మచిలీపట్నం, జనవరి 9:—
పేద ప్రజల అభివృద్ధితోనే దేశ పురోభివృద్ధి సాధిస్తుందని వారికి కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడానికే వికసిత భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని, 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత భారత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాలు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీపాద యశోనాయక్ పేర్కొన్నారు
మంగళవారం గుడివాడ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన గుడ్లవల్లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో వికసితభారత్ సంకల్పయాత్ర కార్యక్రమం జిల్లా పంచాయతీ అధికారి కార్యక్రమం నోడల్ అధికారి నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
తొలుత కేంద్ర మంత్రివర్యులు ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ, తపాలా, వ్యవసాయ, స్త్రీ శిశు సంక్షేమ స్వమిత్వ, ఉజ్వల యోజన మై భారత వాలంటీర్ నమోదు ప్రదర్శనశాలలు సందర్శించారు.
అనంతరం వందేమాతరం గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన గావించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
దేశ ప్రగతి పేద ప్రజల అభ్యున్నతి ద్వారానే సాధ్యపడుతుందన్నారు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు
సంక్షేమ పథకాలు గ్రామాల్లో పేద ప్రజలు అందరికీ తెలియజేసి వాటి లబ్ధి పొందేలా చేయడానికి భారత్ సంకల్ప యాత్రను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
పేదవారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ అందించడానికి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు
ప్రస్తుతం మన దేశం ఆర్థిక అభివృద్ధిలో 5 వ స్థానంలో ఉందని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు
జలజీవన్ మిషన్లో సర్పంచు నూరు శాతం ఫలితాలు సాధించి పథకాన్ని పూర్తిచేసిన విధంగానే దేశాన్ని కూడా క్రాంతిపథంలో నిలబెట్టేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.
వంటింటి పొగ నుంచి మహిళలకు విముక్తి కలిగించాలని ఉద్దేశంతో 10 కోట్లకు పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు
మహిళల గౌరవానికి రక్షణ కల్పించేందుకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు
ప్రధానమంత్రి మహిళా వందనం పథకం కింద ప్రసూతి సెలవులు 26 వారాలకు పెంచడం జరిగిందన్నారు
జనాభాలో 50% పైగా మహిళలు ఉన్న దృష్ట్యా మహిళల పురోగతి ద్వారా దేశ పురోగతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు వారికే కేటాయించామన్నారు
విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కొత్తగా 19 విశ్వవిద్యాలయాలు 7 ట్రిపుల్ ఐటీలు నిర్మాణం మొదలైందన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు
సంకల్ప యాత్ర జిల్లా ప్రభారి(ఇంచార్జ్) కేంద్ర ఐఏఎస్ అధికారి ఎం రామచంద్రుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం మేరకు 2047 సంవత్సరం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి అందరూ సంకల్పంతో ముందడుగు వేయాలన్నారు
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న అనేక పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలన్నదే సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.
అంతేకాకుండా గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా ఎవరికైనా పొందకుంటే వారికి లబ్ధి చేకూరేలా చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు
ఇందుకోసం ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు అవి వారు పొందేలా చేయడం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని తెలియజేయడం జరుగుతుందన్నారు.
గుడివాడ ఆర్డిఓ పద్మావతి స్వాగతోపన్యాసం చేస్తూ జిల్లాలో 491 గ్రామపంచాయతీలకు గాను 358 గ్రామపంచాయతీలలో వికసిత భారత సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. జనవరి 26వ తేదీ లోగా మిగిలిన 133 గ్రామపంచాయతీలో యాత్రను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ 17 ప్రతిష్టాత్మక పథకాల కింద లబ్ధిదారుల వివరాలను తెలియజేశారు
అంతకు మునుపు చిన్నారి ద్విగ్నీష దశావతారం కూచిపూడి నృత్యం, కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్తినులు ప్రదర్శించిన కోలాటం నృత్యం ఆహుతులను ఎంతగానో అలరించాయి.
గుడ్లవల్లేరు ఏఎన్ఎం వి ఆర్ ఎస్సార్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థినులు భూతాపాన్ని తగ్గించాలని, పర్యావరణ పరిరక్షించాలని తెలియజేసే భూమాత ప్రదర్శన అందరిని ఆలోచింపజేసింది.
జల జీవన్ మిషన్లో నూరు శాతం ఫలితాలు సాధించి ఇంటింటికి కులాయి ఏర్పాటు చేసిన గుడ్లవల్లేరు సర్పంచ్ వర్ణాల లక్ష్మణరావు, యోగా శిక్షకులు సుధారాణి, రోప్ స్కిప్పింగ్ జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపిన
ఉమామహేశ్వరులను మంత్రి ఘనంగా సత్కరించారు.
పి ఎం ఏ వై, పి ఎం పోషణ అభియాన్, పిఎం కిసాన్, జలజీవన్ మిషన్ పథకాల కింద లబ్ధి పొందిన నక్క రహిమునిస సిహెచ్ యామిని సొంటి వీర వెంకటేశ్వరరావు అప్పినీడు రామాంజనేయులు
తమకు ఆ పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో వివరించారు
ఈ కార్యక్రమంలో డియంహెచ్ఓ డా. గీత బాయి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. సతీష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి డి ఎల్ డి వో లు సుబ్బారావు నాంచారావు ఎంపీపీ శ్రీనివాసరావు ఎంపీటీసీ పూర్ణ కవిత శీలం రాధాకృష్ణ వేణి పలువురు ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.