తిరుమల గాలి గోపురం వద్ద చిరుత సంచారం
తిరుపతి లడ్డూకు 300 ఏళ్ల చరిత్ర
తాజాగా నడకమార్గంలో గాలి గోపురం వద్ద తెల్లవారు జామున చిరుత సంచారం సీసీ కెమేరాల్లో రికార్డు అయింది. రాత్రి జూ పార్క్ మార్గంలో సంచరించిన చిరుత.. ఆపై మెట్ల మార్గంలో కనిపించటంతో తాజాగా అటవీ శాఖ అధికారులు వెంటనే టీటీడీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో, తిరుమలలో నడకమార్గంలో వచ్చే భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరిక జారీ చేసింది. తిరుమల నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తిరుపతి జూ పార్క్ రోడ్ లో చిరుత సంచారం గుర్తించారు. అలిపిరి కాలిబాట మార్గంలో గాలి గోపురం వద్ద చిరుత సంచరించినట్లు సీసీ కెమేరాల్లో కనిపించ టంతో ఈ రెండు ప్రాంతాల్లో గుర్తించిన చిరుతలు ఒక్కటేనా.. వేర్వేరా అనేది అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. కాలి నడక మార్గంలో గతంలో ఒక బాలుడు గాడ పడటం.. ఒక బాలిక ప్రాణాలు కోల్పోవటంతో టీటీడీ అప్పటి నుంచి చిరుతల సంచారం పైన ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకే 12 ఏళ్ల లోపు పిల్లలను నడక మార్గంలో అనుమతించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం అనంతరం భక్తులు గుంపులుగా నడక మార్గంలో వెళ్లాలని స్పష్టం చేసారు. తిరుమల ఘాట్ రోడ్డులో వన్య మృగాల కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసారు.
శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి కాలిబాట, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారం కలవర పెడుతోంది. కాగా, టీటీడీ మాత్రం భక్తుల కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకొని శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తారు. దర్శనం అనంతరం శ్రీవారి లడ్డూకు భక్తులు ప్రాధాన్యం ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది.
తిరుపతి లడ్డూకు 300 ఏళ్ల చరిత్ర
తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. 2010 వరకూ రోజుకు లక్ష వరకూ లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3.20 లక్షల లడ్డూలు తయారుచేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో జీఐ గుర్తింపు కూడా లభించడం విశేషం. తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉంది.
లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తోంది. క్రీ. శ 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం.. కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు మరికొంత మంది పండితులు చెప్తున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు వందేళ్లలోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.
తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు పాండ్య రాజులు, 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు తెలియచేస్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి.. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
టీటీడీ పాలకమండలి 1933లో ఏర్పాటైంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి టీటీడీదే. 1 వెయ్యి 925 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. వాటికన్ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ టీటీడీ. 1830ల నాటికే తిరుమల ఆలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్టిండియా కంపెనీకి ఏడాదికి 1లక్ష రూపాయలు చెల్లించేవారు. స్వామి వారి ఆభరణాల నిర్వహణ కోసం బొక్కసం సెల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం టీటీడీ 19 రికార్డులను నిర్వహిస్తోంది.
తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో… కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు లేదా ఈవో గా మార్చింది. అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిని నియమించారు. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు.
టీటీడీ పాలక మండలి ఏర్పాటైన తర్వాత 8 దశాబ్దాల్లో తిరుమల ఆధునిక సౌకర్యాలతో సర్వతోముఖాభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడంతో ప్రారంభమై నేటికి అనేక సౌకర్యాలను భక్తులకు కల్పించింది. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో మెట్లమార్గం, ఘాట్ రోడ్ ను నిర్మించిన ఘనత ప్రధమ EO చెలికాని అన్నారావుదే. 1944 ఏప్రిల్ 10 నాటికి మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది. ఘాట్‌రోడ్డు పుణ్యమాని 1956 నాటికి భక్తుల సంఖ్య 500 కి చేరుకుంది. దీంతో శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు నిర్మాణం. 1978 నాటికి రెండో ఘాట్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి. 1978 – 82 లో కార్యనిర్వహణాధికారి PVRK ప్రసాద్ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేయడంతోపాటు తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించి.. మాడవీధులను విస్తరించడం..అన్నదాన భవన నిర్మాణం అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్ ప్రాజెక్టులను నెలకొల్పడం వంటివి చేశారు.
NTరామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత 1983లో తిరుమల-తిరుపతికి మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. ఆయన హయాంలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు.తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు. కాలినడకమార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు.తిరుమలకు తెలుగు గంగ నీటిని తరలించారు. కొండమీద విద్యుత్తుకోత లేకుండా నిర్ణయం తీసుకున్నారు.టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్ నిర్మించారు.ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్,శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,మహాతి సభా మందిరాలను నిర్మించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా 1995లో దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. 1999 – 2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం ‘సుదర్శనం కంకణాల’ విధానానిన్నిఅమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానంతో భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అవసరం తప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీవారి కోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను టీటీడీ ప్రారంభించింది. అదే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్. ఈ ఛానెల్ ద్వారా 2008 జూన్ నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాయి. శ్రీనివాసుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఆయన భక్తులపై ఉంటాయని హిందువుల విశ్వాసం.