యూనివర్సిటీలకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ ను రూపొందించండి
ఉన్నత విద్యలో పాఠ్యప్రణాళికను ప్రక్షాళనకు చర్యలు తీసుకోండి
ఐటిఐలు, యూనివర్సిటీలను నవంబర్ లోగా పరిశ్రమలతో అనుసంధానించండి
కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా రూపొందించాలి
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో వందశాతం ప్రాంగణ నియామకాలకు చర్యలు చేపట్టండి
ఉన్నత విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశం
ఉండవల్లి: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కళాశాలల్లో నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదు. అమీర్ పేటలో నాలుగు నెలల కోచింగ్ తో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఐటిఐలు, యూనివర్సిటీలను నవంబర్ లోగా పరిశ్రమలతో అనుసంధానానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారును ఆదేశించారు. ప్రైవేటు కాలేజీలను కూడా నైపుణ్యం పోర్టల్ తో అనుసంధానం చేసి ప్రాంగణ నియామకాలకు గ్యారంటీ ఇవ్వాలని, కశాశాలల్లో తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా రూపొందించాలని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపైనా సమావేశంలో చర్చించారు. సమర్ద్, ఈ – గవర్నెన్స్ పైనా సమావేశంలో చర్చించారు. యూనివర్సిటీలు, ఐటిఐ, ట్రిపుల్ ఐటీల్లో ప్రాంగణ నియామకాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల వందశాతం ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల్లో స్టూటెండ్ ఫీడ్ బ్యాక్ మెకానిజం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణతా శాతం పెంపునకు చర్యలు చేపట్టండి
ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణతా శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఇంటర్ విద్యపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్ లో చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఇకపై అన్ని గ్రూపులకు వారాంతపు పరీక్షలు నిర్వహించడంతో పాటు ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృత్తి విద్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ట్రాకింగ్ చేయాలి. ప్రైవేటు కాలేజీలకు అనుమతులపై కాలపరిమితి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపైనా మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ప్రైవేటు యూనివర్సిటీలపైనా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి, కళాశాల విద్యాశాఖ డైరక్టర్ నారాయణ భరత్ గుప్త తదితరులు పాల్గొన్నారు.













































