FACT CHECK
- “అస్మదీయులకు అడ్డగోలుగా…” అంటూ ఓ నిర్మాణ కంపెనీకి ప్రభుత్వం అంతులేని మేలు చేస్తోందని ఆరోపిస్తూ ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధం. వాస్తవ అంశాలను ఫ్యాక్ట్ చెక్‌ద్వారా తెలియజేస్తున్నాం.
- అస్మదీయులు అంటూ ఈనాడు దినపత్రిక ఒక అడ్డగోలు ఆరోపణల చేసింది. వాస్తవం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఇదే కాంట్రాక్టు సంస్థ పట్టిసీమ సహా వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేసింది. మరి గత ప్రభుత్వంలో పనులు చేస్తే తప్పుకాదు, ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే మాత్రం తప్పు అన్నట్టుగా ఈనాడు కథనం రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం.
- ఆరోపణ : బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ గ్యారంటీలు.
వాస్తవం:ఈ కథనంలోని ఆరోపణల్లో అన్నీ అతిశయోక్తులే. కేవలం ప్రభుత్వంపై బురదజల్లాలనే ఉద్దేశంతో చేసినవి.
ముందుగా అస్మదీయుడికి అర్థం, పరమార్థం ఈనాడు దినపత్రికకే బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆరోపించిన అస్మదీయుడి కంపెనీకి ఈ పత్రికాధిపతే మధ్యవర్తిత్వం నడిపి పట్టి సీమ,పురుషోత్త పట్నం లాంటి పథకాలను చరిత్రలో ఎన్నడూ లేని విధముగా +22 శాతంతో అధిక రేట్లకు కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా!అప్పుడు ఇదే గుత్తేదారు చంద్రబాబుకు అస్మదీయుడనిఈనాడు దినపత్రికకు ఎందుకు అనిపించలేదు?
- పోలవరం ప్రాజెక్టులో 2011 -12 ధరలతో అగ్రిమెంటు అయిన తరువాత ,గత ప్రభుత్వానికి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్‌కి అడ్డగోలుగా,ఆర్ధిక నిబంధనలకు విరుద్ధముగా 2015-16 ధరలతో రూ.1,333 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టినప్పుడుఈనాడు దినపత్రికకు, ఆ పత్రిక అధినేత రామోజీరావుకు ఫైనాన్స్ కోడ్ ఎందుకు గుర్తుకు రాలేదో!
- ఈ ప్రభుత్వం అదే పోలవరం పనిని రివర్స్ టెండరింగ్ లో -12.60 శాతం తక్కువతో 660 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసి మేఘా సంస్థకు అత్యంత పారదర్శకమైన పద్దతిలో కేటాయించడం జరిగింది.
- 22 శాతం అదనంతో రూ. 257.39 కోట్ల రూపాయలు చంద్రబాబు లూటీ చేస్తే అది తప్పుకాదా? -12.60 శాతం తక్కువతో 660 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం ఆదా చేస్తే తప్పు అవుతుందా? దీన్ని పరిశీలించాక కాంట్రాక్టు సంస్థ ఎవరికి అస్మదీయులో ఇట్టే అర్థం అవుతుంది. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకోలేరని, అబద్ధపు రాతలతో విషాన్ని ఎక్కించే ప్రయత్నం ఇప్పుడు ఈనాడు చేస్తోంది. ఈనాడు దినపత్రిక గోబెల్స్ ప్రచారం చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలుగా, నిజాలు అబద్ధాలుగా మారవు. ప్రజలు విజ్ఞులు అన్నీ అర్థం చేసుకోగలరు.
- ప్రభుత్వం ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్న పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు వచ్చే మార్గాలను మూసివేసి తద్వారా అభివృద్ధికి ఆటంకం కలిగించాలన్న ఈనాడు దినపత్రిక దుర్భుద్ధి ఈ కథనంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
- మేఘా వారి ప్రతిపాదన – అందులో నిజాలు
- మేఘా కంపెనీ వారు పోలవరం ప్రొజెక్టు పనులు, అలాగే అత్యంత కీలకమైన వెలిగొండ టన్నెల్ పనులు చేస్తున్నారు. పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది.
