విద్యార్థులను దేశానికి పనికొచ్చే శక్తులుగా తయారు చేయాలి
• తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం అవసరం
• కేరళ తరహా విద్యావిధానం అమలు అవసరం
• రాష్ట్ర ఐ.టి., మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చొరవతో చేపట్టిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తాయి
• జెన్ జీ కాలంలో విభిన్న రంగాల్లో సృజన అందరికీ అవసరం
• పుస్తకాలు చదవడం మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది… గ్రూప్ లైబ్రరీలు ఏర్పాటు కావాలి
• గంజాయి, మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని కలిసికట్టుగా నిర్మిద్దాం
• చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన మెగా టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సుహృద్భావ సంబంధాలుండాలి. వారి మధ్య ఎంతటి మంచి వాతావరణం ఉంటే పిల్లల్లోనూ అట్లాంటి పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. మీ వ్యక్తిత్వం లేదా చదువు విషయాల్లో గురువులు ఒక దెబ్బ వేస్తే దాన్ని సీరియస్ గా తీసుకోవల్సిన అవసరం లేదు. అవి మనం ఆకాశమంత ఎదిగిన తర్వాత గురువు ఆశీర్వాదాలుగా గుర్తుండిపోతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పాఠశాలల్లోని విషయాలను కూడా రాజకీయం చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, ఇటీవల పిఠాపురంలో జరిగిన చిన్న సంఘటనకు రాజకీయ రంగు పులిమి చిన్నారులను దానిలోకి లాగే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇలాంటి వారి పట్ల పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేలాది ఎకరాలను కొల్లగొట్టే ఘనులు ఉన్న సమాజంలో పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాలల్లో ఆటస్థలాలు లేకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో భాగంగా చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూలులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘నేటి రోజుల్లో విభిన్న సృజన అనేది ప్రతి విద్యార్థికి అవసరం. గురువులు కూడా కేవలం విద్యార్థులను జీతగాళ్లుగా తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, దేశానికి పనికొచ్చేలా తీర్చిదిద్దాలి. పిల్లల్లోని సృజనను గుర్తించి వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలి. కేరళ తరహాలో విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతరం సమన్వయం చేసుకునేలా ముందుకు సాగాలి.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు మీద అందరికీ అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థి బలాలు, బలహీనతలు తెలుస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి.. ఎలా అధిగమించాలో ఇటు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలుస్తుంది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. గురువును దైవంగా భావించే సంస్కృతి మనది. గురువులు కేవలం పాఠాలే కాదు జీవితాలు చెబుతారు. వారి మార్గదర్శకంలో మనం ఎంతో ఎదుగుతాం. నాకు చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన దేశభక్తి పాఠాలు, గొప్ప నాయకుల చరిత్రలు నన్ను ఎంతో ఆలోచింపజేశాయి. ఈనాడు మీ ముందు ఇలా ఉన్నానంటే గురువులు చెప్పిన పాఠాలే ప్రధాన కారణం.
• ఉన్న స్థలాలు దోచుకుపోయేవారు ఎక్కువయ్యారు
గతంలో పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించేవారు. ఐఏఎస్ శ్రీ కృష్ణతేజ గారి తాతగారు శ్రీ మైలవరపు గుండయ్య గారు వందల ఎకరాల భూమిని ప్రజాహితం కోసం దానం చేశారు. శ్రీ మైలవరపు గుండయ్య పేరు మీద ఒక చౌక్ ఉందీ అంటే ఎంత దానశీలి అనేది తెలుస్తుంది. ఇక్కడి స్కూల్ కి శ్రీ తోట చంద్రయ్య గారు స్థలం దానం చేశారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు, మనకు అలాంటి పెద్దల దీవెనలు ఉండాలి. అయితే నేటి రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. ఉన్న స్థలాలను దోచుకుపోయేవారు ఎక్కువయ్యారు. ఇటీవల నేను మైసూరవారిపల్లె వెళ్లినపుడు అక్కడున్న పాఠశాలకు ఆట స్థలం లేదు అని తెలిసి, స్వయంగా నేను కొనుగోలు చేసి ఇచ్చాను.
* లైబ్రరీ నిండుగా పుస్తకాలు… 25 కంప్యూటర్లు అందిస్తాను
ఇప్పుడు కూడా శారద పాఠశాలకు సందర్శించినపుడు గ్రంథాలయంలో తగినన్ని పుస్తకాలు లేవని అర్థమైంది. పాఠశాలకు విభిన్నమైన పుస్తకాలతోపాటు వాటిని భద్రపరుచుకునేందుకు బీరువాలను అందజేస్తాను. ఇక్కడ లైబ్రరీ నిండుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ పుస్తకాలు ఇస్తాను. అలాగే 25 కంప్యూటర్లను పాఠశాలకు ఇస్తాను. ఆట స్థలం కోసం అధికారులు స్థలం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి.
