న వ్యవసాయ, అనుబంధరంగ వనరులకు సానపట్టి, వ్యవసాయం లాభసాటి అని నిరూపించవచ్చు కొన్ని పంటలు తీసుకొని ఎలా లాభసాటి వ్యాపారంగా మార్చవచ్చో తేలుచుకొందాం
సశేషం
బొంతు గురువా రెడ్డి – బీబీసీ
ఆంధ్ర ప్రదేశ్ అగ్రి మిషన్ – లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా ? (పార్ట్ 3)
ఉదాహరణకి మొక్కజొన్న తీసుకొందాం. మొక్కజొన్న వరి, గోధుమ తరువాత దేశంలో ముఖ్యమైన పంట. ఆంధ్రప్రదేశ్ 2.6 లక్షల హెక్టర్స్ లో 4.14 మిలియన్ MT మొక్కజొన్న పండించి, దేశ ఉత్పత్తిలో 20.9% అంటే శేషభాగంతో అగ్రస్థానంలో నిలవడం శుభపరిణామం.
గుంటూరు , కృష్ణ జిల్లాల రబి మొక్కజొన్న దిగుబడి అమెరికా దేశ దిగుబడిని అధిగమించడం మన రాష్ట్రానికి గర్వకారణం.
మొక్కజొన్న ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమలో, పశువుల దాణా గాను, ఇథనాల్ తయారీకి ఎక్కువ వాడుతారు. ఆంధ్ర ప్రదేశ్ 249639 లక్షల గుడ్డు ఉత్పత్తితో (20%) దేశంలో అగ్రస్థానంలో ఉంది. అలాగే కోడి మాంసము ఉత్పత్తిలో దేశంలో (11%) నాలుగోవ స్థానంలో ఉంది.
మనకున్న అనుకూల పరిస్థితులు ముఖ్యంగా మొక్కజొన్న లభ్యత దృష్టిలో పెట్టుకొంటే మనం ఇతర రాష్ట్రాలకన్నా తక్కువ వ్యయంతో ఉత్పత్తి పెంచి ఇంకా ముందుకు పోవచ్చు. మొక్కజొన్న మీద పూర్తిగా మనమీద ఆధారపడిఉన్న తమిళనాడు చాలా ఏళ్ళు గుడ్డు ఉత్పత్తిలో మొదటి స్థానం , ఇప్పుడు రెండవ స్థానంలో ఉందంటే, మొక్కజొన్న పుష్కలంగా లభ్యత ఉన్న మనం పౌల్ట్రీ రంగంలో ఇంకా ఎంత ముందుకు దూసుకు వెళ్ళవచ్చో ఆలోచించండి.
సహజంగా మనకు మొక్కజొన్న పంట ఎక్కువవల్ల రేట్లు పక్కరాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉంటాయి. ఇట్టి పరిస్థితులతో రైతులకు రేటు రావాలంటే రవాణా ఖర్చులు తగ్గించుకొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలి. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు దేశంలో పౌల్ట్రీ రంగంలో రెండవ స్థానాల్లో ఉన్నా మొక్కజొన్న పంట బాగా తక్కువ . కచ్చితంగా మన రాష్ట్రము నుండి కొనవలచిందే. ఇట్టి పరిస్థితులలో తగినన్ని రైలు వాగెన్స్ ఏర్పాటు చేయడం, జలమార్గాలద్వారా రవాణాకు ఉన్న అవకాశాలు కల్పించటం లాంటి దూరదృష్టి ఆలోచనలు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేవిధంగా పని చేయవలచిన ఆవశ్యకత ఉంది.
మన రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మొక్కజొన్న పంటకు, తద్వారా కోళ్ల పరిశ్రమ విస్తరించడానికి అనేక అవకాశాలున్నాయి. మొక్కజొన్న పంటకు అనువైన పుష్కలంగా నీరు లభ్యతఉన్న భూములు, పరిశ్రమ పెట్టటానికి తక్కువధరలో భూములు, గుడ్డు గిరాకీ ఉన్న ఈశాన్యప్రాంత రాష్ట్రాలు దగ్గరగా ఉండటం, కోళ్ల పరిశ్రమ భారీగా చేపట్టుటకు ఎంతో అనుకూలం.
కొత్తగా ఏర్పడ్డ అగ్రిమిషన్ అందివచ్చిన అవకాశాన్ని కనీసం గుర్తించిన దాఖలాలు లెవ్వు. కరుడుకట్టిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఇటువంటి ఆలోచనలు చేయడం, ఆచరణలోకి తీసుకురావడం జరగదు కాబట్టే , ముఖ్యమంత్రిగారు ఏదో సాధిస్తారని అగ్రి మిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. అగ్రిమిషన్ కార్యనిర్వాహణ సిబ్బంది ఇలాంటి వినూత్న ఆలోచనలకు దూరంగా జరిగి, మీడియా ముందుకువచ్చి అసందర్భ విషయాలు మాట్లాడటం అగ్రిమిషన్ ప్రజల దృష్టిలో పలసన అయేటట్టు చేసింది. ఇప్పటికైనా అగ్రిమిషన్ వారు కళ్ళు తెరిచి ఇల్లాంటి కార్యక్రమాలు చేపడితే కొంతయినా మంచి జరుగుతుంది.
సశేషం
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఏపీ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు-ఇంధన పంటగా మొక్కజొన్న ( పార్ట్ 4)
రాష్ట్ర జీడీపీలో 36% తో ప్రాథమిక రంగానికి అగ్రతాంబూలం. 4.14 మిలియన్ MT ( దేశంలోని పంటలో 21%) మొక్కజొన్న ఉత్పత్తితో ప్రధమస్థానం. వరిపంట ఉత్పత్తిలోకూడా ముందు వరస.