- ఇప్పటికే ఈ ప్రభుత్వం మన ఖజానా నుండి రూ.1,319 కోట్ల రూపాయలు పోలవరం పనులకు ఖర్చుచేసింది. దాదాపు రూ. 1200 కోట్లు పనులను మేఘా కంపెనీ చేసింది. పోలవరంలో తిరిగి పనులు ప్రారంభించే సీజన్ ఆరంభమైనది. ఈ నేపథ్యంలో ఈ డబ్బును రీయింబర్స్ చేయాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తిచేయడం జరిగింది.
- మరోవైపు కేంద్ర ప్రభుత్వం వద్ద రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ పరిశీలనలో ఉంది, దానికి కేబినెట్ అప్రూవల్ అయితే కానీ జల శక్తి శాఖ నిధులు విడుదల చేయలేదు.ఈ పరిస్థితికి కారణం గత ప్రభుత్వం 2013–14 ధరలకి చేస్తామని కేంద్ర ప్రభుత్వం దగ్గర అంగీకరించి తనకు నచ్చిన గుత్తేదారులకు పనులు అప్పగించి కమీషన్లు దండుకోవడం అందరికీ తెలిసిందే.
- పోలవరం రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు క్యాబినెట్ ఆమోదం పొందేలోగా పోలవరం ప్రాజెక్టు నందు సంక్లిష్టమైన పనులను సంవత్సరంలో పనులు నడిచే డిసెంబరు నుండి జూన్‌ల మధ్య వడి వడిగా పూర్తి చేసి సేఫ్ లెవెల్ కి తీసుకురావలసిన అవసరంఎంతయినా ఉంది.
- ఈ కారణాలవల్లే మేఘా నిర్మాణ సంస్థ వెంటనే పనులు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ సదుద్దేశ్యంతో మేఘా వారు నిధుల కోసం బ్యాంకుల నుండి లోన్ తీసుకోవడానికి ఆర్థిక శాఖ అనుమతిని కోరడమైనది. ప్రభుత్వం వాటిని పరిశీలించి ప్రభుత్వ ఖజానాకి ఏ విధమైన నష్టం జరగకుండా అన్నీ షరతులతో ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నది.
- బ్యాంకు విధించే వడ్డీ తదితర రుసుములను పూర్తిగా మేఘా వారు భరించాలి. దీనికి సంబంధించిన అన్ని న్యాయపరమైన విషయాలకు మేఘా వారే బాధ్యత వహించాలి. ఇటువంటి కఠిన షరతుల మధ్య మేఘా వారి ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇందులో ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడుకుంటూ పోలవరం వెలిగొండ లాంటి ప్రజాహిత ప్రాజెక్టులలో పురోగతిని సాధించి అంతిమంగా రైతులకు నీరు ఇచ్చి వారిని ఆదుకోవాలని తన మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉంది.
- ప్రజలకు ఎంతో అవసరమైన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి భారం మోపని ఇలాంటి ప్రతిపాదనను పరిశీలిస్తుంటే, రాక్షసులు యజ్ఞాన్ని భంగం చేస్తున్న మాదిరిగా ఈనాడు దినపత్రిక దీన్ని భ్నగం చేయడానికి, ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నంచేస్తూ ఇలాంటి కథనాలు రాస్తోంది.
- ఇదే ఈనాడు దినపత్రిక నిన్నటి కథనంలో ప్రభుత్వం పట్టిసీమ పథకం నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదని తన అక్కసు అంతా వెల్లగక్కారు. మరి నిన్న మేఘా వారి అభ్యర్థనలో ఆ బిల్లు కూడా ఉంది. ఇదే రామోజీ ఈరోజు కథనంలో అదే సంస్థకు కెనరా బ్యాంకు నుండి లోన్న్‌కి ఆర్థికశాఖ ఎలా అనుమతిస్తుంది అని విషం చిమ్మారు. పైగా ఈ కథనంలో బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారులపైకూడా లేనిపోని ఆరోపణలు చేశారు.
ఈ ప్రభుత్వం మీద బురదజల్లడమే ఈనాడు పత్రిక ప్రధాన వ్యాపకంగా మారింది. ప్రజాప్రయోజనాలు కాక ప్రతిపక్ష ప్రయోజనాలు, తాము మద్దతు ఇస్తున్న చంద్రబాబు ప్రయోజనాలే ఈనాడుకు పరమావధిగా మారాయి.