అమరావతి
స్నేహపూర్వక పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం
2 రోజుల పాటు ముంబయిలో జరిగిన 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్-2025లో పలువురు ఇన్వెస్టర్లతో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర పరిశ్రమను, పర్యాటకాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇన్వెస్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట
చలనచిత్ర నిర్మాణం, పర్యాటక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలపై ఇన్వెస్టర్లకు స్పష్టత
ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పెట్టుబడులకు ఆహ్వానం పలికిన మంత్రి దుర్గేష్
రాష్ట్రంలో సాహస, ఆధ్యాత్మిక, తీరప్రాంత , ఫిల్మ్ టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నామని వివరణ
ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ ముంబయి పర్యటన
అమరావతి: డిసెంబర్ 1,2 తేదీల్లో ముంబయిలో జరిగిన ప్రతిష్టాత్మక 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025 వేదికగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర, పర్యాటక రంగాలను కీలక సాధనాలుగా వినియోగించుకోవాలని రెండో రోజు మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట తమదైన శైలిలో ఇన్వెస్టర్లకు దిశానిర్దేశం చేసి పెట్టుబడులను ఆహ్వానించారు.
తీర ప్రాంతాల నుండి సినీ కారిడార్ల వరకు సంబంధించిన అన్ని రంగాలలో భారతదేశ పర్యాటక, సృజనాత్మక ఆర్థికవ్యవస్థలో కొత్త మార్గాన్ని నిర్దేశించిన ఈ సమ్మిట్ లో ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పెట్టుబడిదారులకు స్నేహపూర్వక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా చలనచిత్ర నిర్మాణం, పర్యాటక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలపై ఇన్వెస్టర్లకు స్పష్టతనిచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే స్వర్ణాంధ్ర విజన్ @2047 ను పంచుకున్నారు. ఈ ప్రణాళికలో కీలకమైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ,డీప్ టెక్నాలజీల పాత్రను వివరించారు.
ఏపీ టూరిజం కొత్త పాలసీ 2024–29 ద్వారా ఇన్వెస్టర్లకు అందించే ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రత్యేకంగా అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్లతో భేటీ అయి వివరించారు. రాష్ట్రంలో సాహస, ఆధ్యాత్మిక, తీరప్రాంత , ఫిల్మ్ టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడానికి విశాఖపట్నం, తిరుపతి, గండికోట, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, అరకు లోయలను యాంకర్ హబ్‌లుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను వివరించారు.యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ రంగాలలో గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి, ఏఐ, ఎక్స్ ఆర్ టెక్నాలజీలు మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టి ఆంధ్రప్రదేశ్‌ను సృజనాత్మక పరిశ్రమల కోసం “ఆంధ్ర వ్యాలీ”గా మారుస్తామని ప్రకటించారు. అదే విధంగా సినిమా షూటింగ్‌ల కోసం అనుమతులను సులభతరం చేసే లక్ష్యంతో కొత్త “సమగ్ర కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ” ని త్వరలో తీసుకురానున్నామని, ఈ క్రమంలో సినిమా రంగ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి సహకరించాలని కోరారు.
రెండో రోజు సమ్మిట్ లో భాగంగా కూ, బుక్ మై షో ప్రతినిధులు అనిల్ మఖిజా, చిరాగ్ సరైయా, 91 ఫిల్మ్ స్టూడియోస్ వ్యవస్థాపకులు నవీన్ చంద్ర, గగన్ విహార్ స్పేస్ సిటీ మరియు స్పేస్ ఎగ్జిబిషన్ ఫౌండర్ శ్రీకాంత్ కోడెబోయిన, యూఎస్ఏ కు చెందిన బ్లూ ఐ సాఫ్ట్ కార్ప్ మరియు బీఈఎస్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో, డెల్లా రిసార్ట్స్, డెల్లా అడ్వెంచర్ పార్క్ (ఎంఓయూ భాగస్వామి) ఫౌండర్ జిమ్మి మిస్ట్రీ, ఐలైన్ స్టూడియోస్ డైరెక్టర్ డి. రాకేష్ లతో మంత్రి కందుల దుర్గేష్, ఎండీ ఆమ్రపాలి కాట ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. అదే విధంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవి కొట్టార్కర్ సినిమా రంగానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురూ సుదీర్ఘంగా సినిమా రంగం అభివృద్ధిపై చర్చించారు.అనంతరం త్వరలోనే విజయవాడ వచ్చి కలుస్తామని తెలుపగా మంత్రి దుర్గేష్ ఆయనను ఆహ్వానించారు. రెండు రోజుల సమ్మిట్ లో పలువురు ప్రతినిధులు ఏపీలో స్టూడియోల నిర్మాణం చేపట్టాలని ఆసక్తి చూపారని, ప్రత్యేకించి వైజాగ్ లో డిజిటల్ స్టూడియో ల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిపారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సినిమా రంగ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజుల ముంబయి పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి బయలుదేరారు.
















