మొక్కజొన్న , నూకలు, చెడిపోయిన ధాన్యం ముడిసరుకుగా ఇథనాల్ ఉత్పత్తి, ఇథనాల్ డీజల్, పెట్రోలులో కలపటం , తద్వారా ముడిసమురు దిగుమతులు తగ్గించుకోవడం మన దేశానికి ఎంతో అవసరం. 20% ఇథనాల్ కలపటం లక్ష్యంగా పెట్టుకొనగా, ఇప్పటికి 10% వరకు వచ్చిన పరిస్థితి. ఈ లక్ష్యం చేరుకోవాలంటే ప్రస్తుత ఇథనాల్ ఉత్పత్తి 700 కోట్ల లీటర్స్ నుండి 1500 కోట్ల లీటర్స్ కు పెంచుకోవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వవం తక్కువ వడ్డీ, దీర్గకాలిక రుణాలు, FCI నుండి బియ్యం, ఇథనాల్ కి గిట్టుబాటు ధర లాంటి ఆకర్షణీయ పథకాలతో ప్రోత్సహిస్తున్న సందర్భం. బియ్యం, మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే ముందున్న ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
దేశంలో ప్రస్తుతం 123 డిస్టలరీస్ 328 కోట్ల లీటర్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిఉండగా ఆంధ్రప్రదేశ్ 15 యూనిట్స్, 38.8 కోట్ల లీటర్స్ సామర్థ్యంతో నాలుగవ స్థానంలో ఉంది. మనకన్నా ముందు పంజాబ్ (18/76.8), హర్యానా (15/49.1 ), మహారాష్ట్ర (28/42.7) ఉన్నాయి. చెరుకు పరిశ్రమ ఆధారిత ఇథనాల్ కలుపుకొంటే మన ఉత్పత్తి చాలా తక్కువ.
ఇంతకముందు మొక్కజొన్న పంటతో పౌల్ట్రీ రంగం అభివృద్ధికి ఏపీలో ఎంత అవకాశం ఉందొ చర్చించుకొన్నాము. మొక్కజొన్నని ఇందనపంటగా గుర్తించి కొత్త డిస్టలరీస్ కు అవకాశాలు కలిపిస్తే, రైతులకి గిట్టుపాటు ధరతోపాటు రాష్ట్రములో పరిశ్రమల అభివృద్ధికి ఎంతో దోహదశపడుతుంది. ప్రస్తుతం మనకున్న పంటతో ఇథనాల్ ఉత్పత్తి 3 రేట్లుపైన పెంచవచ్చు. రాష్ట్రంలో మూతబడ్డ సహకార చెక్కెర మిల్లులు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో అపార అవకాశాలు ఉన్నాయి. మనకున్న 4 డెల్టా ప్రాంతాల్లో పుష్కలంగా ఉన్న వనరులతో ఇందనపంట ఇంకా పెంచుకొని రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో ముందుకు నడిపించవచ్చు.
అగ్రికల్చర్, ఎక్సయిజ్ , పరిశ్రమలశాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాధమికరంగంలో రాష్ట్రంలో ఉన్న అపార వనరులను పరిశ్రమలలో ముడిసరుకుగా వాడుకొని గణనీయమైన సంపద సృష్టించి జీడీపీలో పరిశ్రమల వాటా ప్రాథమిక రంగంతో పాటు పెంచవచ్చు. దీనికి బలమైన సంకల్పం కావాలి
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఏపీ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు- ఆయిల్ పామ్ ( పార్ట్ 5)
2.95 లక్షల MT క్రూడ్ పామ్ ఆయిల్ (దేశంలో 90%) ఉత్పత్తితో ఏపీది అగ్రస్థానం. 0.48 లక్షల MT క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తితో , ఏపీని అందుకోనంత దూరంతో తెలంగాణది రెండవ స్థానం. ఇండియా దిగుమతులలో ముడిసమురు తరువాత స్థానం వంటనూనెలు. ప్రస్తుత వంటనూనెల దిగుమతి 14 మిలియన్ MT , అందులో 8.5 మిలియన్ MT తో పామ్ ఆయిల్ అగ్రస్థానం. 19 బిలియన్ డాలర్స్ విదేశీ మారక ద్రవ్య ఖర్చుతో, దేశం అవసరంలో 53 శాతంపైన వంట నూనెలు దిగుమతి చేసికొంటున్న సందర్భం.
GOI వంటనూనెల దిగుమతులు తగ్గించవలసిన ఆవశ్యకతను గుర్తించి, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్( NMEO), నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్( NFSM) ద్వారా 27. 99 లక్షల హెక్టర్లు ఆయిల్ పామ్ పండించడానికి అనువైన భూములు , అందులో 9 లక్షల హెక్టర్లు ఈశాన్య రాష్ట్రాల్లో గుర్తించడం, 60:40 నిష్పత్తితో, అదే ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాలు అయితే 90:10 నిష్పత్తితో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెట్టి ఆయిల్ పామ్ విస్టీర్ణత, పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ సదుపాయాలు, బిందు సేద్యం ద్వారా నీటి వినియోగం నియంత్రించడం లాంటి అనేక అవకాశాలు కల్పించపడ్డాయ్.
ఏపీకి కనుచూపు దూరంలో కూడా లేని తెలంగాణ, ఆయిల్ పామ్ మిషన్ స్థాపించి, రాబోయే 5-6 ఏళ్లలో 2 మిల్లియన్ ఎకరాలు ఆయిల్ పామ్ సాగు దిశగా అడుగులు వేస్తున్న సందర్భం. ఇన్పుట్ సబ్సిడీస్, అధిక రాబడి, సీడ్లింగ్స్ సరఫరా, ఫార్మ్ టు ఫ్యాక్టరీ లింకేజ్స్ ద్వారా రైతులలో నమ్మకం కల్పించి ముందుకెళ్తున్న పరిస్థితి.
తెలంగాణకన్నా ఎక్కువ అనుకూల పరిస్థితులు, అపార అవకాశాలు ఉన్నా ఏపీ ఎందుకు ముందుకు రావడం లేదో అర్ధం కావడం లేదు. సాంప్రదాయశాఖలు ఇల్లాంటివి చేయలేవని గుర్తించిన ముఖ్యమంత్రి గారు, అగ్రి మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రి మిషన్ కి ఇల్లాంటి పథకాలు పని చేయడానికి సువర్ణావకాశాలు.
