బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక
•స్క్రీనింగ్ పరీక్షకు హాజరైన 723 మందిలో మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక
•12 వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన
•14 వ తేదీ నుండి హైద్రాబాదుకు చెందిన లా-ఎక్సెలెన్సు ఐఎఎస్ ఇన్స్టిట్యూట్ వారిచే కోచింగ్ ప్రారంభం
•బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం
•బీసీ హాస్టళ్ల మరమత్తులు, పునర్నిర్మాణ పనులకు రూ. 141 కోట్లు మంజూరు
•ప్రతి బీసీ హస్టల్ లో ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు
రాష్ట్ర బీసి, ఇ.బి.సి. సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత
అమరావతి, డిశంబరు 10: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక అయినట్లు రాష్ట్ర బీసి, ఇ.బి.సి. సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షకు హాజయ్యేందుకు 864 మంది ధరఖాస్తు చేస్తుకోగా, 723 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని, వారిలో మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 12 వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించడం జరుగుతుందని, 14 వ తేదీ నుండి హైద్రాబాదుకు చెందిన లా-ఎక్సెలెన్సు ఐఎఎస్ ఇన్స్టిట్యూట్ వారిచే శిక్షణా తరగతులు ప్రారంభం అవుతాయని ఆమె తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బీసీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని తెలిపారు. 2025-26 ఏడాదికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఈ నెల 7న రాష్ట్రంలోని ఏడు జిల్లా కేంద్రాల్లో స్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షకు హాజరైన 723 మంది అభ్యర్థులలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన వంద మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరిలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. అదే విధంగా మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వ హాయాంలో బీసీల సంక్షేమాన్ని అటకెక్కించారని, వారి ఊసే పట్టించుకోలేదని మంత్రి సవిత ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే బీసీ ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. 2024-25 సంవత్సరానికి 83 మందికి సివిల్స్ శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 6500 మందికి మెగా డిఎస్సీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ అందించగా 250 మంది బీసీ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారని వారికి అభినందనలు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్స్ కు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
బీసీ హస్టల్స్, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హాస్టళ్ల మరమత్తులకు రూ. 141 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే హస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హస్టల్స్ లో 843 టాయిలెట్లు నిర్మిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించాన్న లక్ష్యంతో సన్న బియ్యం అందించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హస్టల్స్ లో కౌన్సిలింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆదరణ 3 పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, బీసీలకు ఆపన్న హస్తం అందించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి సవిత తెలిపారు. విశాఖ జిల్లాలోని సింహాచలం లో బాలురకు, శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు ఎం.జె.పి. స్కూల్ లలో బాలికలకు ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకు ఇంటర్ విద్యార్థులకు శిక్షణ నివ్వనున్నట్లు ఆమె తెలిపారు.
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎంపికైన అభ్యర్థుల్లో ప్రతిభ చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలు : పురుష అభ్యర్థుల్లో డి.శ్రీనాథ్ (బీసీ -డీ, నెల్లూరు ) 94 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఎ.వెంకటదుర్గ గణేష్(బీసీ-డి, కృష్ణా) 91 మార్కులతో రెండో ర్యాంకు,90 మార్కులు సాధించిన ఎం.ఏడుకొండలు(బీసీ-డీ, ప్రకాశం), ఎస్.తాతయ్య(బీసీ-ఏ, పశ్చిమ గోదావరి), వై.వేణుగోపాల్(బీసీ-ఏ, కర్నూలు), జి.కోటేశ్వరరావు(బీసీ-ఏ, ప్రకాశం) మూడో ర్యాంకు సాధించారు.
మహిళా అభ్యర్థుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన 89 మార్కులతో కేజీ శాంతమ్మ(బీసీ-ఏ) మొదటి ర్యాంకు, 85 మార్కులతో తుర్పుగోదావరికి చెందిన కే.జ్యోతిశ్రీ(బీసీ-) రెండో ర్యాంకు, 84 మార్కులు సాధించిన కీర్తిసాయి(బీసీ-ఏ, సత్యసాయి జిల్లా), అనంతపురం జిల్లాకు చెందిన లలితజ్యోతి(బీసీ-బీ), జి.పూజ(బీసీ-డీ, ప్రకాశం) మూడో ర్యాంకు సాధించారు.
రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, అదనపు సంచాలకు చంద్రశేఖర్ రాజు, జాయింట్ డైరెక్టర్ తనూజరాణి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.













































