-
ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు రైల్ కనెక్టివిటీ
-
ఏపీ పోర్టులతో పొరుగు రాష్ట్రాల హింటర్ ల్యాండ్ లింక్
-
2027 నాటి కల్లా 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి
-
పుష్కరాల నాటికి రాజమండ్రి, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి
-
రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్ కావాలి
-
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 28 : ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని… రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్‌గా నిలిపేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లోని హింటర్ ల్యాండ్ ను ఏపీ పోర్టులు అన్నింటితో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. తెలంగాణా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైల్ రవాణాకు నెలకొన్న అవకాశాలనూ చర్చించారు. రాష్ట్రంలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని… మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరితగతిన కనెక్టు చేయాలని సీఎం అన్నారు. తిరుపతి-రేణిగుంట ప్రాంతం కూడా పారిశ్రామిక హబ్‌గా తయారవుతోందని, దీనిని కూడా ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా, తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఇచ్ఛాపురం-తడ మధ్య 4 వరుసల రైల్వే లైన్లు నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చేలా డీపీఆర్ తయారు చేయాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో ఎక్కడ 2 లైన్లు, ఎక్కడ 3 లైన్లు ఉన్నాయనే దానిపై అధ్యయనం చేసి 4 వరుసల లైన్ నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూసేకరణ… తదితర ప్రక్రియలకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డిప్యూటీ తహసిల్దార్లను నియమించాలని రాష్ట్ర ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ఎంత వేగంగా సాగుతుందో, అంతే వేగం రైల్వే లైన్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. ఏపీని యూనిట్‌గా తీసుకుని రైల్వే ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అమృత్ పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను 2027 కల్లా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాయలసీమ-కోస్తాంధ్ర మధ్య కనెక్టివిటీ పెంచండి
రాయలసీమ – కోస్తాంధ్ర మధ్య కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించే అంశంపైనా పరిష్కారాన్ని చూపాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. రాజధాని అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం- నంబూర్ కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదనను త్వరగా పట్టాలెక్కించాలని రైల్వే అధికారులకు సూచించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్ సహా అన్ని ప్రధాన నగరాలను అమరావతి కోర్ కేపిటల్‌తో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. కడప- బెంగుళూరు కొత్త బ్రాడ్ గేజ్ లైన్ పైనా వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడ, గుంటూరులలో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించాలని, అమరావతి, గన్నవరం టెర్మినళ్లను నూతనంగా నిర్మించే ప్రతిపాదనల్ని త్వరితగతిన కార్యరూపంలోకి తేవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని అధికారులకు సీఎం సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 1,012 ప్రత్యేక రైల్ సర్వీసులను నడిపేందుకు, 2,370 రైల్వే కోచ్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు వివరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను పీపీపీ విధానంలో చేపడుతున్నామని రైల్వేశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 808 వరకూ ఉన్న రైల్వే క్రాసింగ్స్‌కు పరిష్కారం చూపేలా… రైల్వే లెవల్ క్రాసింగ్స్ ఇబ్బందులు లేకుండా ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టాలని సీఎం చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ 2029 మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు.
నిర్మాణ దశలో రూ.34,310 కోట్ల విలువైన ప్రాజెక్టులు
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ పెంచడంపైనా, విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ కొత్త రైల్వే మార్గాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్-చెన్నయ్, చెన్నయ్-బెంగళూర్, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బెంగళూరు నుంచి చిత్తూరు, తిరుపతి మీదుగా అమరావతికి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వచ్చేలా చూడాలన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సర్వేలు చేపట్టామని… 864 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈ కారిడార్ కోసం రూ.1,90,907 కోట్ల మేర వ్యయం అవుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో 2,318 కిలోమీటర్ల పొడవున రూ.34,310 కోట్ల విలువైన మొత్తం 39 కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులు చేపట్టామని ముఖ్యమంత్రికి రైల్వే అధికారులు వివరించారు. ఈ ఏడాది 201 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రైల్వే రూట్ డెన్సిటీ పరంగా రాష్ట్రంలో ప్రతీ వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఏపీలో 24.82 కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయని, తమిళనాడుతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయలసీమను కోస్తా జిల్లాలతో అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, రాష్ట్ర రవాణా, ఆర్ధిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















