ముడిసమురు, వంటనూనెల దిగుమతి తగ్గించడంలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రతాబులం తీసుకోవడానికి, పంట విస్తీర్ణతలో సమతుల్యత పాటించడం ద్వారా అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించేటట్టు చేయడానికో మంచి అవకాశం.
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఆంధ్ర ప్రదేశ్ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు – కొబ్బరి పంట (పార్ట్ 6)
దేశంలో కొబ్బరి పంటలో శేషభాగం అంటే సుమారు 93 శాతం, దక్షిణ భారత దేశంలోనే పండుతుంది. 5 లక్షల హెక్టర్లతో కర్ణాటక మొదటి స్థానం, 4.65 లక్షల హెక్టర్లతో తమిళనాడు, 4.03 లక్షల హెక్టర్లతో కేరళ , రెండు మూడు స్థానాలలో ఉన్నాయి. ఏపీలో ప్రస్తుత విస్తీర్ణం 105.8 లక్షల హెక్టర్లు. కొబ్బరి బోర్డు వారి లెక్కల ప్రకారం ఏపీలో కొబ్బరి విస్తరణం 5.75 హెక్టర్లకు పెంచి దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలబెట్టే అవకాశం. తక్కిన దక్షణ భారతదేశంలో పంట విస్తీర్ణ అవకాశాలు లేవు.
కేంద్ర ప్రభుత్వం, కొబ్బరి పంట విస్తీర్ణత కొరకు ముఖ్యంగా నర్సరీ, మొక్కల పెంపకం, సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు గ్రాంట్/ లోన్ పథకాలతో ముందుకు వస్తున్న సందర్భం. రాష్ట్రంలోని సంభందిత శాఖలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని కొబ్బరి సాగులో ముందుకు తీసుకెళ్లాలని కోరుకొందాం.
కొబ్బరి పరిశ్రమలలో కొబ్బరి నూనె ( ఎండు కొబ్బరి నుండి), వర్జిన్ కొబ్బరి నూనె ( పచ్చి కొబ్బరి పాలనుండి), మాట్స్, బెడ్స్, రోప్స్ పాటు యాక్టీవ్టెడ్ కార్బన్ చాలా ముఖ్యమైన మరియు లాభసాటి పరిశ్రమ. యాక్టీవ్టెడ్ కార్బన్, డైమండ్ మైనింగ్ లాంటి పరిశ్రమలలో అతిముఖ్యమైన ముడిపదార్థం. యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతుంది.
కారణాలు ఏమైనా మనరాష్ట్రంలో యాక్టీవ్టెడ్ కార్బన్, వర్జిన్ కొబ్బరి నూనె పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. తమిళనాడు, కర్ణాటక మనకన్నా చాలా ముందున్నాయి .
రైతులు ధైర్యంగా కొబ్బరి సాగుచేప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది మొక్కలమీద నమ్మకం కుదరటం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న మొక్కల్లో చాలావరకు నాసిరకం. మార్కెట్టులో ఆంధ్రబోండం అంటే 20 రూపాయలు , కర్ణాటక బొండం 60 రూపాయలు. సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి మొక్కలు రైతులకు అందించాలి.
నేను 15 ఎకరాల్లో కొబ్బరి పంట మా లంక పొల్లాలో ఎద్దామని గత రెండేళ్లగా ప్రయత్నం. ఇంతవరకు సరైన విత్తనం దొరకలేదు. ఉద్యాన శాఖనుండి మద్దతు లేదు. అనుభవం వున్న మిత్రుడిని అడిగితే ఫిలిఫైన్స్ విత్తనం కనుక సంపాదించగలిగితే ఉత్తమం అని చెప్పారు. దండిగా నీళ్ళు , టెంకాయగా చూస్తే దట్టమైన కొబ్బరి ఈ విత్తన ప్రత్యేకత. కొబ్బరి బోర్డు గాని, ఉద్యాన శాఖలు గాని ఈ దిశగా ఆలోచించిన దాఖలాలు లేవు. ఇప్పటికే మనం తైవాన్, మలేషియా లాంటి దేశాలనుండి అనేక ఫలజాతుల జెర్మ్ ప్లాజం దిగుమతి చేసికొంటున్నాం. రైతులకు ఎంతో లాభసాటి అయ్యిన కొబ్బరి జెర్మ్ ప్లాజం తెచ్చుకొని మంచి జాతి మొక్కలు అందించి రైతులకు ప్రభుత్వాలపై విశ్వాసం పెరిగేటట్టు చూడాలి.
సాంప్రదాయక ప్రభుత్వ శాఖలు ఇట్టి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితులు లేవుకాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందుచూపుతో అగ్రి మిషన్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. అగ్రి మిషన్ ఇల్లాంటి అవకాశాలు అందిపుచ్చుకొని రాష్టాన్ని కొబ్బరిపంటలో అగ్రస్థానంలో నిలిపి, సంబంధిత పరిశ్రమలద్వారా రాష్ట్ర రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరుకొందాం.
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఆంధ్రప్రదేశ్ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు – అరటి , పసుపు పంటలు ( పార్ట్ 7)
అరటి ఉత్పత్తిలో 58.38 లక్షల టన్నులు ( దేశంలో 18%) పంటతో దేశంలో మొదటి స్థానం. రాయలసీమ ప్రాంతంలో పచ్చ అరటి మంచి సైజు, నిల్వ ఉండేగుణంతో టిష్యూ కల్చర్ మొక్కలు అభివృద్ధి చెందిన సందర్భం. ప్రస్తుతం సరుకు అమ్మకానికి ఢిల్లీ వ్యాపారాలు, ఢిల్లీ మార్కెట్ మీద ఆధారపడిన పరిస్థితులు. దళారీ వ్యవస్థ, రేట్లలో భారీ హెచ్చు తగ్గులతో రైతు నష్టపోతున్నది జగమెరిగిన సత్యం. ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్న ఒక్కరో , ఇద్దరో ట్రేడర్స్ తప్పితే రైతు సంఘాలను ప్రోత్సహించి ఎగుమతులు రైతులు చేసే పరిస్థితులు లేవు.
