నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలం
• గ్రామీణ, పేద విద్యార్థులకు వరం ఉచిత నైపుణ్య శిక్షణా తరగతులు
• తల్లితండ్రుల ఆకాంక్షలను నెరవేర్చటానికి SEEDAP ఎప్పుడూ ముందుంటుంది.
• రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమల్లో నైపుణ్య యువతకు భారీగా ఉపాధి అవకాశాలు
• మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత నైపుణ్య శిక్షణ పొందాలి
• టెక్నాలజీపై అవగాహన, నైపుణ్యం పెంచుకుంటే మనం ఎంచుకున్న రంగంలో సత్పలితాలు సాధ్యం
– శ్రీ. జోగి రమేష్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు.
SEEDAP ద్వారా ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణా తరగతులు గ్రామీణ పేద విద్యార్థులకు వరమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ అన్నారు. SEEDAP, DDU-GKY , స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉచిత శిక్షణ పొంది ఉపాధి పొందిన యువత అపూర్వ ఆత్మీయ కలయిక (ALUMINI MEET-2024) . SEEDAP CEO ఎంకేవీ శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం విజయవాడ లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల్లో చదవాలన్న ఆసక్తి ఉండి చదువుకోలేకపోయిన లక్షలాది మందికి జగనన్న ప్రభుత్వం చుక్కానిలా నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించి పేరున్న సంస్థల్లో ఉపాధి పొందేలా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్థిక స్థోమత సహకరించక చదువును మధ్యలోనే ఆపివేసిన వారికి సైతం శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం సంతోషకరమన్నారు. ఉపాధి పొందిన వారు మరో పది మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో SEEDAP, స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మన యువతకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి తామున్న ప్రాంతంలోనే ఉపాధి పొందేలా చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో యువతను కలిగిఉందని, అందుకనే ప్రపంచ దేశాలు ఇప్పుడు మన దేశంవైపు చూస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక విధానాలతో దిగ్గజ సంస్థలు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తరలిరావటం శుభసూచకమని మంత్రి జోగి రమేష్ అన్నారు.
యువత పెద్ద చదువులు చదవడంతో పాటు నేడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణ పొందటం, అలాగే ఇంగ్లీషు పై పట్టు సాధించటం, ఇంటర్యూలను సమర్థవంతంగా ఎదుర్కోవటం, వేదికలపై ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం వంటి అంశాలు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ అన్నారు. మన రాష్ట్రంలో 2019 నుండి ఇప్పటి వరకు 76వేలకు పైగా యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వగా వారిలో 56వేలకు పైగా యువత ఉపాధి పొందారని తెలిపారు. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వటానికి రాష్ట్రంలో ఒక స్కిల్ యూనివర్సిటీ, రాష్ట్రవ్యాప్తంగా 27స్కిల్ ట్రైనింగ్ కాలేజీలు, నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లు(స్కిల్ హబ్స్) ఏర్పాటు చేసి యువతకు పెద్ద సంఖ్యలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు అవుతున్నాయని, ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్య యువతను రాష్ట్రం ఇప్పటికే సిద్దం చేయటం జరిగిందని, దీంతో యువత స్థానికంగానే ఉపాధి పొందుతారని మంత్రి జోగి రమేష్ వివరించారు.
ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ మరో మూడు, నాలుగేళ్లలో మన దేశం మానవ వనరులు అధికంగా ఉన్న దేశంగా చైనాను దాటిపోతుందని, ఆపై రెండేళ్లలో ప్రపంచంలోనే మానవ వనరులు ఉన్న దేశంగా మన దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందన్నారు. మానవ వనరులు ఎక్కువగా ఉన్న దేశం గా నిలవటం గొప్ప కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అలా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మన యువతలో మాతృభాషతో పాటు ప్రపంచ భాషగా ఉన్న ఇంగ్లీషు పై పూర్తి పట్టు సాధించాలన్నారు. ఇందులో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ గుర్తింపు పొందిన సంస్థలతో ఒప్పందం చేసుకుని మన విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీషు పై పట్టు సాధించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదివిన విద్యార్థులతో పోటీ పడేలా ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్ధులను తయారు చేయటం గర్వకారణమన్నారు. మరో ఐదేళ్లలో యువత ఉపాధిని పొందటంలో మన రాష్ట్రం దేశంలో నే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు.
విజయవాడ నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశ పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు ఉచితంగా చదవగలిగారని, వాటి ఫలాలను ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఐబీ కరిక్యూలమ్ తో ప్రపంచ స్థాయిలో పోటీపడే మన విద్యార్థులను అతి త్వరలో చూస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ అండ్ శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉండటం మన దేశ గొప్ప సంపద, శక్తి అని అన్నారు. ఆ సంపద, శక్తిని సద్వినియోగం చేసుకున్నప్పుడు అద్భుత ఫలితాలు రాబట్టగలమని తెలిపారు. యువత ప్రపంచ మార్పులకు అనుగుణంగా టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలపై శిక్షణ పొందాలని సూచించారు. మన రాష్ట్రం సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, పేద విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సంస్థ ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదనరెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణలో మన రాష్ట్రం గుజరాత్ ను మించిపోయి మొదటి స్థానం లో నిలిచిందన్నారు. గ్రామీణ, పేద విద్యార్థుల్లో శిక్షణ తరగతులపై అవగాహన కల్పించి వారికి ఉచితంగా శిక్షణ అందించి వారు ఉపాధి పొందేలా చేయటం అభినందనీయమన్నారు. ఉన్నత చదువులు చదివిన వారితో పాటు పది, ఇంటర్, డిగ్రీ చదువులు మధ్యలో వివిధ కారణాలతో ఆపివేసిన వారికి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లు మరో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయని కొనియాడారు.
అనంతరం నైపుణ్య శిక్షణ పొందిన యువత తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో చదువును మధ్యలోనే ఆపేసి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు SEEDAP ఆపద్భాందవుడిలా నిలవటంతో పాటు కొత్త జీవితాన్ని ప్రసాదించిందన్నారు. ఇప్పుడు తాము ఎంచుకున్న రంగంలో మంచి స్థాయిలో ఉన్నామని గద్గద స్వరంతో రాష్ట్ర ప్రభుత్వానికి, శిక్షణ ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా మేథా లాంగ్వేజ్ థియోటర్, వాద్వాని ఫౌండేషన్, టాటా ట్రెన్ట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయులు కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో SEEDAP చైర్మన్ ఎస్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ, ప్రభుత్వ సలహాదారులు జి. శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.