- రాబోయే రోజుల్లో ఏఐ వినియోగం
హెల్త్ డేటాతో అనుసంధానం
డిజిటలైజేషన్ లో ఏపీ ముందంజ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడి - జాతీయ స్థాయిలో ఏఐ స్ట్రాటజీపై దక్షిణాది సదస్సు
- పాల్గొన్న 6 రాష్ట్రాల ఆరోగ్య, ఐటీ శాఖల అధికారులు
Amaravati/Vijayawada:
వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్న హెల్త్ డేటా ఆధారంగా కృత్రిమ మేధ (Artificial Intelligence)ను అనుసంధానం చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. తద్వారా ప్రజలు, రోగులకు ప్రివెంటివ్ కేర్, ప్రిడిక్టెవ్ ఎనాలిస్, ఆయా ప్రాంతాల్లో రోగాల తీవ్రతను అంచనా వేసేందుకు, వైద్య సేవలు మెరుగుపరచడం సులువు అవుతుందని తెలిపారు. విజయవాడలో సోమవారం రీజినల్ మల్టీ స్టేక్ హోల్డర్స్ కన్వర్జన్స్ వర్క్ షాప్ అన్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్ (ఎన్ఎఐఎస్ హెచ్) అంశంపై ఒకరోజు కార్యశాల జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్ ఘడ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి వైద్య ఆరోగ్య, ఐటీ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కార్యశాలలో చర్చించిన వివరాలను వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరరావు, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గిరిశా, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, ఆర్టీజీఎస్ అడిషనల్ సీఈఓ శౌర్యమన్ పటేల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఫిబ్రవరిలో జాతీయ స్థాయిలో ఏఐపై ముసాయిదా ఖరారు
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్య సేవల్లో డిజిటలైజేషన్ (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, హెల్త్ రికార్డ్సు)లో తీసుకున్న చర్యలవల్ల ఏపీ ముందంజలో ఉందన్నారు. అలాగే సీఎం శ్రీ చంద్రబాబు సంకల్పం మేరకు ఎమర్జింగ్ టెక్నాలజీ (ఏఐ/ఎంఎల్/ఎల్ఎల్ఎం)లో ఏపీ ముందు ఉండాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ తరఫున తాము అవసరమైన చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏఐ వినియోగంలో జాతీయ స్థాయిలో ఓ ముసాయిదా (డ్రాఫ్ట్)ను తయారు చేసేందుకు దేశ వ్యాప్తంగా జోనల్ స్థాయిల్లో కార్యశాలలు (సదస్సులు) నిర్వహిస్తుందని తెలిపారు ఈ క్రమంలోనే విజయవాడలో కార్యశాలను నిర్వహించామని చెప్పారు. ఇక్కడ చర్చించిన అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా డ్రాఫ్ట్ ఖరారు అవుతుందని తెలిపారు. దీనికిముందుగా ముంబయి, ఢిల్లీ, నార్త్ ఈస్ట్ లలో జోనల్ స్థాయి సదస్సులో జరుగుతాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసే డ్రాఫ్ట్ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలో విడిగా ఆరోగ్య రంగంలో ఏఐ అమలు వ్యూహాన్ని ఖరారు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న డేటా ఆధారిత సేవలను కూడా కేంద్రం పరిగణనలోనికి తీసుకుని జాతీయ స్థాయిలో ఏఐ వినియోగం ఎలా ఉండాలన్న దానిపై ముసాయిదా తయారు అవుతుందని తెలిపారు |
వాట్సప్ గవర్నెస్ అనుసంధానం
ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి, జనరేట్ చేసుకోవడంపై ‘మనమిత్ర’ (వాట్సప్ గవర్నెస్) లో అనుసంధానం చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగించి కంటిన్యూస్ కేర్ ‘సంజీవిని’ ద్వారా ప్రజలు, రోగులకు సేవలు అందించబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంజీవిని కింద రోగులకు కుప్పం నియోజకవర్గంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుప్పంలో అవుట్ బౌండ్ కాల్ సెంటర్ ద్వారా రోగులకు నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి, వైద్యులను ఎక్కడ కలవాలన్న దానిపై వ్యక్తిగతంగా సంజీవిని ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీఐహెచ్ (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్)లో హెల్త్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2025 ద్వారా టెక్నాలజీని వివిధ పద్ధతుల్లో అవసరమైనచోట్ల వినియోగించేందుకు 297 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. వీటిని పరిశీలిస్తున్నామన్నారు.
డెత్ అలర్ట్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాల సేకరణ
తురకపాలెంలో మెలియోడయోసిస్ వ్యాప్తి, జరిగిన మరణాలపై జిల్లా స్థాయిలో సమాచారం ఉన్నా రాష్ట్ర స్థాయికి చేరుకోవడంలో జరిగిన జాప్యం పునరావృతం కాకుండా ఉండేందుకు ఆన్లైన్లో ‘డెత్ అలర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసుల గుర్తింపునకు ఆర్టీజీఎస్ ‘అవేర్ తో అనుసంధానంచేస్తూ డిసీజ్ సర్వైలెన్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ద్వారా అవసరమైన చర్యలు, ఈ వ్యాధి మూలాలు తెలుసుకునేందుకు వైద్యరంగ నిపుణులతో చర్చించామని పేర్కొన్నారు. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం ద్వారా మూలాలపై పూర్తి సమాచారం వెలుగులోనికి వస్తుందని తెలిపారు.
ఆరోగ్య సేవలో ఏఐ వినియోగంపై సదస్సులో వివరించిర కార్తీక్ అడపా
డబ్ల్యూహెచ్ రీజినల్ అడ్వయిజర్ కార్తీక్ అడపా ఐఎఎస్ సదస్సులో మాట్లాడుతూ ఆరోగ్య సేవల్లో ఏఐను అనుసంధానం చేస్తే జరగబోయే సానుకూల పరిణామాల గురించి సభికులకు వివరించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. భవిష్యత్తు మొత్తం ఏఐదేనని పేర్కొన్నారు.
వ్యాధుల భారం తగ్గించేందుకు ఉన్నతస్థాయి కమిటీతో తొలిభేటీ
రాష్ట్రంలో గుర్తించిన 10 క్యాన్సర్, బీపీ, బ్రెయిన్, గుండె, ఇతర ప్రధాన వ్యాధుల భారం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అంతర్జాతీయ స్తాయిలో నిపుణులతో చర్చిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో సీఎం శ్రీ చంద్రబాబు నేతృత్వంలో మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం జరగబోతుందని పేర్కొన్నారు.















