చెక్కెరకేళి, కర్పూరం అరటిపళ్ళు ఆంధ్ర ప్రత్యేకం. వీటికి నిల్వ సామర్థ్యం చాల తక్కువ. ఇప్పుడిప్పుడే టిష్యూ కల్చర్ మొక్కలు లభ్యమవుతున్నాయి అని తెలిసింది. నిల్వ సామర్థ్యం పెంచేటట్టు ఉద్యాన యూనివర్సిటీ వారు కృషి చేస్తే రైతులకు మంచి జరుగుతుంది. రాష్ట్ర సంస్థలు, దేశంలోని ఇతరమార్కెట్లతో e – markets ప్లాటుఫారమ్ ద్వారా అనుసంధానం చేస్తే రైతులకు , ఇతర రాష్ట్రాల్లోని వర్తకులకు, కస్టమర్స్ కు మంచి జరుగుతుంది .
పసుపుపంటలో 3.3 లక్షల MT ఉత్పత్తితో ( 28%) దేశంలో ప్రధమ స్థానం తెలంగాణది. ఏపీది నాల్గవ స్థానమైన, పటిష్టమైన వ్యవస్థకిలిగి పరిస్థితిలు అనుకూలించినప్పుడు విస్తీర్ణం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర సంస్థలు పంట నియంత్రణ, మేలైన పోస్ట్ హార్వెస్ట్ పద్ధతులు, కర్కమిన్ అధికంగా ఉన్న రకాలు ప్రోక్షహిస్తే రైతులు ప్రస్తుత క్లిష్టపరిస్థితులనుండి బయటపడే అవకాశం ఉంది.
ప్రభుత్వాలు రైతుపండించిన పంట అంతా కొంటాం, MSPకి తగ్గకుండా కొంటాం లాంటివి చెప్పి కొనలేని పరిస్థితులలో రైతులవిశ్వాసం కోల్పోతున్న పరిస్థితులు. ఆకలితో ఉన్నవాడికి చేప ఇచ్చేబదులు, చేపలు ఎలాపట్టాలి నేర్పితే, సమస్యకు శాశ్వతపరిస్కారం దొరుకుతుంది అని తెలుసుకదా.
గౌరవముఖ్యమంత్రిగారు ఎంతో నమ్మకంతో ఏర్పాటుచేసిన అగ్రి మిషన్, పంటల విస్తీర్ణ ప్రణాళిక, విలువజోడించిన వస్తువుల తయారీ, గోడౌన్ల లభ్యత, పంట తనఖా లోన్స్ , e -markets, మంచి విత్తనాలు లాంటివాటిమీద దృష్తిపెట్టి పని చేస్తే రాష్ట్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది.
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఆంధ్రప్రదేశ్ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు – ఫిషింగ్ హర్బోర్స్ ( మత్స్యశాఖ) – పార్ట్ 8
974 kms తీరప్రాంతం, గుజరాత్ తరువాత రెండవ స్థానం. 555 మత్స్యకార గ్రామాలు, 383 ఫిష్ లాండింగ్ సెంటర్స్, 8.51 లక్షల మత్స్యకారుల జనాభా ఉన్న రాష్ట్రము. దేశంలోని సీ ఫుడ్ ఎగుమతులలో 40% ఏపీ నుండి జరగడం రాష్టానికి గర్వకారణం. సముద్ర వేటనుండి వచ్చే మత్స్య సంపదలో మాత్రం గుజరాత్, కేరళ , తమిళనాడు తర్వాత నాల్గవ స్థానంలో ఉండి, ఎదుగుదలకు ఏంతో అవకాశాలు ఉన్న సందర్భం.
సముద్ర మత్స్యసంపద కొల్లగొట్టంలో నార్వే, చిలి, చైనా , సింగపూర్ లాంటి దేశాలకన్నా మనం చాలా వెనుకబడిఉన్నాం. సముద్రమత్స్యసంపద కొల్లగొట్టటం చైనాలో ఏడాదికి 6 టన్నులు ఉంటె మనదేశంలో 2 టన్నులు మాత్రమే. మన బోట్ల సామర్థ్యం, మత్స్యకారుల నైపుణ్యం, హర్బోర్స్ డిజైన్ లాంటి వాటిలో మనం ఎంతో మార్పులు తీసుకురావలసిన అవసరముంది.
ఏపీలో ప్రస్తుతం 4 ఫిషింగ్ హర్బోర్స్ ఉన్నాయి. అందులో వైజాగ్ , కాకినాడ హర్బోర్స్ ఒక మోస్తరుగా, బందర్, నిజాంపట్నం హర్బోర్స్ నత్త నడకన నడుస్తున్నాయి. ఇక్కడి సమస్యలు తెలుసుకోకుండా, ఈహర్బోర్స్ లో అవకాశాలు మెరుగుపర్చకుండా, వీటిని సరైన మార్గంలో పెట్టకుండా, 9 కొత్త ఫిషింగ్ హర్బోర్స్ 3300 కోట్లరూపాయల ఖర్చుతో చేపట్టటం, ముఖ్యంగా లాభసాటిగా నిర్వహించటం సవాళ్లతో కూడుకున్న నిర్ణయమే. ముఖ్యమంత్రిగారికి మత్యకారులపై ఉన్న ప్రేమ ఫలించాలంటే, వారు సృష్టించిన అగ్రి మిషన్ లాంటి వ్యవస్థలు ముందుకువచ్చి సవాళ్ళను అద్భుత అవకాశాలుగా మార్చి ముఖ్యమంత్రిగారికి మంచి పేరు వచ్చేలా చూడాలి.
