రైతుల నుండి నిరంతరంగా ధాన్యం కొనుగోలు జరగాలి
పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించాలి
నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, డిసెంబర్ 4 :- రైతుల నుండి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నచిన్న సమస్యలు సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్క చోటా ధాన్యం కొనుగోలు జరగలేదన్న మాట ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావని అన్నారు. నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా చక్కదిద్ది రైతుల నుండి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన నెలకు కూడా ధాన్యం డబ్బులు రైతులకు అందేవి కావని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల్లోపే ధాన్యం డబ్బులు రైతులు ఖాతాల్లో వేస్తున్నామని, దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అన్నారు. ధాన్యం సంచుల సమస్యలు కూడా తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గత ప్రభుత్వం గతేడాది 71,002 మంది రైతుల నుండి 4,43,904 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయగా….ఈ యేడాది ఇప్పటి వరకు 1,30,580 మంది రైతుల నుండి 9,14,680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలోనే డబ్బులు రైతులకు అందించామని అధికారులు వివరించారు.