తేది: 01.04.2026
అమరావతి/న్యూఢిల్లీ
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి కీలక అడుగులు
నేడు ఢిల్లీకి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్..రేపు కేంద్ర పర్యాటక,సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ
పెండింగ్ లో ఉన్న కీలక పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టుల ఆమోదానికి విజ్ఞప్తి.. రూ. 900 కోట్లకు పైగా విలువైన 9 కొత్త ప్రతిపాదనలపై డీపీఆర్ ల సమర్పణ
ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ఆధ్యాత్మిక, ఐకానిక్ కేంద్రాల అభివృద్ధికి మంత్రి దుర్గేష్ కసరత్తు
సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ఏపీని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా మార్చేందుకు మంత్రి కందుల దుర్గేష్ కృషి
తెలుగు భాషా వైభవానికి గుర్తింపుకు చర్యలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు’సూర్యరాయాంధ్ర నిఘంటువు’ పునర్ముద్రణపై కీలక చర్చలు
అమరావతి/న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం వేళ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ నేడు హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయి పెండింగ్ లో ఉన్న కీలక పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టుల ఆమోదానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక సర్క్యూట్‌ల బలోపేతం కోసం మొత్తం రూ. 915 కోట్ల విలువైన 9 కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనున్నారు.
పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కృషి:
గతంలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన కృషి ఫలితంగా శాస్కి, ప్రసాద్, స్వదేశీ దర్శన్, సిబిడిడి వంటి పథకాల కింద రాష్ట్రానికి ఇప్పటికే 8 పర్యాటక ప్రాజెక్టుల రూపంలో రూ. 430 కోట్లు కేంద్రం ద్వారా కేటాయించబడ్డాయి. ప్రస్తుతం పట్టాలెక్కిన ఈ పనుల పురోగతిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి వివరించడంతో పాటు, నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి దుర్గేష్ కోరనున్నారు.
నూతన ప్రతిపాదనలు – రూ. 915 కోట్ల అంచనాలు:
ఇప్పటికే కీలకమైన పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టుల ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన మంత్రి దుర్గేష్ ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్ లు సమర్పించిన ప్రాజెక్టులన్నింటినీ మంజూరు చేయాలని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధానంగా మచిలీపట్నంలో వైబ్రెంట్ బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కు స్వదేశ్ దర్శన్ 2.0 కింద రూ.120.04 కోట్లు, ప్రసాద్ స్కీమ్ క్రింద రూ. 95.18 కోట్లతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, రూ.213.72 కోట్లతో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం, రూ.48.95 కోట్లతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని శ్రీ గృహ మల్లేశ్వర స్వామి ఆలయం,రూ.36 కోట్లతో కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రూ.120 కోట్లతో వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలకి నిధులు కోరనున్నారు. అదే విధంగా రూ.103.05 కోట్లతో లేపాక్షిలో పర్యాటక సౌకర్యాలు,సాంస్కృతిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి, రూ.99.87 కోట్లతో లంబసింగిలో పర్యాటక అనుభూతిని మెరుగుపరిచే అభివృద్ధి పనులు, ఏపీలోని ప్రధాన బౌద్ధ క్షేత్రాల వద్ద టెంట్ సిటీల అభివృద్ధికి రూ.77.32 కోట్ల నిధులకు విజ్ఞప్తి చేయనున్నారు. దేశంలోని 50 ప్రపంచ స్థాయి పోటీ పర్యాటక కేంద్రాల అభివృద్ధి మిషన్‌లో భాగంగా తిరుపతి, విశాఖపట్నంలను చేర్చాలని కోరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాసిన లేఖను కూడా ప్రస్తావిస్తూ, అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించనున్నారు.
అదే విధంగా అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ (NIH) ఏర్పాటుకు మంత్రి దుర్గేష్ మద్దతు కోరనున్నారు. శీలాభీడే కమిటీ సిఫార్సు మేరకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్, ఇంటర్ ప్రిటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (పర్యాటక భవన్) ఏర్పాటుకు రూ.100 కోట్ల ఆర్థిక సహాయాన్ని కోరనున్నారు. ఇప్పటికే స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద మంజూరైన బొర్రా గుహలు, సూర్యలంక, నాగార్జున సాగర్, అహోబిలం, ప్రసాద్ పథకం క్రింద అన్నవరం మరియు సింహాచలం పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి త్వరితగతిన నిధుల విడుదలకు చర్యలు తీసుకోనున్నారు.
