ఇస్లామ్ అంటే టెర్రరిజం కాదు
ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఓ చర్చ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఈ చర్చకు ఇస్లామ్ కేంద్ర బిందువయ్యింది. దాదాపు అన్ని అన్యమతాలకు చెందిన వారిలోనూ ఇస్లామ్ పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి. ముస్లింలు హింసావాదులా? అసలు ఇస్లామ్ అంటే ఏమిటి?అనే ప్రశ్నలు జగత్తులో ఊహాగానాలు చేస్తున్నాయి. ఇలాంటి అసహజమైన, అసాంఘీకమైన వాతావరణం నెలకొనడంలో పాశ్చాత్య మీడియా, హిందూత్వ మీడియా ప్రముఖ పాత్ర వహించిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి విషయాలను విశ్లేషించుకునేందుకు ఇస్లామ్ వాస్తవిక రూపాన్ని తెల్సుకోవాల్సిన అవసరం వుంది. టెర్రరిజం స్వరూప స్వభావాలను అవగాహన చేసుకోవాల్సి వుంది.
నిజానికి ఇస్లామ్ ఓ మతం కాదు. జీవన మార్గం. ఇస్లామ్ అంటేనే శాంతి, సన్మార్గం, దైవానికి కట్టుబడి వుండటం అనే అర్థాలు వస్తాయి. అశాంతి నిండిన మనసుల్లో, సమాజాల్లో ఇస్లామ్ శాంతిని స్థాపించటానికి వచ్చింది. హింసకు నిలయమైన వ్యవస్థలో అహింసను ప్రేరేపించటానికి వచ్చింది. ఇస్లామ్ మానవులందరి మధ్య ప్రేమను పంచటానికి వచ్చింది. అంతేకాని అన్యమతస్థులపై కత్తులు దూయటానికి రాలేదు. ప్రాథమికంగా ఇస్లామ్ మానవులంతా పరస్పరం సోదరులేనని బోధిస్తుంది. ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు చెందినవారైనా అందరూ ఒక్కటేనన్న విశ్వజనీన భావనను మానవ హృదయాల్లో నాటుతుంది. పవిత్ర ఖుర్ఆన్లో ఓ చోట.
“మానవులారా నిస్సందేహంగా మేము మిమ్మల్ని ఒకే జంట ద్వారా సృష్టించాము” అని వుంది. దీనిని బట్టి మనకు తెలిసేదేమంటే దివ్యఖుర్ఆన్పై విశ్వాసమున్న ప్రతి విశ్వాసి సర్వమానవులపై ప్రేమను కలిగి వుండటం, మానవులంతా ఒకటేనన్న భావన కలిగి వుండటం తప్పనిసరి అవుతుంది. అంతేకాదు ఇస్లామ్ మానవాళిలో గొప్ప ప్రజాస్వామ్య, లౌకిక దృక్పథానికి పునాదులు వేసింది. అన్యమతస్థులపై దాడులు చేయటానికి ఇస్లాం అంగీకరించదు.ఇస్లామ్ అంటే టెర్రరిజం కాదు.ఇస్లాం అంటే శాంతి
ఆ సర్వ సృష్టికర్త ప్రసాదితమైన ప్రకృతి సర్వమానవుల పట్ల సమభావాన్ని కలిగి వున్నప్పుడు ఎవరిపట్లనైనా ద్వేషాన్ని కలిగి వుండే అధికారం మనిషికి ఎవరిచ్చారు? సత్యం ఆధారంగా తప్ప ఏ ప్రాణాన్ని హతమార్చరాదని ఆయన పవిత్ర గ్రంథం ఖుర్ఆన్లో బోధిస్తున్నప్పుడు జాతి పేరుతోనో, కులం పేరుతోనో, మతం పేరుతోనో, భాష లేదా ప్రాంతం పేరుతోనో హతమార్చే అధికారం ఎవరికీలేదు. మక్కావాసుల చేత అతిక్రూరంగా అవమానించబడ్డ, హింసించబడ్డ మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై ప్రేమను కురిపించారు. చివరికి తనకు అత్యంత ప్రియమైన బాబాయిని చంపి ఆయన కాలేయాన్ని నమిలిన వారిని సైతం తనకు దొరికినప్పుడు