ఇప్పటికే ముఖ్యంగా ఏపీ నుండి మత్స్యసంపద దిగుమతి చేసుకొంటున్న దేశాలు, మన హర్బోర్స్లో సాల్మొనెల్లా, బాక్టీరియా సమస్యలు, శుభ్రత లోపం ఉన్నాయని, వాటిని లోతుగా అధ్యయనం చేయటానికి బృందాలు పంపినట్టు తెలిచింది. నాణ్యత ప్రమాణాలు, ముఖ్యంగా పోస్ట్ హార్వెస్ట్ మానేజ్మెంట్ లోపాలు పరిష్కరించకుంటే ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఉన్న రేట్లు ఇంకా తగ్గడం, ఎగుమతి అవకాశాలు పూర్తిగా తగ్గే ప్రమాదం పొంచివుంది.
సింగపూర్ లాంటి దేశాల్లో ఫిషింగ్ హర్బోర్ అంటే ఒక సమీకృత ఫెసిలిటీ అంటే బోట్ బెర్త్స్, ఫిషెర్మెన్ రెస్టింగ్ రూమ్స్, ఫ్రెష్ వాటర్ ఫెసిలిటీ, ఫిషింగ్ నెట్స్ సెంటర్, ఐస్ మేకింగ్ యూనిట్, ఫిష్ స్టోరేజ్ ఫెసిలిటీ , రవాణా సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి ఫిష్ ఆక్షన్ సెంటర్, అంతర్జాతీయ ఫుష్ ట్రేడర్స్ కి ఆఫీస్ సదుపాయాలు, ఇవ్వికాక రెస్టురంట్స్ , 5 స్టార్ హోటల్ లాంటి అనేక సదుపాయలతో ఒక మంచి వ్యాపారకేంద్రంలా అభివృద్ధి చేస్తున్న సందర్భం. అందుకే సింగపూర్లో దొరికిన ట్యూనా చేప, అదే సముద్రంలో ఇండియాలో దొరికిన ట్యూనా కన్నా 5 నుండి 10 రేట్లు ఎక్కువ రేటు పలుకుతుంది.
అంతర్జాతీయ స్థాయి ఫిషింగ్ హర్బోర్స్ నిర్మించి ప్రపంచ మర్కెట్స్ తో పోటీపడాలంటే మన స్థానిక పరిస్థితులు అర్ధం చేసుకొని మత్స్యకారులు, ట్రేడర్స్ మధ్య లావాదేవీలు, సంబంధాలలో మార్పులు తీసుకురావడం, పటిష్ట మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలి.
కొత్త ఫిషింగ్ హర్బోర్స్ విషయంలో కూడా ఇల్లాంటి ఆలోచనలు ఉన్నట్టు అనిపించడం లేదు. సరైన నిర్ణయాత్మక ఆలోచనలు చేసి ఆచరణలోకి తేకుంటే ఫిషింగ్ హర్బోర్స్ కి ఖర్చు చేస్తున్న 3300 కోట్లు, మత్స్యశాఖ మంత్రి మీడియాకు చెప్పిన హర్బోర్స్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టె 20000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవ్వుతుంది.
ఇల్లాంటి విప్లవాత్మక నిర్ణయాలు సరైన ఆచరణలోకి తీసుకురావటంకోసం ఏర్పడిన ముఖ్యమంత్రిగారి మానస పుత్రిక అగ్రి మిషన్, దీనిని తమ భుజస్కందాలపై వేసుకొని ముందుకు నడిపిస్తుందని ఆశిద్దాం. చంద్రబాబు గారు జైల్లోనే ఉంటారా, వారి చిట్టాలు విప్పటానికి అనేకమంది రాజకీయ ఉద్దండులు ఉన్నారు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏంతో అనుభవం ఉందని నమ్మి, గుర్తించి ముఖ్యమంత్రి గారు ఏంతో నమ్మకంతో అగ్రి మిషన్ వైస్ చైర్మన్ గా భాద్యతలు అప్పచెప్పిన నాగిరెడ్డి గారు, దయచేసి రాజకీయాలు ప్రజానాయకులకు వదిలి, వ్యవసాయ అనుబంధ రంగ సమస్యలపై దృష్టిపెట్టి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు, ప్రతిష్టలు కలిగేలా పని చేస్తారని ఆశిద్దాం.
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)!
ఆంధ్రప్రదేశ్- ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు – పాడి పరిశ్రమ ( పార్ట్ 9)
221 మిలియన్ MT పాల ఉత్పత్తితో ప్రపంచంలో ఇండియాది అగ్రస్థానం. ఇది సాధించడానికి మూలపురుషుడు కీర్తిశేషులు డాక్టర్ కురియన్, కేరళవాసి, మనదేశ ముద్దుబిడ్డ. వారికి మనదేశప్రజలు సదా రుణపడి ఉంటారు.
పాలఉత్పత్తిలో రాజస్థాన్( 33.27 MMT), యూపీ ( 33.01 MMT ), ఎంపీ ( 19 MMT), గుజరాత్ ( 16.7 MMT ) తరువాత 15.4 MMT ఉత్పత్తితో ఏపీది 5వ స్థానం. వైశాల్యాన్ని పరిగణలోకి తీసుకొంటే ఇక్కడా మనది అగ్రతాంబులమే.
ఈ గణాంకాల ప్రకారం చూసుకొంటే రోజుకు గుజరాత్ లో 4.6 కోట్ల లీటర్లు, ఏపీలో 4.4 కోట్ల లీటర్లు పాలు ఉత్పత్తి ఉంది. గుజరాత్ లో సహకారరంగ డైరీలు రోజుకి 2.3 కోట్ల లీటర్లు, ప్రైవేట్ డైరీలు 1.2 కోట్లలీటర్లు అంటే సంఘటితరంగంలో రోజుకు 3.5 కోట్ల లీటర్లపాలు ( 76%) సేకరిస్తున్నారన్నమాట.
ఏపీలో అన్ని డైరీల పాలసేకరణ కలిపినా 60 లక్షల లీటర్లు ( 13%) దాటిన దాఖలాలు లెవ్వు. మిగిలిన 3.8 కోట్ల లీటర్ల పాలు ఎక్కడికి పోతున్నట్టు? రాష్ట్రరైతాంగం ఇన్నికోట్ల పాలు, పాల పదార్దములు భుజించి బలంగా ఉన్న దాఖలాలు కూడా లెవ్వు. అసంఘటిత రంగంలో ఇన్ని లీటర్ల పాల లభ్యత ఉంటే, మూడు ఏళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో కార్యక్రమాలు మొదలుపెట్టి 18-20 జిల్లాలలో విస్తరించిన అమూల్ సంస్థ పాల సేకరణ 1.6 లక్షల లీటర్లు( 3%) మించక పోవడం, అమూల్ , రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మిల్క్ కమీషనర్ ఆలోచించవలసిన విషయమే.