• చదువుతోనే అద్భుతాలు జరుగుతాయి
చదువు అనేదే సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది. డబ్బు, వస్తువులు మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. చదువు మాత్రం ఎప్పుడు మన దగ్గర ఉండే శక్తి. సృజనాత్మక, శాస్త్రీయమైన చదువు ద్వారా అద్భుతాలను ఆవిష్కరించొచ్చు. కేవలం పాఠ్యపుస్తకాలే కాదు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, మహనీయుల చరిత్రలు, ఇతర పుస్తకాలను చదవడం ద్వారా ఉన్నతంగా ఎదగొచ్చు. జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. దీన్ని గురువులు, తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకొని పిల్లలను ప్రోత్సహించాలి. గ్రూప్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా పిల్లల్లో చదివే అలవాటు పెంచాలి. పిల్లలు ఉదయించే సూర్యులు. ఉత్తేజాన్ని నింపే సమాజాన్ని ఏర్పాటు చేయాలి. గురువులు ఒక్కోసారి అలసిపోవచ్చు. గురువుతో తినే చిన్న దెబ్బలే జీవితంలో మనకు గుర్తుండిపోతాయి.
• మార్కుల కోసం కాదు… భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదవండి
జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే వినూత్నమైన ఆలోచనలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదవాలి. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో పుట్టిన డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ఎదిగారు. నేడు భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకు ఒక మూలస్తంభంగా మారారు. ఆయన చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో కాదు… తమిళ మీడియంలో. మార్కులు కోసం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదివితే ఇలాంటివి అద్భుతాలు సాధించవచ్చు.
• పిల్లలను బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దండి
ఉపాధ్యాయులకు కూడా నా విన్నపం… దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలి. రేపటి సమాజం కోసం వారిని తయారు చేయాలి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుల చరిత్ర గురించి మా సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు… నా గుండెల్లోకి బలంగా వెళ్ళాయి. ఆ పాఠాలే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి. ఈ రోజు సమాజానికి ఇంత చేయగలుగుతున్నాం అంటే దానికి ఆనాడు పడిన బీజమే కారణం.
ప్రతి విద్యార్థిలో నిగూఢంగా అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. దానిని తల్లిదండ్రులు నిశితంగా గమనించాలి. పిల్లలు వారి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రోత్సహించడం, వారికి మంచి విలువలు బోధించి సరైన మార్గం చూపించడం తల్లిదండ్రుల బాధ్యత. బూతులు తిట్టే వ్యక్తుల మాటలు వినవద్దు. వాటి కోసం టీవీలు చూడవద్దు. సినిమాల పిచ్చిలో వారిని పడకుండా చూడాలి. సినిమా అనేది వినోదంలో ఒక చిన్న భాగం మాత్రమే. వారికి మన శాస్త్రవేత్తల చరిత్ర, వారు సాధించిన విజయాలు, సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను పాఠాలుగా చెప్పి పెంచాలి. మీరు కూడా రేపు పెరిగి పెద్దయ్యాక వారిలా తయారవ్వాలని ప్రోత్సహించాలి. విద్యార్థుల ఆలోచన, ప్రవర్తన, వ్యక్తిత్వమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించుకొని పిల్లలను పెంచాలి.
• గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి
సమాజంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. గంజాయి ప్రమాదం కాదు అని కొందరు మాట్లాడే స్థితికి వచ్చారంటే … సమాజం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో గంజాయిని రకరకాల పద్ధతుల్లో విస్తృతంగా వ్యాపించజేశారు. గంజాయిని చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలోనూ వ్యాప్తం చేశారు. దానిపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల నడవడికపై ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు దృష్టిసారించాలి. గంజాయి, మాదకద్రవ్యాల బారినపడితే విద్యార్థులు భవిష్యత్తును కోల్పోతారు. కూటమి ప్రభుత్వం గంజాయి నిరోధంపై సీరియస్ గా దృష్టికి పెట్టింది. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలి. జ్ఞానం అనేది ఉన్నతమైనది, విస్తృతమైనది. దాని కోసం నిరంతరం విద్యార్థులు సాధన చేయాలి” అన్నారు.
ఈ సమావేశంలో చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు, గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర క్రిస్టినా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ పి. రంజిత్ బాషా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రత్నజ్యోతి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
• విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి మమేకం
చిలకలూరిపేట స్థానిక శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మూడో మెగా పేరంట్ – టీచర్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారువిద్యార్థులతో మమేకమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. స్కూల్ లైబ్రరీని పరిశీలించి విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాలు, హ్యాండీక్రాఫ్ట్స్ చూసి మురిసిపోయారు. ఆటల్లో ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి బెంచ్ మీద కూర్చొని వారితో కాసేపు ముచ్చటించారు.
• హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు పరిశీలన
కూటమి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును విద్యా శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చూపించారు. విద్యాభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు, భావోద్వేగ సమత్యులత, మేధో సామర్థ్యాలు, సైన్స్ ప్రయోగాల పరిస్థితి, ఆటల్లో రాణింపు తదితర కోణాల్లో పిల్లల సమగ్ర వికాసానికి సంబంధించిన అంశాలను ఇందులో నమోదు చేస్తున్నట్లు వివరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్లి వాళ్ల రిపోర్టు పరిశీలించి అభినందించారు.














































