సంగం బ్యారేజ్ కు తప్పిన ముప్పు
చాకచక్యంగా మూడో పడవను ఒడ్డుకు చేర్చిన యంత్రాంగం
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు, అక్టోబర్ 30 : మోంతా తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకువచ్చి సంగం బ్యారేజ్ సమీపానికి చేరిన పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దగ్గర ఉండి నిరంతరం అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తూ పర్యవేక్షించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేసి, ప్రతి బృందానికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు.
మొత్తం 30 మంది చొప్పున ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు, 100 మంది పోలీసు సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంగా కృషి చేయడంతో పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగామని కలెక్టర్ వివరించారు..
ప్రవాహ ధాటికి తీసుకురాలేకపోయిన మూడవ పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న సమయంలో 30 టన్నుల పడవ ప్రాజెక్టుకు తగిలితే సంగం బ్యారేజ్ ఉనికే ప్రశ్నార్ధకమయ్యేదని కలెక్టర్ అన్నారు. అంతేకాకుండా 85 గేట్లతో 3,85,000 ఎకరాలు ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంగం బ్యారేజ్ కు ప్రమాదం జరిగి ఉంటే నీరు వృధాగా పోయి రాబోయే సీజన్ లో రైతులు నష్టపోయేవారన్నారు. అలాగే పొదలకూరు, సంగం గ్రామాలకు మధ్య రాకపోకలు స్థంభించేవని అన్నారు.
జిల్లా కలెక్టర్ సమయస్ఫూర్తి, సమర్ధ నిర్ణయాలతో ఎటువంటి ప్రమాదం లేకుండా సంగం బ్యారేజ్ ను, తద్వారా ప్రజలను కాపాడారని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి జిల్లా ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అభినందనలు తెలియజేశారు.
బుధవారం (29వ తేది) భారీ వర్షాల తాకిడికి పై నుండి కొట్టుకువచ్చిన మూడు పడవలలో రెండింటిని అదే రోజు ఒడ్డుకు చేర్చిన విషయం తెలిసిందే. మిగిలిన మూడవ పడవ బ్యారేజికి ఎగువన 400 మీటర్ల దూరంలో పాత ఆనకట్ట క్రైస్ట్ అడ్డుకోవడంతో నిలిచిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే.

















