రాష్ట్రంలో సహకార పాలపరిశ్రమ కుంటుపడింది, ఒకప్పుడు అమూల్ కు గట్టి పోటీ ఇచ్చిన విజయ బ్రాండ్ చతికల పడింది, పాలసేకరణ 25000 లీటర్లకి పడిపోయింది. ఇలాంటి సందర్భంలో మన రాష్ట్రసహకార పాల రంగానికి చేయూత ఇస్తారని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్సుతో అమూల్ ని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి, అమూల్ సంస్థకు అనుసంధానకర్తగా వ్యవహరించి, అమూల్ కార్యక్రమాలు ఏపీలో విస్తరించడంలో నా పాత్ర కూడా ఉంది.
అమూల్ ని పిలవటంలో ముఖ్యఉద్దేశం గ్రామీణ స్థాయిలో పూర్తిగా కుంటుపడ్డ మన పాలసేకరణకేంద్రాలు బలోపేతం చేయడం, కృష్ణా , గుంటూరు, విశాఖ డైరీలు తిరిగి సహకారరంగంలోకి తీసుకువచ్చి విజయ బ్రాండ్ బలోపేతం చెయ్యడం. అమూల్ కి దక్షిణ భారతంలో ఏపీ ముఖ్యమైన హబ్ గా ప్రోత్సహించి వారి వృద్ధితో పాటు మన విజయ బ్రాండ్ కూడా పునర్వైభవం పొందేటట్టు చూడటం.
శేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. సహకారసంఘాల ఊసే లేదు. పాలసేకరణ ప్రభుత్వ కార్యక్రమంలా జరుగుతుంది. అమూల్ వచ్చింది, పాలరేట్లు పెరిగాయి, ఇప్పుడు కూడా అమూల్ 10-20% పాలరేటు ఎక్కువ ఇస్తుంది అని ప్రచార ఆర్భాటం తప్పితే గట్టిగ ఒక్క జిల్లాలో కూడా పాలసేకరణ రైతుల సంఘటితంగా జరిగిన దాఖలాలు లేవు.
ముఖ్యమంత్రి గారు ఇల్లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు, సాంప్రదాయ శాఖలు చేయలేనివి భుజాన మోస్తారనే అగ్రి మిషన్ ఏర్పాటుచేచినది. అగ్రి మిషన్ పెద్దలు కలుగచేసుకొని, పాడి రైతులకు మంచి జరగాలనే ముజేయమంత్రి గారి కోరిక నిజం చేస్తారని ఆశిద్దాం.
గురువా రెడ్డి బొంతు
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఆంధ్రప్రదేశ్ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు – ఒంగోలు జాతి పశువులు ( పార్ట్ 10)
ఇప్పటివరకు మనం ఏపీలో వ్యవసాయ, అనుభంద రంగాల్లో ఉన్న అనేక అవకాశాలగురుంచి చర్చించుకొన్నాం. ఏపీకి వీటన్నిటికీ మించిన వరం ఒంగోలు జాతి పశువులు. భారత దేశాన్ని , ముఖ్యంగా ఏపీని పశుసంపదలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో ఈ జాతి నిలిపిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది ముమ్మాటికీ నిజం. అయితే సొమ్మొకడిది, సోకొకడిది చందంగా పశుసంపద మనది, దానిని వ్యాపారపరంగా కొల్లగొట్టి లక్షల కోట్లు ఆర్జించినది మాత్రం బ్రెజిల్ దేశం.
బ్రిటిష్ పాలకులు వ్యాపారకోణంలో ఆలోచించి 1868లో కొన్ని ఒంగోలు( అప్పట్లో ఒంగోలు జిల్లా లేదు , బ్రెజిల్లో నెల్లూర్ అని ఇప్పటికి పిలుస్తారు) పశువులు తీసికెళ్ళి ఇతర దేశాలకు అమ్మి లాభాలు ఆర్జించడం జరిగింది. ఈ జాతి తిన్న తిండిని మాంసంలా మార్చుటలో అన్ని జాతులకన్నా ముందుండి బీఫ్ మార్కెట్లో గొప్ప పేరు తెచ్చుకొంది. బ్రెజిల్ పరిస్థితులు ఈ జాతికి అనుకూలంగా ఉంది అక్కడ బాగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1960లో 104 ఒంగోలు పశువులు బ్రెజిల్ కు ఎగుమతి చేయబడ్డాయి. 1000కి లోపు మనదేశం నుండి తీసుకువెళ్లిన జెర్మ్ ప్లాసం, ఒక్క బ్రెజిల్ దేశంలోనే 16.7 కోట్ల పశుసంపదగా విస్తరించి, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోకూడా గణనీయంగా విస్తరించి బ్రాహ్మిణ్ జాతిగా పిలవబడుతూ, ప్రపంచ బీఫ్ మార్కెట్లో 65% పైన మార్కెట్ షేర్ కల్గివుండటం చాలా గొప్ప విషయం,
బ్రెజిల్ లో కుత్రిమ గర్భధారణ, సెమెన్ సెక్సింగ్, ఎంబ్రయో సెక్సింగ్, పిండమార్పిడి లాంటి సాధనాలతో ఒంగోలు జాతిని అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. అధికారిక ఎగుమతులపై పరిమితులు ఉన్న నేపథ్యంలో మన దేశంనుండి ఫ్రోజెన్ సెమెన్ తస్కరించి ఒంగోలు జాతి అభివృద్ధి చేసుకొన్న సందర్భం.
