అద్భుతంగా ప్రభుత్వాస్పత్రులు
11 టీచింగ్ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.3820 కోట్లు ఖర్చు
గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి రూ.500 కోట్లు
సీఐఐ సామాజిక బాధ్యత అభినందనీయం
కాన్పుల వార్డు అభివృద్ధితో గర్భిణులకు ఎంతో మేలు
ప్రభుత్వానికి మరింతగా సహకరించాలని సూచన
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
మంత్రి చొరవతో గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి ముందుకు వచ్చిన సీఐఐ ఫౌండేషన్ ఆస్పత్రిలోని కాన్పులవార్డు అభివృద్ధికి ఎంవోయూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర కార్యాలయంలో మంగళవారం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి వార్డు అభివృద్ధికి ఎంవోయూ కుదర్చుకున్నారు. ప్రభుత్వానికి, సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, భారతీయ పరిశ్రమల సమాఖ్య) కి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సీఐఐ ఫౌండేషన్ ఏపీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, ఇతర సభ్యులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి కాన్పుల వార్డు అభివృద్ధికి సీఐఐ ఫౌండేషన్‌ను సహకరించాలని కోరిన వెంటనే వారు ముందుకు వచ్చారని, అందుకు అభినందనలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి కాన్పుల వార్డుకు సంబంధించి ప్రతి రోజూ సగటున 350 వరకు ఓపీలు ఉంటున్నాయని తెలిపారు. రోజుకు సగటున 35 కాన్పులు అవుతున్నాయని చెప్పారు. 300 మంది ఎప్పుడూ ఇన్ పేషెంట్లు ఉంటున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున గర్భిణులకు గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్య సేవలు అందజేస్తోందని చెప్పారు. ఒక్క గుంటూరు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఆస్పత్రుల అభివృద్ధికి ఏకంగా రూ.3820 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
కాన్పుల వార్డు పూర్తిస్థాయిలో ఆధునికీకరణ
మంత్రి మాట్లాడుతూ సీఐఐ ఫౌండేషన్ తో ఎంవోయూ కుదుర్చుకున్న ఫలితంగా గుంటూరు జీజీహెచ్లో ప్రసూతి వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం రూ.68 లక్షల నిధులను సీఐఐ ఫౌండేషన్ సీఎస్ ఆర్ నిధుల కింద ఇస్తున్నట్లు తెలిపారు. ప్రసూతి వార్డులో నూతన బెడ్ల ఏర్పాటు, అన్ని వసతుల ఏర్పాటు లాంటి చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీలను సమకూర్చుతున్నట్లు చెప్పారు. ప్రసూతి వార్డులోని సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇచ్చి మరింత మెరుగ్గా గర్భిణులకు వైద్యసేవలు అందజేస్తామని వివరించారు. కావాల్సిన వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బాలింతలు సౌకర్యవంతంగా వైద్య సేవలు పొందేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎంవోయూ కాపీలను పరస్పరం మార్చుకున్నారు. కార్యక్రమంలో డీఎంఈ నరసింహం తదితరులు పాల్గొన్నారు.