పొత్తులకు సంబంధించి – ఇది ట్రైలర్ మాత్రమే.. ముందు చాలా ఉంది!!!
టీడీపీ, జనసేన పొత్తుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
తాడేపల్లి: టీడీపీ, జనసేన పొత్తుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పొత్తులకు సంబంధించి ఇది ట్రైలర్ మాత్రమే.. ముందు చాలా ఉందని సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన పేరుకు మాత్రమే పొత్తులు ప్రకటించుకున్నారు. ఒకరినొకరు సంప్రదించకుండానే అభ్యర్థుల ప్రకటన జరిగిందన్నారు. దీన్ని బట్టి చూస్తే వారి మధ్య ఏ మాత్రం సఖ్యత లేదని అభివర్ణించారు. ఇక, ఇలాంటి వారి నుంచి ప్రజలు ఏం ఆశిస్తారని ప్రశ్నించారు. ఎల్లో కూటమినే నిర్వహించలేకపోతున్నారు.. ఇక రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని నిలదీశారు. ఏపీకి బలమైన, నిర్ణయాత్మకమైన, ముందుచూపు ఉన్న ప్రభుత్వం అవసరం. అది కేవలం వైయస్ఆర్ సీపీ, సీఎం వైయస్ జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీదే మరోసారి ఘన విజయమని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.