ప్రపంచపటంలో ప్రముఖంగా లిఖించబడిన మన ఒంగోలు జాతి, వాటి పుట్టింట ఆలన, పాలనా, ఆధరణ, పోషణ కరువయ్యి, కుచించుకుపోయి 2.5 లక్షలలోపుకు చేరుకున్న పరిస్థితి. పశువులలో పాల ఉత్పత్తి పెంచాలి అని, ఒంగోలు అవ్వులకుకూడా ఫారిన్ జాతి సెమెన్ తో కుత్రిమ గర్భధారణ చేసి మన ఒంగోలు జాతిని నాశనం చేసికొన్న సందర్భం. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన తప్పుని గుర్తించి, బ్రీడింగ్ పాలసీ మార్చుకున్న వైనం.
అంతర్జాతీయ గుర్తింపు బ్రెజిల్ లోని ఒంగోలు జాతికి దక్కాలంటే, కొత్త బ్లడ్ లైన్ అవసరం. బ్రెజిల్లోని ఒంగోలు బ్రీడ్ ఇన్బరీడింగ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, ఏపీలోని ఫ్రెష్ బ్లడ్ లైన్ కొరకు కాచుకు కూర్చున్న సందర్భం. మధ్యలో కొద్ది కాలం పశుసంపద ఎగుమతులు, దిగుమతులు జరిగినా ప్రస్తుతం నిషేధం ఉంది అని తెలిసింది. ఈ నిషేధంవల్ల ఎక్కువ నష్టపోయేది ఒంగోలు జాతి సంపద ఎగుమతి అవకాశాలున్న ఏపీ మాత్రమే.
మంచి ఒంగోలు అవ్వుని , నాణ్యమైన ఒంగోలు ఎద్దు వీర్యం తో కుత్రిమ గర్భధారణ గావించి, పిండాలను తీసి, వాటిని ఎగుమతి చేసి కొన్ని వందలకోట్ల వ్యాపార అవకాశాలు మెండుగా ఉన్నాయి. దిగుమతి చేసుకొన్న బ్రెజిల్ లాంటి దేశాలు, ఈ పిండాలను, అధిక పాలు ఇచ్చే సంకరజాతి ఆవులలో transplant చేసి, పుట్టే దూడలకు మంచి తల్లి పాలు త్రాగే అవకాశం కల్పిస్తారు. ఎప్పుడైతే దూడ నిండుగా తల్లి పాలు త్రాగుతుందో, ఆ దూడ మంచి దృఢంగా బోన్ స్ట్రక్చర్ పెంచుకొని తిన్న మేతను బాడీ వెయిట్ గా సమర్థవంతంగా మార్చుకొని, పెంపకందారులకు మంచి లాభాలు చేకూర్చిపెడుతుంది.
అగ్రి మిషన్ లాంటి సంస్థలు , పశుసంవర్ధక శాఖ అనుసంధానంతో ఇల్లాంటి అవకాశాలు అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ పశుసంపద మార్కెట్లో ప్రపంచ పటంలో ముందుండి మన దేశం గర్వపడేలా పని చేస్తుందని ఆశిద్దాం.
గురువా రెడ్డి బొంతు
బొంతు బ్రియాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఆంధ్ర ప్రదేశ్ – ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు -వెదురుతో ఎదురీత ( పార్ట్ 11)
ఇప్పటివరకు మనం ఏపీలో ఉన్న అనేక అవకాశాలపై అవగాహన కల్పించి అగ్రి మిషన్, ఇతర సంస్థలు తక్షణ కర్తవ్యంగా చేపట్టవలచిన ఆవశ్యకత వివరించాం . అనేక అద్భుత అవకాశాలు పక్కనపెట్టి, అగ్రి మిషన్ పెద్దలు వెదురు బొంగుల వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించటం, స్టేట్ బాంబూ మిషన్ ఏర్పర్చటం, వెదురు ఉత్పత్తుల ప్రదర్శన, ప్రతి మీటింగులో, సంధర్భాలు కల్పించుకొని మరీ వెదురు మొక్కలు పంచటం , అటవీ ఉత్పత్తులనుండి వ్యవసాయరంగానికి మార్చటం లాంటివి చేయటం జరిగింది. ఈ మాత్రం శ్రద్ద మొక్కజొన్న , ఇతర రాష్ట్ర పంటలు, అనుబంధ శాఖలపై పెట్టిఉంటే ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చి మన అగ్రి మిషన్ దేశానికే ఆదర్శంగా నిలిచేది.
వెదురు అనేది అడవి మొక్క, మనం ఎంత ప్రోత్సహించిన అడవిలో పెరిగినట్టు పెరగదు. పైగా ఏ పంటతో పోల్చినా రెండు నుండి మూడు రేట్లు నీరు, అధిక వర్షపాతం వెదురు పెరగటానికి అవసరం. నీటికి కటకటలాడుతున్న పరిస్థితులలో మనలాంటి రాష్ట్రాలలో వెదురు పెంపకం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. కోతకు గురవుతున్న భూములు, అటవీప్రాంతంలో పెంచేటట్టు చూడవచ్చు.
మనం ఎంత అనుకొన్న వెదురు ఉత్పత్తుల మార్కెటింగ్ చాలా పరిమితం. బొంగులు, సాంబ్రాణి కడ్డీలకు వాడకం కొన్ని వందల ఎకరాలలో పంట సరిపోతుంది. వెదురు ఫర్నిచర్, హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకే పరిమితం. యాక్టీవ్టెడ్ కార్బైన్ గా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు .
ఇట్టి పరిస్థితులలో వెదురుని ఎక్కువ మొత్తంలో ప్రోత్సహించడం నాకు తెలిసినంతవరకు సమంజసం కాదు. నేను విన్నది, యూట్యూబ్ లో చూసిన దాని ప్రకారం కొందరు పెద్దలు, నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు రైతులు వేసిన భీమా వెరైటీ వెదురు 2 ఏళ్ళు వరుసగా డిసెంబర్ మాసంలో పువ్వు పూచి మొక్కలు చనిపోయినవని తెలిసింది. నేను విన్న దానినిబట్టి తమిళనాడు హోసూరు పట్టణం లో ఉన్న గ్రోమోర్ నర్సరీ , నేషనల్ బాంబూ మిషన్ పెద్దల సహకారంతో 40 రూపాయలకు మొక్క చొప్పున్న నాణ్యత లేని మొక్కలు విక్రయించి రైతులను నిలువెత్తునా ముంచినట్టు తెలిచింది.