అన్ని అధికారాలు వున్నప్పటికీ క్షమించి వదిలేశారు. ఆయన ఈ క్షమాగుణమే, ప్రేమ మార్గమే మొత్తం అరబ్బు ఖండాన్ని జయించింది. ఆయన (స) సహచరులు సక్రమమైన మార్గంలో నడిచారు కనుకే సూర్య కిరణాలు తాకిన ప్రతి నేలను ఇస్లాం కిరణాలు స్పృశించగలిగాయి. ఖలీఫాల కాలంలో ఏదైనా ఒక కాలిబాట ముళ్ళు, రాళ్లూ, రప్పలు లేకుండా శుభ్రంగా వుంటే ఆ దారి వెంట నడిచే యూదులు, క్రైస్తవులు ఇది ముస్లింలు చేసిన పనేనని, బాటసారులకు అసౌకర్యం కలగకుండా వారు మాత్రమే ఇలాంటి సేవలు చేస్తారని అనుకునేవారు. ఈ రోజు ఎక్కడ బాంబు పేలినా, ఎక్కడ విమానం కూలినా ముస్లింలనే దోషులుగా చూపుతున్నారు. దీనికి కారణం ముస్లింలను పీడనకు గురి చేస్తున్న వారు కావచ్చు లేదా పీడనకు ప్రతిఘటనగా హింసే ఆయుధంగా మలుచుకున్న దారి తప్పిన టెర్రరిజమే కారణం కావచ్చు. కారణాలు ఏవైనా నష్టపోతుంది మాత్రం సామాన్య ప్రజానీకం
సమాజంలో ముస్లిమ్ ప్రవర్తన ఏవిధంగా వుండాలో మహా ప్రవక్త ముహమ్మద్ (స) వివరించారు.
“నీ పై దౌర్జన్యానికి పాల్పడిన వారిని క్షమించు, నీ పట్ల చెడుగా వ్యవహరించే వారి పట్ల మంచిగా వ్యవహరించు.”
మక్కాలో దౌర్జన్యపరుల దౌర్జన్యం శ్రుతి మించినపుడు కూడా ప్రవక్త(స) సహనాన్నే బోధించారు.
“ఓ అలీ యాసిర్ (యాసిర్ సంతానమా) సహనం వహించండి. నిస్సందేహంగా మీ నివాసం స్వర్గం.”
మహాప్రవక్త (స) అనుసరించిన ఈ విధానం ప్రవక్త (స) సహనశీలతను, దూరదృష్టిని, బుద్ధి కుశలతను, సందేశ వ్యాప్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది.ఇస్లామ్కన్న ఈ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలోనే నేడు ముస్లింలు విఫలమౌతున్నారు. ఈ వైఫల్యం లోంచే కొంతమంది దారితప్పిన యువకులు నిరాశా నిస్పృహలకు గురౌతున్నారు. ఇది సరియైన విధానం కాదు. “మలినాన్ని మలినంతో శుద్ధి పరచలేము” – మహా ప్రవక్త ముహమ్మద్ (స)
పై మాటను బట్టి మనకర్ధమయ్యే విషయం ఇస్లామ్ ద్వేషానికి సమాధానం ద్వేషం కాదని చెప్తుంది. ఇస్లామ్ ప్రేమను నిర్మిస్తుంది. అనాధల పట్ల, వితంతువుల పట్ల, పొరుగువారి పట్ల, చివరికి మహా శక్తివంతుడైన దైవం పట్ల అవ్యాజ్యమైన ప్రేమను కలిగివుండేలా మానవుడ్ని సంస్కరిస్తుంది. ఇస్లామ్లో నిగూఢమైన ఈ అనంతమైన శక్తి ముందు కత్తికట్టిన ఎన్నో కరవాలాలు కూలిపోయాయి. ఎన్నో సామ్రాజ్యాలు తలలు వంచాయి. అపారశక్తివంతమైన మంగోలియన్ సైనిక శక్తి సైతం ముస్లిమ్లపై దాడి చేసి లక్షలమందిని హతమార్చగలిగింది కాని ఇస్లామ్ నైతిక శక్తి ముందు ఓడిపోయి వినయంతో ఇస్లాం స్వీకరించింది. శాంతి, ప్రేమ, సహనం, సేవ, సౌశీల్యం అనే పునాదులపైనే ఇస్లాం సౌధం నిలబడి వుంది. అంతేకాని హింస, ద్వేషం, టెర్రరిజం అనే మతిమాలిన విషయాలపై కాదు. పరివార్, అమెరికా, ఇజ్రాయెల్ ఉగ్రవాదాలకు సమాధానం ఉగ్రవాదం కాదు. కానేరదు.