తాడేపల్లి:
అమెరికాలోని 11 నగరాల్లో భాగంగా నాలుగు నగరాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగిన శ్రీ శ్రీనివాస కల్యాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో USA లోని జూన్ 17 వ తేదీన ర్యాలీ(నార్త్ కరోలినా), 18న జాక్సన్ విల్(ఫ్లోరిడా) 24 న డెట్రాయిట్ మరియు 25 న చికాగో నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారు NRI భక్తులకు దర్శనమిచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే…. ఆయా నగరాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించాలని పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు, ఈవో గారి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు… భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ నాలుగు నగరాల్లో స్వామివారి కల్యాణానికి వేదికను అలంకరించిన తీరు ఒక్కో నగరం లో ఒక్కోలాగా అందంగా అలంకరించారు. ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 12 వేలకు పైగా స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఆయా నగరాల్లోని నిర్వాహకులు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని, ఏర్పాట్లన్నీ ఘనంగా చేసారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొన్న అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది.
ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రవాసాంధ్రుల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మరియు APNRTS అధ్యక్షులు అయిన శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నార్త్ అమెరికాలోని 14 నగరాల్లో చేపట్టిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాల్లో, ఇప్పటికే తితిదే చైర్మన్ శ్రీ. వై.వి. సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో కెనడా లోని 03 నగరాల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు USA లోని 04 నగరాల్లో నిర్వహించడం జరిగింది. తితిదే అర్చకులు, వేదపండితుల ద్వారా కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధాన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాలు నిర్వహించారన్నారు. ఇంకా USA లోని జూలై 1వ తేదీ నుండి జూలై 23 వ తేదీ వరకు ౦7 నగరాల్లో జరిగే శ్రీవారి కల్యాణంలో టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు పాల్గొననున్నారని శ్రీ వెంకట్ పేర్కొన్నారు.
USAలో ర్యాలీలో జరిగిన కల్యాణోత్సవంలో శ్రీ ఈశ్వర్ రెడ్డి, శ్రీ మహిపాల్ మాలే, జాక్సన్ విల్ లో శ్రీ మల్లికార్జున జెర్రిపోతుల, ప్రభుత్వ సలహాదారు డా. ఎన్. వాసుదేవ రెడ్డి, డెట్రాయిట్ లో శ్రీ మహేష్ చింతలపాటి, శ్రీ బాలాజీ సత్యవరపు, శ్రీ ఎస్. నరేన్, చికాగోలో శ్రీ శరత్ ఎట్టపు, శ్రీ నరసింహ రెడ్డి మరియు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు.
ఈ కార్యక్రమంలో తితిదే నుండి AEO (Gen) శ్రీ. బి. వెంకటేశ్వర్లు, SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు మరియు భారతీయులు పాల్గొన్నారు. SVBC ఛానెల్ కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్