పెద్దలు వేశారు, మంత్రులు వేశారు, శాసనసభ్యులు వేశారు , వారు లక్షలు సంపాదించబోతున్నారు అనుకొని చిన్న, సన్నకారు రైతులు వెదురు పంట వేసి నష్టపొయ్యే అవకాశం ఉంది. అగ్రి మిషన్ పెద్దలు , నేషనల్ బాంబూ మిషన్ పెద్దల దృష్టికి గ్రోమోర్ నర్సరీ వల్ల జరిగిన నష్టం వివరించి మోసపోయిన రైతులకు నష్టపరిహారం, ఇకముందు రైతులు నష్టపోకుండా చూడవలచిన అవసరం ఉంది.
ఇప్పటివరకు వెదురును ప్రోత్సహింసిన అగ్రి మిషన్ రైతులకు వాస్తవ పరిస్థితులు వివరించి, ఒకవేల వెదురు పండించాలంటే ఏ జాతి మొక్క ఉత్తమం, అవసరానికి తగ్గ వెరైటీ మొక్కలనే రికమండ్ చేయడం చెయ్యాలి. అగ్రి మిషన్ వారు మున్ముందుగా ఆరంభించిన వెదురు వ్యవసాయ ప్రమోషన్ పూర్తిగా ఆపటం శుభప్రదం కాదు కాబట్టి , తక్కువ మొత్తాదులో పంట, అనుభంద పరిశ్రమలు, మార్కెట్ లింకేజ్స్ చేపట్టడం మంచిది. నాకు తెలిసిన ప్రకారం స్టేట్ బాంబు మిషన్ ఏర్పడి 2 ఏళ్ళు అయినా ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇల్లాంటివి ముఖ్యంగా తప్పుడు సంకేతాలు పంపుతాయి. తక్షణమే అగ్రి మిష వారు ముందుండి బాంబు మిషన్ మీటింగ్ పెట్టించి వెదురు వ్యవసాయ వాస్తవపరిస్థితులు, చేయవలసిన పనులు వివరించి ముందుకు నడిపించాలి.
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (బీబీసీ*)
ఆంధ్రప్రదేశ్- ప్రాథమిక రంగంలో అద్భుత అవకాశాలు – ముగింపు వాక్యాలు ( పార్ట్ 12)
వెదురుతోసహా అనేక పంటలు, ఇతర ప్రాథమికరంగంలో ఉన్న వినూత్న అవకాశాలగురుంచి మాట్లాడుకొన్నాం. సాంప్రదాయ శాఖలు వినూత్న ఆలోచనలు ఆచరణలో పెట్టలేవని ముందే ఉహించుకొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారే అధ్యక్షులుగా, పార్టీ రైతు విభాగం అధ్యక్షులు, స్వయంగా రైతు అయిన నాగి రెడ్డి గారిని కార్యనిర్వాహక అద్యక్షులుగా అగ్రి మిషన్ ఏర్పాటు చేసి గురుతర భాద్యతలు అప్పచెప్పటం జరిగింది.
నాకు తెలిసినంతవరకు, సంబంధిత శాఖలు ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీస్ విషయాలు , బడ్జెట్ సంబంధిత విషయాలు, మంత్రి గారు, సెక్రటరీ సంబంధిత ఎస్టాబ్లిషమెంట్ లాంటి పనుల ఒత్తిడి, కోర్టు వ్యవహారాలు, రాజకీయవత్తిడులు లాంటి వాటితో పీకలోతుకు కూరుకుపోయి, కొత్త ఆలోచనలు, ముందుచూపుతో పనిచేయటం, సాంకేతిక నిపుణతతో అభివృద్ధి చెయ్యటం లాంటి విషయాలపైన ద్రుష్టి పెట్టిన సందర్భాలు అరుదు. అగ్రి మిషన్ లాంటివి ఆరంభిన ముఖ్య ఉద్దేశం కొత్త ఆలోచనలు చేసి సంబంధిత శాఖలను ఉత్తేజపరిచి సవాళ్లు ఎదురుకొనే విధంగా తయారుచేస్తారని మరియు వినూత్న ఆలోచనలు ఆచరణలోకి తీసుకువస్తారని.
అగ్రి మిషన్ పైన పేర్కొన్న విషయాలు ముందుకు తీసువెళ్ళటానికి పెద్ద బడ్జెట్ కూడా అవసరం లేదు. అగ్రి మిషన్, ఏపీలో ప్రాథమిక రంగంలో ఉన్న అతిముఖ్యమైన అవకాశాలను గుర్తించిన, ఆచరణ ప్రణాళిక తయారుచేసుకొని, మంచి విషయ జ్ఞానం, పని చేయాలి అనే తపన,ఏదో సాదించాలిఅన్న కసి ఉన్న వారిని సంప్రదాయశాఖలు, ఇతర సంస్థలలో ఎక్కడున్నా వెతికి పట్టుకొని, తెచ్చుకొని మంచి పని వాతావరం కల్పించి, ముఖ్యంగా మంచి నాయకత్వం చూపించి ముందుకు దూసుకుపోవటమే.
పైన పేర్కొన్న అనేక విషయాలు అగ్రి మిషన్ వారు పెద్ద మనస్సుతో స్వీకరించి, లోతుగా చర్చించి ఆచరణలోకి తీసుకువచ్చి మన యువముఖ్యమంత్రిగారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే విధంగా పని చేస్తారని ఆశిద్దాం. ఈ ప్రక్రియలో నా సహాయ సహకారాలు అవసరం అనుకొం టే, సంపూర్ణ సహకారంతో అందించడానికి నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సిద్దమే.
సమాప్తం
బొంతు గురువా రెడ్డి
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ(బీబీసీ*)