1936-1974 మధ్య ఎనిమిది సంపుటాలుగా వెలువడిన ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుగు భాషా చరిత్రలో ఒక అద్భుతమైన గ్రంథమని, ఇందులో 1.1 లక్షలకు పైగా పదాలు ఉన్నాయని, పాత కాలపు ముద్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం ఇది చదువరులకు కష్టంగా మారిందని మంత్రి దుర్గేష్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆధునిక సాంకేతికతతో, కొత్త ఫాంట్లతో ‘సూర్యరాయ నిఘంటువు’ పునర్ముద్రణపై కీలక చర్చలు జరిపి కేంద్ర నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం వచ్చినప్పటికీ కార్యరూపం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
అదే విధంగా 6 సాంస్కృతిక ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల మంజూరుపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మంత్రి దుర్గేష్ అభ్యర్థించనున్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వారసత్వ అభివృద్ధికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలుపనున్నారు.
రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ఏర్పాటుకు చర్యలు ముమ్మరం:
ఆంధ్రప్రదేశ్ పద్య నాటకం, సురభి థియేటర్, వీధి నాటకం వంటి గొప్ప రంగస్థల కళలకు నిలయమని, జాతీయ స్థాయిలో గుర్తిం,సరైన శిక్షణ సంస్థలు లేక ఈ కళలు సవాళ్లను ఎదుర్కుంటున్నాయని వివరించి రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు నాటకరంగానికి పునర్జీవం పోయవచ్చని మంత్రి దుర్గేష్ మరోసారి కేంద్రాన్ని అభ్యర్థించనున్నారు. ఇప్పటికే కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎన్ ఎస్ డీ అధికారులు రాజమండ్రిలో స్థల పరిశీలన పూర్తి చేశారని, ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటంతో త్వరగా ఆమోదించాలని కోరనున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ఏర్పాటుకు కృషి:
కూచిపూడి నృత్యం, గొప్ప చారిత్రక సాహిత్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ బ్రాంచ్ ఏర్పాటు అత్యవసరమని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ కేంద్రానికి తెలపనున్నారు. అందుకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తద్వారా రాష్ట్ర కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం లభిస్తుందని వివరించనున్నారు. 16 విశ్వవిద్యాలయాలు, 100 ఇంజనీరింగ్ కళాశాలలు, 12 వైద్య కళాశాలలతో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు విద్యా మార్పిడికి కేంద్రంగా ఉందని రాష్ట్ర వైభవాన్ని తెలపనున్నారు.
విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు
విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా లలిత కళలను ప్రోత్సహించడంతో పాటు నూతన కళాకారులకు సరైన వేదికను అందించవచ్చనే ఉద్దేశంతో అవసరమైన కేంద్ర నిధులను మంజూరు చేయాలని మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరనున్నారు.
విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో ‘కళాక్షేత్ర’ ఆడిటోరియం నిర్మాణం:
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సంగీత, నృత్య ఉత్సవాలు నిర్వహించడానికి తగిన స్థాయి ఆడిటోరియం అందుబాటులో లేదని,ఈ క్రమంలో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు (GVR) సంగీత మరియు నృత్య కళాశాలలో ‘కళాక్షేత్ర’ ఆడిటోరియం నిర్మిస్తే, అది కళాకారులకు మరియు విద్యార్థులకు గొప్ప వేదికగా మారుతుందని కేంద్రానికి విన్నవించనున్నారు.
సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం:
యోగి వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు వంటి మహామహులైన కవుల వారసత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడానికి సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఎంతగానో తోడ్పడుతుందని, దీని ఏర్పాటు ద్వారా కవులకు, రచయితలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందని కేంద్రానికి వెల్లడించనున్నారు.
భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉమ్మడి లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ఈ ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు ఇవ్వాలని మంత్రి దుర్గేష్ హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల బలోపేతం, రవాణా సౌకర్యాల మెరుగుదల, పర్యాటకుల అనుభూతిని పెంపొందించడంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ మేరకు ఏపీని పర్యాటక హబ్‌గా మార్చేందుకు మంత్రి దుర్గేష్ కసరత్తు చేస్తున్నారు. కొత్త పర్యాటకప్రాజెక్టులకు ఆమోదం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత పర్యాటకాభివృద్ధి చెందే అవకాశం ఉందని, తద్వారా పర్యాటకుల రాక పెరగడమే కాకుండా, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉన్నాము. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో రాష్ట్ర పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పన మా ప్రాధాన్యత.” అని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి దుర్గేష్ మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి “అనుకూల పవనాలు” తీసుకువస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్ హస్తిన పర్యటన సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం..











































